౨౯
౧ అరీయేలుకు బాధ! దావీదు విడిది చేసిన అరీయేలు పట్టణానికి బాధ! సంవత్సరం వెనుకే సంవత్సరం గడవనివ్వండి. పండగలు క్రమంగా జరగనివ్వండి.
౨ కానీ నేను అరీయేలును ముట్టడిస్తాను. అప్పుడు అది దుఃఖించి విలపిస్తుంది. అందుచేత అది నిజంగా నాకు నిప్పుల కుప్పలా ఉంటుంది.
౩ నేను నీకు విరోధంగా నీ చుట్టూ శిబిరం కడతాను. నీకు ఎదురుగా కోట కడతాను. ముట్టడి వేస్తాను. నీకు విరోధంగా ముట్టడి పనులను అధికం చేస్తాను.
౪ అప్పుడు నువ్వు కిందకి దిగుతావు. నేలపై నుండి మాట్లాడటం ప్రారంభిస్తావు. నీ మాటలు నేలపై నున్న దుమ్ములోనుండి వినపడతాయి. నీ మాటలు చాలా బలహీనంగా ఉంటాయి.
౫ నిన్ను ఆక్రమించుకోడానికి గుంపులుగా వచ్చే శత్రువులు ధూళిలా ఉంటారు. క్రూరులైన శత్రు సమూహం ఎగిరిపోయే పొట్టులాగా మాయమౌతారు. ఇదంతా అకస్మాత్తుగా ఒక్క క్షణంలో జరుగుతుంది.
౬ నిన్ను సేనల ప్రభువైన యెహోవా శిక్షిస్తాడు. ఉరుములతో, భూకంపాలతో, భీకర శబ్దాలతో, సుడిగాలి తుఫానులతో, దహించే అగ్నిజ్వాలలతో ఆయన నిన్ను శిక్షిస్తాడు.
౭ ఇదంతా ఒక కలలా ఉంటుంది. రాత్రి వేళ వచ్చే స్వప్నంలా ఉంటుంది. జాతుల సమూహం అరీయేలు పైనా దాని బలమైన స్థావరం పైనా యుద్ధం చేస్తాయి. వాళ్ళు ఆమె పైనా, ఆమె రక్షణ స్థావరాల పైనా దాడి చేస్తారు.
౮ ఆకలితో ఉన్నవాడు కలలో భోజనం చేసి మేలుకున్న తర్వాత వాడు ఇంకా ఆకలితోనే ఉన్నట్టుగా, దాహంతో ఉన్నవాడు కలలో నీళ్ళు తాగి మేలుకున్న తర్వాత వాడు ఇంకా దాహంతోనే ఉన్నట్టుగా అవును, అలాగే సీయోను కొండపై జాతుల సమూహం చేసే యుద్ధం కూడా ఉంటుంది.
౯ వేచి చూడండి! ఆశ్చర్యపొండి, నివ్వెరపొండి. మిమ్మల్ని మీరు గుడ్డివాళ్ళుగా చేసుకుని గుడ్డివాళ్ళు కండి. ద్రాక్షారసం తాగకుండానే మత్తెక్కిన వాళ్ళలా ఉండండి. మద్యం తీసుకోకుండానే తూలుతూ ఉండండి.
౧౦ ఎందుకంటే యెహోవా మీ మీద గాఢమైన నిద్రాత్మను కుమ్మరించాడు. ఆయన మీ కళ్ళు మూసివేశాడు. అంటే మీకు ప్రవక్తలను లేకుండా చేశాడు. మీ తలలకు ముసుగు వేశాడు. మీకు నాయకులను లేకుండా చేశాడు.
౧౧ మీకు ఈ దర్శనమంతా మూసి ఉన్న పుస్తకంలోని మాటల్లా ఉన్నాయి. దాన్ని మనుషులు చదవ గలిగిన వాడికిచ్చి “ఇది చదవండి” అన్నప్పుడు అతడు చూసి “నేను దీన్ని చదవలేను. ఎందుకంటే ఇది మూసి ఉంది” అంటాడు. ౧౨ ఒకవేళ చదువు లేనివాడికి పుస్తకాన్ని ఇచ్చి “చదువు” అంటే అతడు “నేను చదవలేను” అంటాడు.
