౧౨౪
దావీదు రాసిన యాత్రల కీర్తన
౧ ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా చెప్పాలి. యెహోవా మనకు తోడుగా ఉండకపోతే,
౨ మనుషులు మన మీదికి ఎగబడినప్పుడు, యెహోవా మనకు తోడుగా ఉండకపోతే,
౩ వాళ్ళ ఆగ్రహజ్వాలలు మనపై రగులుకున్నప్పుడు వాళ్ళు మనలను ప్రాణాలతోనే దిగమింగి ఉండేవాళ్ళు.
౪ నీళ్ళు మనలను కొట్టుకుపోయేలా చేసి ఉండేవి. ప్రవాహాలు మనలను ముంచెత్తి ఉండేవి.
౫ జల ప్రవాహాల పొంగు మనలను ఉక్కిరిబిక్కిరి చేసి ఉండేవి.
౬ వారి పళ్ళు మనలను చీల్చివేయకుండా కాపాడిన యెహోవాకు స్తుతి.
౭ వేటగాడి ఉరి నుండి పక్షి తప్పించుకొన్నట్టు మన ప్రాణం తప్పించుకుంది. ఉరి తెగిపోయింది. మనం తప్పించుకున్నాము.
౮ భూమినీ, ఆకాశాలనూ సృష్టించిన యెహోవాయే మనకు సహాయం.