౩౯
౧ ఆ సమయంలో బబులోను రాజు, బలదాను కొడుకు అయిన మెరోదక్ బలదాను హిజ్కియా జబ్బు చేసి బాగుపడ్డాడని విని తన రాయబారులతో ఒక కానుకతోబాటు శుభాకాంక్షల సందేశాన్ని అతనికి పంపించాడు. ౨ హిజ్కియా వారిని లోపలికి రప్పించి, తన ఇంటిలో, రాజ్యంలో ఉన్న సమస్త వస్తువుల్లో దేనిని దాచిపెట్టకుండా తన సామగ్రి దాచే గదులు, వెండి బంగారాలు, సుగంధద్రవ్యాలు, పరిమళ తైలం, ఆయుధశాల మొదలైన వాటిలో ఉన్న తన పదార్థాలన్నిటినీ వారికి చూపించాడు.
౩ అప్పుడు యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చి “ఆ మనుషులు ఏమన్నారు? వారు ఎక్కడ నుండి వచ్చారు?” అని అడిగాడు. హిజ్కియా “వారు బబులోను అనే దూరదేశం నుంచి వచ్చారు” అని చెప్పాడు. ౪ “వాళ్ళు నీ ఇంటిలో ఏమేమి చూశారు?” అని అడిగినప్పుడు, హిజ్కియా “నా వస్తువుల్లో దేనినీ దాచకుండా నా ఇంటిలో ఉన్న సమస్తాన్నీ నేను వారికి చూపించాను” అన్నాడు. ౫ అప్పుడు యెషయా హిజ్కియాతో ఇలా అన్నాడు. “యెహోవా చెబుతున్న మాట విను. ౬ రాబోయే రోజుల్లో ఏమీ మిగలకుండా నీ ఇంటిలో ఉన్న సమస్తాన్నీ, ఈ రోజువరకూ నీ పూర్వికులు పోగుచేసి దాచిపెట్టినదంతా బబులోను పట్టణానికి దోచుకుపోతారని సేనల అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. ౭ నీ గర్భంలో పుట్టిన నీ కొడుకులను బబులోను రాజనగరంలో నపుంసకులుగా చేయడానికి వారు తీసుకుపోతారు.”
౮ అందుకు హిజ్కియా “నువ్వు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ ప్రకారం జరగడం మంచిదే. అయితే నా జీవితకాలమంతటిలో నాకు శాంతిభద్రతలు, క్షేమం ఉండు గాక” అని యెషయాతో అన్నాడు.