౨౦
౧ యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు, ౨  “నీవు ఇశ్రాయేలీయులతో ఈ విధంగా చెప్పాలి, తెలియక పొరపాటున ఎవరినైనా చంపిన హంతకుడు పారిపోడానికి నేను మోషే ద్వారా మీతో పలికించిన ఆశ్రయ పట్టణాలు మీరు ఏర్పరచుకోవాలి. ౩ హత్య విషయమై ప్రతిహత్య చేసేవాడు రాకుండా అవి మీకు ఆశ్రయ పట్టణాలవుతాయి. ౪ ఒకడు ఆ పట్టణాల్లో ఒక దానికి పారిపోయి ఆ పట్టణ ద్వారం దగ్గర నిలబడి, ఆ పట్టణపు పెద్దలు వినేలా తన సంగతి చెప్పిన తరువాత, వారు పట్టణంలోకి అతనిని చేర్చుకుని తమ దగ్గర నివసించడానికి స్థలమివ్వాలి.
౫ హత్య విషయంలో ప్రతి హత్య చేసేవాడు అతనిని తరిమితే అతని చేతికి ఆ నరహంతకుని అప్పగించకూడదు. ఎందుకంటే అతడు పొరపాటున తన పొరుగువాని చంపాడు గాని అంతకు మునుపు వానిమీద పగపట్టలేదు. ౬ అతడు సమాజం ముందు విచారణకు నిలబడే వరకూ, ఆ రోజుల్లో ఉన్న యాజకుడు చనిపోయే వరకూ ఆ పట్టణంలోనే నివసించాలి. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయాడో ఆ పట్టణంలోని తన ఇంటికి తిరిగి రావాలి.”
౭ అప్పుడు వాళ్ళు గలిలీలోని నఫ్తాలి కొండ ప్రదేశంలో ఉన్న కెదెషు, ఎఫ్రాయిం కొండ ప్రదేశంలోని షెకెం, యూదా కొండ ప్రదేశంలోని హెబ్రోను అనే కిర్యతర్బాను ప్రతిష్ఠించారు. ౮ తూర్పు వైపున యొర్దాను అవతల యెరికో దగ్గర రూబేను గోత్రం నుండి మైదానం మీద ఉన్న అరణ్యంలోని బేసెరు, గాదు గోత్రం నుండి గిలాదు లోని రామోతు, మనష్షే గోత్రం నుండి బాషానులోని గోలానులను నియమించారు. ౯ పొరపాటున ఒకడి చంపినవాడు అక్కడికి పారిపోయి హత్యవిషయమై ప్రతిహత్య చేసేవాడు చంపకుండా ఉండేలా సమాజం ముందు నిలబడే వరకూ ఇశ్రాయేలీయులందరికీ వారిమధ్య నివసించే పరదేశులకూ నియమించిన పట్టణాలు ఇవి.