౧౯
యేసుకు ముళ్ళ కిరీటం (మత్తయి 27:27-30. మార్కు 15:16-20)
౧ ఆ తరువాత పిలాతు యేసును పట్టుకుని కొరడాలతో కొట్టించాడు. ౨-౩ సైనికులు ముళ్ళతో కిరీటం అల్లి, ఆయన తలమీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన దగ్గరికి వచ్చి, “యూదుల రాజా, జయహో,” అని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టారు.
జన సమూహం ఎదుట యేసు
౪ పిలాతు మళ్ళీ బయటకు వెళ్ళి ప్రజలతో, “ఈ మనిషిలో ఏ అపరాధం నాకు కనిపించలేదని మీకు తెలిసేలా ఇతణ్ణి మీ దగ్గరికి బయటకి తీసుకుని వస్తున్నాను” అని వారితో అన్నాడు. ౫ కాబట్టి, యేసు బయటకు వచ్చినప్పుడు ముళ్ళ కిరీటం పెట్టుకుని, ఊదారంగు వస్త్రం ధరించి ఉన్నాడు. అప్పుడు పిలాతు వారితో, “ఇదిగో ఈ మనిషి!” అన్నాడు. ౬ ముఖ్య యాజకులు, యూదుల అధికారులు యేసును చూసి, “సిలువ వెయ్యండి, సిలువ వెయ్యండి!” అని, కేకలు వేశారు. పిలాతు వారితో, “ఈయనలో నాకు ఏ అపరాధం కనిపించడం లేదు కాబట్టి మీరే తీసుకువెళ్ళి ఇతన్ని సిలువ వెయ్యండి” అన్నాడు.
౭ యూదులు పిలాతుతో, “మాకొక చట్టం ఉంది, అతడు తనను తాను దేవుని కుమారుడుగా ప్రకటించుకున్నాడు కాబట్టి, ఆ చట్టాన్ని బట్టి అతడు చావ వలసిందే,” అన్నారు. ౮-౯ పిలాతు ఆ మాట విని ఇంకా ఎక్కువగా భయపడి, మళ్ళీ న్యాయ సభలో ప్రవేశించి, “నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు?” అని యేసును అడిగాడు. అయితే అతనికి ఏ జవాబూ చెప్పలేదు. ౧౦ అప్పుడు పిలాతు ఆయనతో, “నువ్వు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చెయ్యడానికీ, సిలువ వెయ్యడానికీ, నాకు అధికారం ఉందని నీకు తెలియదా?” అన్నాడు.
౧౧ యేసు జవాబిస్తూ, “నీకు ఆ అధికారం పైనుంచి వస్తే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. కాబట్టి నన్ను నీకు అప్పగించిన వాడికి ఎక్కువ పాపం ఉంది” అన్నాడు. ౧౨ అప్పటి నుంచి పిలాతు యేసును విడుదల చెయ్యాలని ప్రయత్నం చేశాడు గాని యూదులు కేకలు పెడుతూ, “నువ్వు ఇతన్ని విడుదల చేస్తే, సీజరుకు మిత్రుడివి కాదు. తనను తాను రాజుగా చేసుకున్నవాడు సీజరుకు విరోధంగా మాట్లాడినట్టే” అన్నారు. ౧౩ పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసుకొచ్చి, ‘రాళ్ళు పరచిన స్థలం’లో న్యాయపీఠం మీద కూర్చున్నాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి ‘గబ్బతా’ అని పేరు.
రాజును ప్రజలు, యూదుల పెద్దలు చివరిగా తిరస్కరించడం
౧౪ అది పస్కా సిద్ధపాటు రోజు. ఉదయం ఇంచుమించు ఆరు గంటల సమయం. అప్పుడు పిలాతు యూదులతో, “ఇదిగో మీ రాజు!” అన్నాడు. ౧౫ వారు కేకలు పెడుతూ, “చంపండి, చంపండి, సిలువ వేయండి!” అని అరిచారు. పిలాతు వారితో, “మీ రాజును సిలువ వేయమంటారా?” అన్నాడు. ముఖ్య యాజకులు “మాకు సీజరు తప్ప వేరే రాజు లేడు” అన్నారు.
యేసుక్రీస్తు సిలువ (మత్తయి 27:33-54. మార్కు 15:22-39. లూకా 23:33-47)
౧౬ అప్పుడు పిలాతు, సిలువ వేయడానికి యేసును వారికి అప్పగించాడు. వారు యేసును తీసుకువెళ్ళారు. ౧౭ తన సిలువ తానే మోసుకుంటూ బయటకు వచ్చి, ‘కపాల స్థలం’ అనే ప్రాంతానికి వచ్చాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి ‘గొల్గొతా’ అని పేరు. ౧౮ అక్కడ వారు యేసును, ఇరువైపులా ఇద్దరు మనుషుల మధ్య సిలువ వేశారు.
౧౯ పిలాతు, ఒక పలక మీద ‘నజరేతు వాడైన యేసు, యూదుల రాజు’ అని రాయించి సిలువకు తగిలించాడు. ౨౦ యేసును సిలువ వేసిన స్థలం పట్టణానికి దగ్గరగా ఉంది. పలక మీద రాసిన ప్రకటన హీబ్రూ, లాటిన్, గ్రీకు భాషల్లో రాసి ఉంది కాబట్టి చాలా మంది యూదులు దాన్ని చదివారు. ౨౧ యూదుల ముఖ్య యాజకులు పిలాతుతో, “ ‘యూదుల రాజు’ అని కాకుండా, అతడు ‘నేను యూదుల రాజును అని చెప్పుకున్నాడు’ అని రాయించండి” అన్నాడు. ౨౨ పిలాతు, “నేను రాసిందేదో రాశాను” అని జవాబిచ్చాడు.
