౩
౧ ఆ తరువాత యోబు మాట్లాడడం మొదలుపెట్టాడు. తాను పుట్టిన దినాన్ని శపించాడు. ౨ యోబు ఇలా అన్నాడు.
౩ నేను పుట్టిన రోజు లేకుండా ఉంటే బాగుండేది. “మగ పిల్లవాడు పుట్టాడు” అని చెప్పే రాత్రి సమయం లేకపోయినట్టయితే బాగుండేది. నా తల్లి గర్భాన్ని ఆ రోజు మూసి ఉంచితే బాగుండేది. ఆ రోజు నా కళ్ళకు బాధను మరుగు చేయలేకపోయింది.
౪ ఆ రోజు చీకటిమయం కావాలి. దాని మీద వెలుగు ప్రకాశించకూడదు. పైన ఉన్న దేవుడు ఆ రోజును లెక్కించకూడదు.
౫ చీకటి, గాఢాంధకారం మళ్ళీ దాన్ని తమ దగ్గరికి తీసుకోవాలి. దాన్ని మేఘాలు ఆవరించాలి. పగటివేళ చీకటి కమ్మినట్టు దానికి భయాందోళన కలగాలి.
౬ కటిక చీకటి ఆ రాత్రిని ఒడిసి పట్టాలి. సంవత్సరం రోజుల్లో నేనూ ఒకదాన్నని అది చెప్పుకోకుండా ఉండాలి. ఏ నెలలోనూ అది భాగం కాకూడాదు.
౭ ఆ రాత్రి ఎవ్వరూ పుట్టకపోతే బాగుండేది. అప్పుడు ఎవ్వరూ హర్ష ధ్వానాలు చెయ్యకపోతే బాగుండేది.
౮ శపించేవాళ్ళు ఆ రోజును శపించాలి. సముద్ర రాక్షసిని రెచ్చగొట్టే వాళ్ళు దాన్ని శపించాలి.
౯ ఆ దినాన సంధ్యవేళలో ప్రకాశించే నక్షత్రాలకు చీకటి కమ్మాలి. వెలుగు కోసం అది ఎదురు చూసినప్పుడు వెలుగు కనబడకూడదు.
౧౦ అది ఉదయ సూర్య కిరణాలు చూడకూడదు. పుట్టిన వెంటనే నేనెందుకు చనిపోలేదు?
౧౧ తల్లి గర్భం నుండి బయటపడగానే నా ప్రాణం ఎందుకు పోలేదు?
౧౨ నన్నెందుకు మోకాళ్ల మీద పడుకోబెట్టుకున్నారు? నేనెందుకు తల్లి పాలు తాగాను?
౧౩ లేకపోతే ఇప్పుడు నేను పడుకుని ప్రశాంతంగా ఉండేవాణ్ణి. నేను చనిపోయి విశ్రాంతిగా ఉండేవాణ్ణి.
౧౪ శిథిలమైపోయిన భవనాలు తిరిగి కట్టించుకునే భూరాజుల్లాగా, మంత్రుల్లాగా నేను కూడా చనిపోయి ప్రశాంతంగా ఉండేవాణ్ణి.
౧౫ బంగారం సంపాదించుకుని, తమ ఇంటినిండా వెండిని నింపుకున్న అధికారుల్లాగా నేను కన్నుమూసి ఉండేవాణ్ణి.
౧౬ భూమిలో పాతిపెట్టబడిన పిండంలాగా వెలుగు చూడని పసికందులాగా నాకిప్పుడు ఉనికి ఉండేది కాదు.
౧౭ అక్కడ దుర్మార్గులు ఇక బాధపెట్టరు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి పొందుతారు.
౧౮ అక్కడ బంధితులైన వారు కలసి విశ్రమిస్తారు. వాళ్ళ చేత పనులు చేయించేవాళ్ళ ఆజ్ఞలు వాళ్లకు వినిపించవు.
౧౯ పేదవారు, గొప్పవారు అంతా అక్కడ ఉన్నారు. దాసులు తమ యజమానుల చెర నుండి తప్పించుకుని స్వతంత్రులయ్యారు.
౨౦ దుర్దశలో ఉన్నవారికి వెలుగు ఎందుకు? దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఎందుకు?
౨౧ వారు మరణం కోరుకుంటారు. దాచిపెట్టిన నిధి కోసం వాళ్ళు లోతుగా తవ్వుతున్నారు గాని అది వారికి దొరకడం లేదు.
౨౨ వాళ్ళు సమాధికి చేరినప్పుడు వారు ఆనందిస్తారు, ఎంతో సంబరపడతారు.
౨౩ మార్గం కనుగొనలేని వాడికి, దేవుడు చుట్టూ కంచె వేసిన వాడికి జీవం ఎందుకు?
౨౪ భోజనం చేయడానికి బదులు నాకు నిట్టూర్పులు కలుగుతున్నాయి. నేను చేసే ఆక్రందనలు నీళ్లలాగా పారుతున్నాయి.
౨౫ ఏమి జరుగుతుందని నేను భయపడ్డానో అదే నాకు జరిగింది. నేను భయపడినదే నా మీదికి వచ్చింది.
౨౬ నాకు శాంతి లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు. వీటికి బదులు కష్టాలే వచ్చాయి.