౮
ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. గిత్తీత్ రాగం.
౧ యెహోవా మా ప్రభూ, పై ఆకాశాలలో నీ మహిమను చూపించేవాడా, భూమి అంతటిలో నీ నామం ఎంత వైభవం గలది!
౨ శత్రువునూ, ప్రతీకారం చేసేవాణ్ణీ నోరు మూయించడానికీ, నీ విరోధుల కారణంగా, పసికందుల, చంటి పిల్లల నోటిలో నువ్వు స్తుతిని సృష్టించావు.
౩ నీ చేతి వేళ్ళు తయారు చేసిన నీ ఆకాశాలనూ, వాటి తావులలో నీవుంచిన చంద్రనక్షత్రాలనూ నేను చూసినప్పుడు,
౪ నువ్వు పట్టించుకోవడానికి మానవజాతి ఏ పాటిది? నువ్వు మానవాళి పట్ల శ్రద్ధ చూపడానికి వారు ఎంతటివాళ్ళు?
౫ అయినా, నువ్వు వాళ్ళను స్వర్గలోక ప్రాణులకన్నా కొంచెం మాత్రమే తక్కువగా చేశావు. వాళ్లకు మహిమా ప్రభావాల కిరీటం పెట్టావు.
౬ నీ చేతిపనుల మీద అతనికి పరిపాలన ఇచ్చావు.
౭ గొర్రెలను, ఎడ్లను, అడవి మృగాలను సైతం,
౮ ఆకాశ పక్షులను, సముద్ర ప్రాణులను, సముద్ర ప్రవాహాల్లో తిరిగే వాటిని నువ్వు అతని పాదాల కింద ఉంచావు.
౯ యెహోవా మా ప్రభూ, భూమి అంతటిలో నీ నామం ఎంత వైభవం గలది!