౬
ఐదు వేల మందికి ఆహారం (మత్తయి 14:13-21. మార్కు 6:32-44. లూకా 9:10-17)
౧ ఈ సంగతులు జరిగిన తరువాత యేసు తిబెరియ సముద్రం, అంటే గలిలయ సముద్రాన్ని దాటి అవతలి తీరానికి వెళ్ళాడు. ౨ రోగుల విషయంలో ఆయన చేసే అద్భుతాలను చూస్తున్న ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన వెనక వెళ్తూ ఉన్నారు. ౩ యేసు ఒక కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూర్చున్నాడు. ౪ యూదుల పస్కా పండగ దగ్గర పడింది.
౫ యేసు తలెత్తి చూసినప్పుడు పెద్ద జన సమూహం తన వైపు రావడం కనిపించింది. అప్పుడు ఆయన ఫిలిప్పుతో, “వీరంతా భోజనం చేయడానికి రొట్టెలు ఎక్కడ కొనబోతున్నాం?” అని అడిగాడు. ౬ యేసుకు తాను ఏం చేయబోతున్నాడో స్పష్టంగా తెలుసు. కేవలం ఫిలిప్పును పరీక్షించడానికి అలా అడిగాడు. ౭ దానికి ఫిలిప్పు, “రెండు వందల దేనారాలతో రొట్టెలు కొని తెచ్చినా ఒక్కొక్కడికి చిన్న ముక్క ఇవ్వడానికి కూడా చాలదు” అన్నాడు. ౮ ఆయన శిష్యుల్లో మరొకడు, అంటే సీమోను పేతురు సోదరుడు అంద్రెయ ౯ “ఇక్కడ ఒక చిన్న కుర్రాడి దగ్గర ఐదు బార్లీ రొట్టెలూ రెండు చిన్న చేపలూ ఉన్నాయి గాని ఇంత మందికి ఎలా సరిపోతాయి?” అని ఆయనతో అన్నాడు.
౧౦ యేసు “ప్రజలందర్నీ కూర్చోబెట్టండి” అని శిష్యులకు చెప్పాడు. అక్కడ చాలా పచ్చిక ఉండటంతో ఆ ప్రజలంతా కూర్చున్నారు. వారంతా పురుషులే సుమారు ఐదువేల మంది ఉంటారు. ౧౧ యేసు ఆ రొట్టెలను చేతిలో పట్టుకుని కృతజ్ఞతలు చెప్పి కూర్చున్న వారికి పంచి ఇచ్చాడు. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత వడ్డించాడు. ౧౨ అందరూ కడుపు నిండా తిన్నారు. తరువాత ఆయన, “మిగిలిన రొట్టెల, చేపల ముక్కలన్నీ పోగు చేయండి. ఏదీ వ్యర్థం కానీయవద్దు” అని శిష్యులతో చెప్పాడు. ౧౩ అందరూ తిన్న తరువాత మిగిలిన ఐదు బార్లీ రొట్టెల ముక్కలన్నీ పోగు చేశారు. అవి పన్నెండు గంపలు నిండాయి.
౧౪ వారందరూ యేసు చేసిన అద్భుతాన్ని చూసి, “ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే” అని చెప్పుకున్నారు. ౧౫ వారు తనను పట్టుకుని బలవంతంగా రాజుగా చేయడానికి సిద్ధపడుతున్నారని యేసుకు అర్థమై తిరిగి ఒంటరిగా కొండ పైకి వెళ్ళి పోయాడు.
యేసు నీటిపై నడవడం (మత్తయి 14:22-36. మార్కు 6:45-56)
౧౬ సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రం దగ్గరికి వెళ్ళి పడవ పైన సముద్రానికి అవతల ఉన్న కపెర్నహూముకు వెళ్తున్నారు. ౧౭ అప్పటికే చీకటి పడింది. యేసు వారి దగ్గరికి ఇంకా రాలేదు. ౧౮ అప్పుడు పెనుగాలి వీయడం మొదలైంది. సముద్రం అల్లకల్లోలంగా తయారైంది. ౧౯ వారు సుమారు ఐదారు కిలోమీటర్లు ప్రయాణించాక యేసు సముద్రం మీద నడుస్తూ రావడం చూసి భయపడ్డారు. ౨౦ అయితే ఆయన, “నేనే, భయపడవద్దు” అని వారితో చెప్పాడు. ౨౧ ఆయన అలా చెప్పాక వారు ఆయనను పడవ ఎక్కించుకోడానికి ఇష్టపడ్డారు. వెంటనే ఆ పడవ తీరానికి చేరింది.
