౧౫
ఏడు పాత్రలు పట్టుకుని ఉన్న ఏడుగురు దూతలు
౧ పరలోకంలో మరో ఆశ్చర్యకరమైన గొప్ప సంకేతం నేను చూశాను. అదేమిటంటే ఏడుగురు దేవదూతలు తమ చేతుల్లో ఏడు తెగుళ్ళు పట్టుకుని ఉన్నారు. ఇవి చివరివి. వీటితో దేవుని ఆగ్రహం తీరిపోతుంది.
౨ తరువాత నేను ఒక గాజు సముద్రం లాంటిది చూశాను. దానితో అగ్ని కలసి ఉంది. క్రూర మృగాన్నీ, దాని విగ్రహాన్నీ, దాని పేరునూ సూచించే సంఖ్యనూ జయించిన వారు ఆ గాజు సముద్రం దగ్గర నిలబడి ఉండడం నేను చూశాను. వారి చేతుల్లో దేవుడు ఇచ్చిన తీగ వాయిద్యాలు ఉన్నాయి.
౩ వారు దేవుని సేవకుడైన మోషే పాట, గొర్రెపిల్ల పాట పాడుతూ,
“ప్రభువైన దేవా, సర్వపరిపాలకా, నీవి గొప్పకార్యాలు, అద్భుతాలు.
సార్వభౌమా, నీ విధానాలు న్యాయమైనవి, సత్యమైనవి.
౪ ప్రభూ, నువ్వు మాత్రమే పరిశుద్ధుడివి, నీకు భయపడనివారెవరు? నీ నామాన్ని కీర్తించనిదెవరు?
నీ న్యాయక్రియలు అందరికీ తెలిశాయి. కాబట్టి అన్ని జాతుల వారూ నీ సన్నిధికి వచ్చి నిన్ను పూజిస్తారు.”
౫ ఆ తరువాత నేను చూస్తున్నప్పుడు పరలోకంలో సాక్షపు గుడారం ఉన్న అతి పరిశుద్ధ స్థలం తెరుచుకుంది. ౬ అప్పుడు ఏడు తెగుళ్ళు చేతిలో పట్టుకుని ఏడుగురు దూతలు ఆ పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చారు. వారంతా పవిత్రమైన, ప్రకాశవంతమైన బట్టలు వేసుకుని ఉన్నారు. రొమ్ముకు బంగారు వల్లెవాటు కట్టుకుని ఉన్నారు.
౭ అప్పుడు ఆ నాలుగు ప్రాణుల్లో ఒకడు ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకు ఇచ్చాడు. ఆ పాత్రల్లో నిత్యం జీవించే దేవుని ఆగ్రహం నిండి ఉంది. ౮ దేవుని యశస్సు నుండీ, బలం నుండీ లేచిన పొగతో అతి పరిశుద్ధ స్థలం నిండిపోయింది. కాబట్టి ఆ ఏడుగురు దూతలకిచ్చిన కీడులన్నీ జరిగే వరకూ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరూ ప్రవేశించలేకపోయారు.