౯౪
౧ ప్రతీకారం చేసే దేవా! యెహోవా! ప్రతీకారం చేసే దేవా! మా మీద ప్రకాశించు.
౨ లోక న్యాయమూర్తీ, లే! గర్విష్టులకు తగినట్టుగా ప్రతిఫలం ఇవ్వు.
౩ యెహోవా, దుర్మార్గులు ఎంతకాలం, ఎంతకాలం గెలుస్తారు?
౪ వాళ్ళు గర్వంగా తిరస్కారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా గొప్పలు చెప్పుకుంటున్నారు.
౫ యెహోవా, వాళ్ళు నీ ప్రజలను అణిచివేస్తున్నారు. నీకు చెందిన జాతిని బాధిస్తున్నారు.
౬ వాళ్ళు వితంతువులనూ విదేశీయులనూ చంపేస్తున్నారు. అనాథలను హత్య చేస్తున్నారు.
౭ వారు యెహోవా చూడడు, యాకోబు దేవుడు ఇదంతా గమనించడు, అంటారు.
౮ బుద్ధిలేని ప్రజలారా, తెలుసుకోండి. మూర్ఖులారా, మీరెప్పుడు నేర్చుకుంటారు?
౯ చెవులిచ్చినవాడు వినలేడా? కళ్ళు చేసినవాడు చూడలేడా?
౧౦ రాజ్యాలను అదుపులో పెట్టేవాడు సరిచేయడా? మనిషికి తెలివి ఇచ్చేవాడు ఆయనే.
౧౧ మనుషుల ఆలోచనలు యెహోవాకు తెలుసు, అవి పనికిరానివని ఆయనకు తెలుసు.
౧౨ యెహోవా, నీ దగ్గర శిక్షణ పొందేవాడు నీ ధర్మశాస్త్రంలో నుంచి నీ దగ్గర నేర్చుకునేవాడు ధన్యుడు.
౧౩ దుర్మార్గులకు గుంట తవ్వే వరకూ అతని కష్టకాలాల్లో నువ్వు నెమ్మది ఇస్తావు.
౧౪ యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు. తన సొత్తును వదిలి పెట్టడు.
౧౫ న్యాయం గెలుస్తుంది, నిజాయితీపరులంతా దాన్ని అనుసరిస్తారు.
౧౬ దుర్మార్గుల ఎదుట నా పక్షాన ఎవరు నిలబడతారు? దుష్టులకు వ్యతిరేకంగా నా కోసం ఎవరు నిలుస్తారు?
౧౭ యెహోవా నాకు సాయం రాకపోతే నేను మరణనిశ్శబ్దంలో పండుకునే వాడినే.
౧౮ నా కాలు జారింది అని నేనంటే, యెహోవా, నీ కృప నన్ను ఎత్తిపట్టుకుంది.
౧౯ నా లోని ఆందోళనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసి నన్ను బెదిరిస్తుంటే, నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగచేసింది.
౨౦ దుర్మార్గ పాలకులు నీతో జత కట్టగలరా? అన్యాయం చేద్దామని వాళ్ళు చట్టం కల్పిస్తారు.
౨౧ వాళ్ళు నీతిమంతులకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతారు. నిర్దోషులకు మరణ దండన విధిస్తారు.
౨౨ అయితే యెహోవా నాకు ఎత్తయిన కోట. నా దేవుడు నాకు ఆశ్రయదుర్గం.
౨౩ ఆయన వాళ్ళ దోషం వాళ్ళ మీదికి రప్పిస్తాడు. వాళ్ళ చెడుతనంలోనే వాళ్ళను నాశనం చేస్తాడు. మన యెహోవా దేవుడు వాళ్ళను నాశనం చేస్తాడు.