౧౩ ప్రభువు ఇలా అంటున్నాడు “ఈ ప్రజలు నోటిమాటతో నా దగ్గరకి వస్తున్నారు.
వీళ్ళు పెదవులతో నన్ను గౌరవిస్తున్నారు. కానీ వాళ్ళ హృదయాలను నాకు దూరంగా ఉంచారు. మనుషులు ఏర్పరచిన ఆచారాలను నేర్చుకుని దాని ప్రకారం వాళ్ళు నా పట్ల భయభక్తులు చూపుతున్నారు.
౧౪ కాబట్టి చూడండి, ఈ ప్రజల మధ్య ఒక మహా ఆశ్చర్యకరమైన పని చేస్తాను. అద్భుతం వెనుక అద్భుతాన్ని చేస్తాను.
వారి జ్ఞానుల జ్ఞానం నశించిపోతుంది. వివేకుల వివేకం అదృశ్యమై పోతుంది.”
౧౫ తమ ఆలోచనలు యెహోవాకి తెలియకుండా లోపలే దాచుకునే వాళ్లకీ, చీకట్లో తమ పనులు చేసే వాళ్ళకీ బాధ! “మమ్మల్ని ఎవరు చూస్తున్నారు? మేం చేసేది ఎవరికీ తెలుస్తుంది?” అని వాళ్ళు అనుకుంటారు.
౧౬ మీవెంత వంకర ఆలోచనలు! మట్టిని గూర్చి అలోచించినట్టే కుమ్మరి గురించి కూడా ఆలోచిస్తారా? ఒక వస్తువు తనను చేసిన వ్యక్తిని గూర్చి “అతడు నన్ను చేయలేదు” అనవచ్చా? ఒక రూపంలో ఉన్నది తన రూప కర్తని గూర్చి “అతడు అర్థం చేసుకోడు” అనవచ్చా?
౧౭ ఇంకా కొద్ది కాలంలోనే లెబానోను సారవంతమైన పొలం అవుతుంది. ఆ పొలం అడవిలా మారుతుంది.
౧౮ ఆ రోజున చెవిటి వాళ్ళు గ్రంథంలోని వాక్యాలు వింటారు. గుడ్డి వారు చిమ్మచీకట్లో కూడా చూస్తారు.
౧౯ అణచివేతకి గురైన వాళ్ళు యెహోవాలో ఆనందిస్తారు. మనుషుల్లో పేదలైన వాళ్ళు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిలో ఆనందిస్తారు.
౨౦ నిర్దయులు లేకుండా పోతారు. పరిహాసం చేసేవాళ్ళు అంతరిస్తారు.
౨౧ వీళ్ళు కేవలం ఒక్క మాట ద్వారా ఒక వ్యక్తిని నేరస్తుడిగా నిర్ధారిస్తారు. న్యాయం కోసం వచ్చేవాడి కోసం వలలు వేస్తారు. వట్టి అబద్ధాలతో నీతిమంతుణ్ణి కూలగొడతారు.
౨౨ అందుచేత అబ్రాహామును విమోచించిన యెహోవా యాకోబు వంశం గూర్చి ఇలా చెప్తున్నాడు. “ఇకపై యాకోబు ప్రజలు సిగ్గుపడరు. అవమానంతో వాళ్ళ ముఖం పాలిపోవు.
౨౩ అయితే వాళ్ళ సంతానాన్నీ, వాళ్ళమధ్య నేను చేసే పనులనూ చూసినప్పుడు వాళ్ళు నా పేరును పవిత్ర పరుస్తారు. యాకోబు పరిశుద్ధ దేవుని పేరును పవిత్రపరుస్తారు. ఇశ్రాయేలు దేవునికి భయపడతారు.
౨౪ అప్పుడు ఆత్మలో పొరపాటు చేసేవారు కూడా వివేకం పొందుతారు. అదేపనిగా ఫిర్యాదులు చేసేవాళ్ళు జ్ఞానం సంపాదిస్తారు.”