౧౧౧
౧ యెహోవాను స్తుతించండి. యథార్థవంతుల సభలో, సమాజంలో పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను.
౨ యెహోవా క్రియలు గొప్పవి. వాటిని ఇష్టపడేవారంతా వాటిని తలపోస్తారు.
౩ ఆయన పనులు మహిమా ప్రభావాలు గలవి. ఆయన నీతి నిత్యం నిలకడగా ఉంటుంది.
౪ ఆయన తన ఆశ్చర్యకార్యాలకు జ్ఞాపకార్థ సూచన నియమించాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు.
౫ తన పట్ల భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిచ్చాడు. ఆయన నిత్యం తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు.
౬ ఆయన తన ప్రజలకు అన్యజాతుల ఆస్తిపాస్తులను అప్పగించాడు. తన క్రియల మహాత్మ్యాన్ని వారికి వెల్లడి చేశాడు.
౭ ఆయన పనులు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనాలన్నీ నమ్మదగినవి.
౮ అవి శాశ్వతంగా స్థాపించబడి ఉన్నాయి. సత్యంతో, యథార్థతతో అవి తయారైనాయి.
౯ ఆయన తన ప్రజలకు విమోచన కలగజేసేవాడు. తన నిబంధన ఆయన శాశ్వతంగా ఉండాలని ఆదేశించాడు. ఆయన నామం పవిత్రం, పూజ్యం.
౧౦ యెహోవా పట్ల భయం జ్ఞానానికి మూలం. ఆయన శాసనాలను అనుసరించేవారంతా మంచి వివేకం గలవారు. ఆయనకు నిత్యం స్తోత్రం.