౧౪
౧ సంసోను తిమ్నాతుకు వెళ్ళాడు. అక్కడ ఒక ఫిలిష్తీ యువతిని చూశాడు. ౨ అతడు ఇంటికి తిరిగి వచ్చి “తిమ్నాతులో ఒక ఫిలిష్తీ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని నాకిచ్చి పెళ్ళి చేయండి” అని తన తల్లిదండ్రులను అడిగాడు. ౩ వారు “నీ బంధువుల్లో గానీ మన సొంత జాతిలో గానీ అమ్మాయిలు లేరనా సున్నతి సంస్కారం లేని ఫిలిష్తీయుల్లో నుండి అమ్మాయిని భార్యగా తెచ్చుకోడానికి వెళ్తున్నావు?” అని అతణ్ణి అడిగారు. అందుకు సంసోను “ఆమె నాకు నచ్చింది. నా కోసం ఆమెను తెప్పించు” అని తన తండ్రితో అన్నాడు. ౪ అయితే ఫిలిష్తీయులకు కీడు చేయడానికి యెహోవాయే అతణ్ణి పురిగొల్పుతున్నాడని అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఆ రోజుల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్నారు.
౫ తరువాత సంసోను తన తల్లిదండ్రులతో కలసి తిమ్నాతుకు వెళ్ళాడు. తిమ్నాతు ద్రాక్ష తోటల దగ్గరికి వచ్చినప్పుడు ఒక కొదమ సింహం భీకరంగా గర్జిస్తూ అతని మీదికి వచ్చింది. ౬ యెహోవా ఆత్మ అకస్మాత్తుగా అతణ్ణి ఆవరించాడు. దాంతో చేతిలో ఏమీ లేక పోయినా ఒక మేకపిల్లను చీల్చినట్టు అతడు దాన్ని చీల్చి వేశాడు. కాని తాను చేసినదాన్ని తన తండ్రికి గానీ తల్లికి గానీ చెప్పలేదు.
౭ అతడు అక్కడికి వెళ్లి ఆ స్త్రీతో మాట్లాడాడు. ఆమె అతనికి నచ్చింది. ౮ కొంతకాలం గడచిన తరువాత ఆమెను తీసుకుని రావడానికి తిరిగి ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ సింహం కళేబరం చూడడానికి పక్కకు తిరిగాడు. ఆ సింహపు అస్థిపంజరంలో అతనికి ఒక తేనెటీగల గుంపూ తేనే కనిపించాయి. ౯ అతడు ఆ తేనె తీసి చేతిలో పట్టుకుని తింటూ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వారికీ కొంత తేనె ఇచ్చాడు. వారూ దాన్ని తిన్నారు. అయితే తాను ఆ తేనెను సింహం కళేబరం నుండి తీశానని వారికి చెప్పలేదు.
౧౦ సంసోను తండ్రి ఆ స్త్రీని చూడడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. సంసోను అక్కడి సంప్రదాయం ప్రకారం ఒక విందు ఏర్పాటు చేశాడు. ౧౧ ఆమె బంధువులు అతణ్ణి చూడగానే అతనితో ఉండటానికి ముప్ఫై మంది స్నేహితులను తీసుకుని వచ్చారు. ౧౨ అప్పుడు సంసోను వారితో “మీకిష్టమైతే మీకో పొడుపు కథ చెప్తాను. ఈ విందు జరిగే ఏడు రోజుల్లోగా మీలో ఎవరైనా ఈ పొడుపు కథ విప్పి నాకు చెప్పగలిగితే నేను ముప్ఫై సన్నటి నార వస్త్రాలూ, మరో ముప్ఫై జతల దుస్తులూ మీకు ఇస్తాను. ౧౩ ఒకవేళ మీరు ఆ పొడుపు కథ విప్పలేకపోతే ఆ ముప్ఫై సన్నటి నార వస్త్రాలూ, మరో ముప్ఫై జతల దుస్తులూ మీరు నాకు ఇవ్వాలి” అన్నాడు. దానికి వారు “ఆ పొడుపు కథ ఏమిటో చెప్పు. వింటాం.” అన్నారు.
౧౪ అప్పుడు వారితో సంసోను ఇలా చెప్పాడు,
“తినే దాంట్లోనుండి తిండి వచ్చింది.
బలమైన దాంట్లోనుండి తీపి వచ్చింది.” అన్నాడు.
అతని అతిథులు మూడు రోజులైనా ఆ పొడుపు కథ విప్పలేక పోయారు. ౧౫ నాలుగో రోజున వాళ్ళు సంసోను భార్యతో “మమ్మల్ని నిరుపేదలుగా చేయడానికే ఆహ్వానించారా? ఎలాగైనా నీ భర్త దగ్గర ఈ పొడుపు కథ భావాన్ని రాబట్టి మాకు చెప్పు. లేకపోతే నిన్నూ నీ తండ్రి ఇంటి వాళ్ళనూ తగలబెట్టేస్తాం” అన్నారు.
౧౬ సంసోను భార్య అతని ఎదుట ఏడవడం మొదలు పెట్టింది “నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు గానీ ప్రేమించడం లేదు. నువ్వు మా వాళ్లకు ఒక పొడుపు కథ చెప్పావు. కానీ దానినెలా విప్పాలో నాకు చెప్పలేదు” అంది. దానికతడు “నేను మా అమ్మానాన్నలకే చెప్పలేదు నీకెలా చెప్తాను” అన్నాడు. ఆమె విందు జరిగిన ఏడు రోజులూ అతని దగ్గర ఏడుస్తూనే ఉంది. ౧౭ ఏడో రోజు ఆమె అతణ్ణి బాగా ఒత్తిడి చేయడం వల్ల ఆ పొడుపు కథ ఎలా విప్పాలో ఆమెకు చెప్పేశాడు. ఆమె తన వాళ్లకు పొడుపు కథ అర్థం తెలియచేసింది.
౧౮ ఏడో రోజున సూర్యాస్తమయం ముందే ఆ ఊరి వాళ్ళు సంసోనుతో “తేనె కన్నా తీపి అయినదేది? సింహం కన్నా బలమైనదేది?” అన్నారు. సంసోను వారితో ఇలా అన్నాడు “మీరు నా దూడతో దున్నకపోయి ఉంటే నా పొడుపుకథను విప్పగలిగేవారు కాదు” అన్నాడు. ౧౯ యెహోవా ఆత్మ అతని మీదికి మళ్ళీ బలంగా వచ్చాడు. అప్పుడు అతడు అష్కెలోనుకు వెళ్లి అక్కడివారిలో ముప్ఫై మందిని చంపి వారిని దోచుకున్నాడు. ఆ సొమ్ముతో తన పొడుపు కథను విప్పిన వారికి దుస్తులు ఇచ్చాడు. కోపంతో మండిపడుతూ తన తండ్రి ఇంటికి వెళ్లి పోయాడు. ౨౦ సంసోను భార్యను అతని స్నేహితుడికి ఇచ్చి వేశారు.