జీవాహారం గురించి ఉపదేశం
౨౨ తరువాతి రోజు సముద్రానికి ఇవతల ఉండిపోయిన జన సమూహం అక్కడికి వచ్చారు. అక్కడ ఒక చిన్న పడవ మాత్రమే ఉంది. మరో పడవ వారికి కనిపించలేదు. శిష్యులు యేసు లేకుండానే పడవలో ప్రయాణమై వెళ్ళారని వారు తెలుసుకున్నారు. ౨౩ అయితే ప్రభువు కృతజ్ఞతలు చెప్పి వారికి రొట్టెలు పంచగా వారు తిన్న స్థలానికి దగ్గరలో ఉన్న తిబెరియ నుండి వేరే చిన్న పడవలు వచ్చాయి. ౨౪ యేసూ ఆయన శిష్యులూ అక్కడ లేక పోవడంతో ప్రజలందరూ ఆ చిన్న పడవలెక్కి యేసును వెతుకుతూ కపెర్నహూముకు వచ్చారు. ౨౫ సముద్రం అవతలి తీరాన వారు ఆయనను చూశారు. “బోధకా, నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు?” అని అడిగారు.
౨౬ యేసు, “కచ్చితంగా చెబుతున్నాను. మీరు సూచనలను చూసినందువల్ల కాదు, రొట్టెలు కడుపు నిండా తిని తృప్తి పొందడం వల్లనే నన్ను వెతుకుతున్నారు. ౨౭ పాడైపోయే ఆహారం కోసం కష్టపడవద్దు, నిత్యజీవం కలగజేసే పాడైపోని ఆహారం కోసం కష్టపడండి. దాన్ని మనుష్య కుమారుడు మీకిస్తాడు. దానికోసం తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి అధికారమిచ్చాడు” అని చెప్పాడు. ౨౮ అప్పుడు వారు, “దేవుని పనులు చేయాలంటే మేమేం చేయాలి?” అని ఆయనను అడిగారు. ౨౯ దానికి యేసు, “దేవుడు పంపిన వ్యక్తి పైన విశ్వాసముంచడమే దేవుని కార్యాలు చేయడమంటే” అన్నాడు. ౩౦ వారు, “అలా అయితే మేము నిన్ను నమ్మడానికి నువ్వు ఏ అద్భుతం చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేస్తావు? ౩౧ ‘వారు తినడానికి పరలోకం నుండి ఆయన ఆహారం ఇచ్చాడు’ అని రాసి ఉన్నట్టుగా మన పూర్వీకులు అరణ్యంలో మన్నాను భుజించారు” అని చెప్పారు. ౩౨ అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, “పరలోకం నుండి వచ్చే ఆహారాన్ని మోషే మీకివ్వలేదు. పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారాన్ని నా తండ్రే మీకిస్తున్నాడు. ౩౩ అందుచేత దేవుడిచ్చే ఆహారం ఏమిటంటే, పరలోకంనుంచి దిగివచ్చి లోకానికి జీవం ఇచ్చేవాడే” అని వారితో అన్నాడు.” ౩౪ అందుకు వారు, “ప్రభూ, మాకు ఎప్పుడూ ఈ ఆహారాన్ని ఇస్తూ ఉండు” అన్నారు.
౩౫ దానికి జవాబుగా యేసు, “జీవాన్నిచ్చే ఆహారాన్ని నేనే. నా దగ్గరికి వచ్చే వాడికి ఆకలి వేయదు. నాపై విశ్వాసముంచే వాడికి దాహం వేయదు. ౩౬ కాని నేను మీతో చెప్పినట్టు, నన్ను చూసి కూడా మీరు నమ్మలేదు. ౩౭ తండ్రి నాకు ఇచ్చే వారంతా నా దగ్గరికి వస్తారు. ఇక నా దగ్గరికి వచ్చేవారిని నేను ఎంత మాత్రం నా దగ్గర నుండి తోలివేయను. ౩౮ ఎందుకంటే నేను నా స్వంత ఇష్టాన్ని జరిగించడానికి రాలేదు. నన్ను పంపించిన వాని ఇష్టాన్ని జరిగించడానికే పరలోకం నుండి వచ్చాను. ౩౯ ఆయన నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరినీ పోగొట్టుకోకుండా ఉండడమూ, వారందరినీ అంత్యదినాన లేపడమూ నన్ను పంపిన వాడి ఇష్టం. ౪౦ ఎందుకంటే కుమారుణ్ణి చూసి ఆయనలో విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందాలన్నదే నా తండ్రి ఇష్టం. అంత్యదినాన నేను వారిని సజీవంగా లేపుతాను.”
౪౧ ‘నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని’ అని ఆయన చెప్పినందుకు యూదు నాయకులు సణగడం మొదలు పెట్టారు. ౪౨ “ఈయన యోసేపు కుమారుడు యేసు కదా? ఇతని తల్లిదండ్రులు మనకు తెలుసు కదా! ‘నేను పరలోకం నుండి వచ్చాను’ అని ఎలా చెబుతున్నాడు?” అనుకున్నారు.
౪౩ యేసు వారికి ఇలా జవాబిచ్చాడు, “మీలో మీరు సణుక్కోవడం ఆపండి. ౪౪ తండ్రి ఆకర్షించకపోతే ఎవరూ నా దగ్గరికి రాలేరు. అలా వచ్చిన వాణ్ణి నేను అంత్యదినాన సజీవంగా లేపుతాను. ౪౫ ‘వారికి దేవుడు ఉపదేశిస్తాడు’ అని ప్రవక్తలు రాశారు. కాబట్టి తండ్రి దగ్గర విని నేర్చుకున్నవాడు నా దగ్గరికి వస్తాడు. ౪౬ దేవుని దగ్గర నుండి వచ్చినవాడు తప్ప తండ్రిని ఎవరూ చూడలేదు. ఆయనే తండ్రిని చూశాడు. ౪౭ కచ్చితంగా చెబుతున్నాను. విశ్వసించేవాడు నిత్యజీవం గలవాడు.
