౩౫
౧ అడవులు, ఎండిన భూములు సంతోషిస్తాయి. ఎడారి సంతోషంతో గులాబీ పువ్వులాగా పూస్తుంది.
౨ అది బాగా విచ్చుకుని, ఉల్లాసంతో పాటలు పాడుతుంది.
దానికి లెబానోను లాంటి అందం కలుగుతుంది. దానికి కర్మెలు షారోనులకున్నంత సొగసు కలుగుతుంది. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూస్తాయి.
౩ బలహీనమైన చేతులను బలపరచండి. వణుకుతున్న మోకాళ్లను దృఢపరచండి.
౪ బెదిరిన హృదయాలు గలవారితో ఇలా చెప్పండి. “భయపడకుండా ధైర్యంగా ఉండండి. ప్రతిదండన చేయడానికి మీ దేవుడు వస్తున్నాడు.
చేయాల్సిన ప్రతీకారం ఆయన చేస్తాడు. ఆయన వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు.”
౫ గుడ్డివారి కళ్ళు తెరుచుకుంటాయి. చెవిటివారి చెవులు వినిపిస్తాయి.
౬ కుంటివాడు దుప్పిలాగా గంతులు వేస్తాడు. మూగవాడి నాలుక పాటలు పాడుతుంది.
అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి, అడవిలో కాలవలు పారతాయి.
౭ ఎండమావులు నీటి మడుగులు అవుతాయి. ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుడతాయి.
నక్కలు పండుకొనే నివాసాల్లో జమ్ము, తుంగగడ్డి, మేత పుడతాయి.
౮ పరిశుద్ధ మార్గం అని పిలిచే ఒక రాజమార్గం అక్కడ ఏర్పడుతుంది. దానిలోకి అపవిత్రులు వెళ్ళకూడదు.
దేవునికి అంగీకారమైన వారికోసం అది ఏర్పడింది. మూర్ఖులు దానిలో నడవరు.
౯ అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిలో కాలు మోపవు. అవి అక్కడ కనబడవు.
విమోచన పొందినవారు మాత్రమే అక్కడ నడుస్తారు.
యెహోవా విమోచించినవారు పాటలు పాడుతూ తిరిగి సీయోనుకు వస్తారు.
౧౦ నిత్యమైన సంతోషం వారిని ఆవరించి ఉంటుంది. వారు ఆనంద సంతోషాలు కలిగి ఉంటారు.
వారి దుఃఖం, నిట్టూర్పు తొలగిపోతాయి.