౨౩ సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రాలు తీసుకుని నాలుగు భాగాలు చేసి తలొక భాగం పంచుకున్నారు. ఆయన పైవస్త్రం కూడా తీసుకొన్నారు. ఆ పైవస్త్రం కుట్టు లేకుండా, అంతా ఒకే నేతగా ఉంది కాబట్టి, ౨౪ వారు ఒకరితో ఒకరు, “దీన్ని మనం చింపకుండా, ఇది ఎవరిది అవుతుందో చూడడానికి చీట్లు వేద్దాం” అన్నారు.
“నా వస్త్రాలు తమలో తాము పంచుకున్నారు,
నా దుస్తుల కోసం చీట్లు వేశారు,” అన్న లేఖనం నెరవేరేలా ఇది జరిగింది. అందుకే సైనికులు అలా చేశారు. ౨౫ యేసు తల్లి, ఆయన తల్లి సోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ, యేసు సిలువ దగ్గర నిలుచుని ఉన్నారు. ౨౬ ఆయన తల్లి, ఆయన ప్రేమించిన శిష్యుడు దగ్గరలో నిలుచుని ఉండడం చూసి, యేసు తన తల్లితో, “అమ్మా, ఇదిగో నీ కొడుకు” అన్నాడు. ౨౭ తరువాత ఆ శిష్యునితో, “ఇదిగో నీ తల్లి” అన్నాడు. ఆ సమయంనుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు.
౨౮ దాని తరువాత, అన్నీ సమాప్తం అయ్యాయని యేసుకు తెలుసు కాబట్టి, లేఖనం నెరవేర్చడానికి, “నాకు దాహంగా ఉంది,” అన్నాడు. ౨౯ అక్కడే ఉన్న పులిసిన ద్రాక్షారసం కుండలో స్పాంజిని ముంచి, దాన్ని హిస్సోపు కొమ్మకు చుట్టి ఆయన నోటికి అందించారు.
౩౦ యేసు, ఆ పులిసిన ద్రాక్షారసం పుచ్చుకొని, “సమాప్తం అయ్యింది” అని, తల వంచి తన ఆత్మను అప్పగించాడు.
౩౧ అది పండగ సిద్ధపాటు రోజు. సబ్బాతు రోజున దేహాలు సిలువ మీదే ఉండిపోకూడదు (ఎందుకంటే సబ్బాతు చాలా ప్రాముఖ్యమైన రోజు) కాబట్టి, వారి దేహాలు అక్కడ వేలాడకుండా, వారి కాళ్ళు విరగగొట్టి, వారిని కిందకి దింపమని యూదులు పిలాతును అడిగారు. ౩౨ కాబట్టి సైనికులు వచ్చి, యేసుతో కూడా సిలువ వేసిన మొదటి వాడి కాళ్ళు, రెండవవాడి కాళ్ళు విరగగొట్టారు. ౩౩ వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన అప్పటికే చనిపోయాడని గమనించి, ఆయన కాళ్ళు విరగగొట్టలేదు.
౩౪ అయితే, సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన డొక్కలో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్ళు బయటకు వచ్చాయి. ౩౫ ఇదంతా చూసినవాడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతని సాక్ష్యం సత్యం. అతడు చెప్పింది సత్యం అని అతనికి తెలుసు. ఇది మీరు కూడా నమ్మడానికే. ౩౬  “అతని ఎముకల్లో ఒక్కటైనా విరగదు” అన్న లేఖనం నెరవేరేలా ఇవి జరిగాయి. ౩౭  “వారు తాము పొడిచిన వాని వైపు చూస్తారు,” అని మరొక లేఖనం చెబుతూ ఉంది.
సమాధి (మత్తయి 27:57-60. మార్కు 15:43-47. లూకా 23:50-56)
౩౮ ఆ తరువాత, యూదులకు భయపడి రహస్యంగా యేసుకు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు, యేసు దేహాన్ని తాను తీసుకుని వెళ్తానని పిలాతును అడిగాడు. పిలాతు అందుకు ఒప్పుకున్నాడు. కాబట్టి యోసేపు వచ్చి యేసు దేహాన్ని తీసుకుని వెళ్ళాడు. ౩౯ మొదట్లో రాత్రి సమయంలో ఆయన దగ్గరికి వచ్చిన నికోదేము కూడా ఇంచుమించు ముప్పై ఐదు కిలోల బోళం, అగరుల మిశ్రమాన్ని తనతో తీసుకు వచ్చాడు.
౪౦ వారు యేసు దేహాన్ని తీసుకు వచ్చి సుగంధ ద్రవ్యాలతో, నార బట్టలో చుట్టారు. ఇది యూదులు దేహాలను సమాధి చేసే సాంప్రదాయం. ౪౧ ఆయనను సిలువ వేసిన ప్రాంగణంలో ఉన్న తోటలో, అంత వరకూ ఎవరినీ పాతిపెట్టని ఒక కొత్త సమాధి ఉంది. ౪౨ ఆ సమాధి దగ్గరగా ఉంది కాబట్టి, ఆ రోజు యూదులు సిద్ధపడే రోజు కాబట్టి, వారు యేసును అందులో పెట్టారు.