౪౮ జీవాహారం నేనే. ౪౯ మీ పూర్వీకులు అరణ్యంలో మన్నాను తిన్నారు. అయినా చనిపోయారు. ౫౦ పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీన్ని తిన్నవాడు చనిపోడు. ౫౧ పరలోకం నుండి దిగి వచ్చిన జీవాన్నిచ్చే ఆహారం నేనే. ఈ ఆహారం ఎవరైనా తింటే వాడు కలకాలం జీవిస్తాడు. లోకానికి జీవాన్నిచ్చే ఈ ఆహారం నా శరీరమే.”
౫౨ యూదులకు కోపం వచ్చింది. “ఈయన తన శరీరాన్ని ఎలా తిననిస్తాడు” అంటూ తమలో తాము వాదించుకున్నారు. ౫౩ అప్పుడు యేసు వారితో ఇలా చెప్పాడు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను. మీరు మనుష్య కుమారుడి శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగకపోతే మీలో మీకు జీవం ఉండదు. ౫౪ నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడే నిత్యజీవం ఉన్నవాడు. అంత్యదినాన నేను అతణ్ణి లేపుతాను. ౫౫ నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానీయం. ౫౬ నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడు నాలో ఉండిపోతాడు. నేను అతనిలో ఉండిపోతాను. ౫౭ సజీవుడైన తండ్రి నన్ను పంపాడు. ఆయన వల్లనే నేను జీవిస్తున్నాను. అలాగే నన్ను తినేవాడు కూడా నా వల్ల జీవిస్తాడు. ౫౮ పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. మీ పూర్వీకులు మన్నాను తిని చనిపోయినట్టుగా కాకుండా ఈ ఆహారాన్ని తినే వాడు కలకాలం జీవిస్తాడు.” ౫౯ ఆయన ఈ మాటలన్నీ కపెర్నహూములోని సమాజ మందిరంలో ఉపదేశిస్తూ చెప్పాడు.
యేసును అనుసరించేవారికి పరీక్ష
౬౦ ఆయన శిష్యుల్లో అనేకమంది ఈ మాటలు విన్నప్పుడు, “ఇది చాలా కష్టమైన బోధ. దీన్ని ఎవరు అంగీకరిస్తారు” అని చెప్పుకున్నారు. ౬౧ తన శిష్యులు ఇలా సణుక్కుంటున్నారని యేసుకు తెలిసింది. ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ మాటలు మీకు అభ్యంతరంగా ఉన్నాయా? ౬౨ మనుష్య కుమారుడు ఇంతకు ముందు ఉన్న చోటికే ఆరోహణం కావడం చూస్తే మీరు ఏమంటారు? ౬౩ జీవాన్ని ఇచ్చేది ఆత్మ. శరీరం వల్ల ప్రయోజనం లేదు. నేను మీతో చెప్పిన మాటలే ఆత్మ. అవే జీవం. ౬౪ కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు.” తన మీద నమ్మకం ఉంచని వారెవరో, తనను పట్టి ఇచ్చేదెవరో యేసుకు మొదటి నుంచీ తెలుసు. ౬౫ ఆయన, “నా తండ్రి ఇస్తే తప్ప ఎవరూ నా దగ్గరికి రాలేరని ఈ కారణం బట్టే చెప్పాను” అన్నాడు.
౬౬ ఆ తరువాత ఆయన శిష్యుల్లో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. వారు ఆయనను ఇక ఎప్పుడూ అనుసరించలేదు.
పేతురు విశ్వాసపు ఒప్పుకోలు (మత్తయి 16:13-20. మార్కు 8:27-30. లూకా 9:18-21)
౬౭ అప్పుడు యేసు, “మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా?” అని తనతో ఉన్న పన్నెండుమంది శిష్యులను అడిగాడు. ౬౮ సీమోను పేతురు ఆయనతో, “ప్రభూ, మేము ఇక ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీదగ్గర మాత్రమే నిత్య జీవపు మాటలు ఉన్నాయి. ౬౯ నువ్వు దేవుని పరిశుద్ధుడివి అని మేము విశ్వసించాం, తెలుసుకున్నాం” అని చెప్పాడు. ౭౦ యేసు వారితో, “నేను మీ పన్నెండు మందిని ఎంపిక చేసుకున్నాను కదా, అయినా మీలో ఒకడు సాతాను” అని చెప్పాడు. ౭౧ పన్నెండు మందిలో ఒకడుగా ఉండి ఆయనకు ద్రోహం చెయ్యబోతున్న సీమోను ఇస్కరియోతు కొడుకు యూదా గురించి ఆయన ఈ మాట చెప్పాడు.