౧౮
౧ అయ్యో! ఇతియోపియా నదుల అవతల టపటపా కొట్టుకునే రెక్కలున్న దేశానికి దుఃఖం!
౨ అది సముద్రంపై నీళ్ళ మీద జమ్ము పడవల్లో రాయబారులను పంపిస్తూ ఉంది.
వేగిరపడే వార్తాహరులారా! వెళ్ళండి. నున్నని చర్మం కలిగి పొడుగ్గా ఉండే ప్రజల దగ్గరికి వెళ్ళండి! చుట్టూ ఉన్న వాళ్ళనీ, దూరంగా ఉండే వాళ్ళనీ భయకంపితులను చేస్తూ, అణచివేసే ఆ బలమైన జనాల దగ్గరకూ, నదులు విభజించే వాళ్ళ దేశానికీ వెళ్ళండి!
౩ ప్రపంచంలో నివసించే మీరు, భూమిపైన జీవించే మీరు
పర్వతాల పైన సంకేతంగా జెండా ఎత్తినప్పుడు చూడండి! బాకా ఊదినప్పుడు వినండి!
౪ యెహోవా నాకు చెప్పిన మాట ఇదే. “వేసవిలో ఉడుకెత్తే వేడిలా, కోతకాలంలో ఏర్పడే పొగమంచు మబ్బులా
నేను నిశ్శబ్దంగా నా నివాస స్థలం నుండి గమనిస్తూ ఉంటాను.”
౫ కోతకాలం రాకముందు పువ్వు వికసించే దశ ముగిసిన తర్వాత, పువ్వు ద్రాక్షగా మారుతున్న దశలో ఆయన పోటకత్తులతో ద్రాక్షకాయలను కత్తిరిస్తాడు. వ్యాపిస్తున్న ద్రాక్ష కొమ్మలను నరికి అవతల పారవేస్తాడు.
౬ వాటిని పర్వతాల్లోని పక్షులకూ, భూమి మీద ఉన్న మృగాలకూ వదిలివేస్తాడు.
వేసవికాలంలో పక్షులూ, చలికాలంలో భూమి మీద మృగాలూ వాటిని తింటాయి.
౭ ఆ రోజుల్లో నున్నని చర్మం కలిగి పొడుగ్గా ఉండే ప్రజలు, చుట్టూ ఉన్న వాళ్ళనీ, దూరంగా ఉండే వాళ్ళనీ భయకంపితులను చేస్తూ, అణచివేస్తూ ఆ బలమైన జనాలు, నదులతో నిండి ఉన్న వాళ్ళ దేశం నుండి సేనల ప్రభువు అయిన యెహోవాకు కానుకలు తీసుకుని వస్తారు. సేనల ప్రభువు అయిన యెహోవా నామాన్ని ధరించిన సీయోను పర్వతానికి తీసుకు వస్తారు.