౮౨
ఆసాపు కీర్తన
౧ దివ్య సమాజంలో దేవుడు నిలబడి ఉన్నాడు. దేవుళ్ళ మధ్య ఆయన తీర్పు తీర్చేవాడు.
౨ ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తారు? ఎంతకాలం మీరు దుర్మార్గుల పట్ల పక్షపాతం చూపుతారు?
సెలా.
౩ పేదలకు, అనాథలకు న్యాయం చేయండి, అణగారినవాళ్ళ, అనాథల హక్కులను పరిరక్షించండి.
౪ పేదలనూ దరిద్రులనూ విడిపించండి. దుర్మార్గుల చేతిలోనుంచి వాళ్ళను తప్పించండి.
౫ వాళ్లకు తెలివి లేదు, అర్థం చేసుకోలేరు. వాళ్ళు చీకట్లో తిరుగుతుంటారు. భూమి పునాదులన్నీ చితికి పోతున్నాయి.
౬ మీరు దేవుళ్ళు, మీరంతా సర్వోన్నతుని కుమారులు, అని నేను అన్నాను.
౭ అయినా ఇతరుల్లాగే మీరూ చనిపోతారు అధికారుల్లోని ఒకరిలాగా కూలిపోతారు.
౮ దేవా, లేచి భూమికి తీర్పు తీర్చు. నువ్వు రాజ్యాలన్నిటినీ వారసత్వంగా పొందుతావు.