౧౪
౧ యెహోవా యాకోబు మీద జాలిపడతాడు. ఆయన మళ్ళీ ఇశ్రాయేలును ఎంపిక చేసుకుని వారికి తమ స్వదేశంలో పూర్వ క్షేమ స్థితి కలిగిస్తాడు. పరదేశులు వాళ్ళల్లో కలిసి, యాకోబు సంతతితో జత కూడుతారు.
౨ ఇతర జాతులు వాళ్ళను తమ సొంత దేశానికి తీసుకు పోతారు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వాళ్ళను దాసదాసీలుగా ఉపయోగించుకుంటారు. తమను బందీలుగా పట్టుకున్నవాళ్ళను వాళ్ళు బందీలుగా పట్టుకుంటారు. తమను బాధించిన వాళ్ళ మీద పరిపాలన చేస్తారు.
౩ ఆ రోజున నీ బాధ నుంచి, నీ వేదన నుంచి, నువ్వు చెయ్యాల్సి వచ్చిన కష్టం నుంచి యెహోవా నీకు విశ్రాంతి ఇస్తాడు.
౪ ఆ రోజున నువ్వు బబులోను రాజు గూర్చి ఎగతాళి పాట ఎత్తి ఇలా పాడతావు.
“బాధించిన వాళ్లకు అంతం ఎలా వచ్చిందో చూడు. గర్వించిన రౌద్రం ఎలా అంతమయ్యిందో చూడు!
౫ దుష్టుల దుడ్డుకర్రనూ, ఎడతెగని హత్యలతో జాతులను క్రూరంగా కొట్టిన పాలకుల రాజదండాన్ని యెహోవా విరగ్గొట్టాడు.
౬ వాళ్ళు ఆగ్రహంతో నిరంకుశ బలత్కారంతో జాతులను లోబరచుకున్నారు.
౭ భూలోకమంతా నిమ్మళించి విశ్రాంతిగా ఉంది. వాళ్ళు పాటలతో తమ సంబరాలు మొదలు పెట్టారు.
౮ నిన్ను గూర్చి తమాల వృక్షాలు, లెబానోను దేవదారు వృక్షాలు సంతోషిస్తూ ఇలా అంటాయి, ‘నువ్వు ఓడిపోయినప్పట్నుంచి చెట్లు నరికే వాడెవడూ మమ్మల్ని నరకడానికి మా మీదకు రాలేదు.’
౯ నువ్వు ప్రవేశిస్తూ ఉండగానే నిన్ను ఎదుర్కోడానికి పాతాళం నీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అది నీ కోసం చనిపోయిన వాళ్ళను లేపుతోంది. భూరాజులందరినీ, జనాల రాజులందరినీ వాళ్ళ సింహాసనాల మీద నుంచి లేపుతోంది.
౧౦ వాళ్ళందరూ నిన్ను చూసి, నువ్వు కూడా మాలాగే బలహీనుడివయ్యావు. నువ్వూ మాలాంటి వాడివయ్యావు.
౧౧ నీ ఆడంబరం, నీ తీగ వాయిద్య స్వరం పాతాళానికి పడిపోయాయి. నీ కింద పురుగులు వ్యాపిస్తాయి. క్రిములు నిన్ను కప్పుతాయి.
౧౨ తేజోనక్షత్రమా, వేకువచుక్కా, ఆకాశం నుంచి నువ్వెలా పడిపోయావు? జాతులను కూల్చిన నువ్వు నేలమట్టం వరకూ ఎలా తెగి పడిపోయావు?
౧౩ నువ్వు నీ హృదయంలో, ‘నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాలకన్నా ఎత్తుగా నా సింహాసనాన్ని గొప్ప చేసుకుంటాను, ఉత్తరం వైపు ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటాను,
౧౪ మేఘమండలం మీదకు ఎక్కుతాను, మహోన్నతుడైన దేవునితో నన్ను సమానంగా చేసుకుంటాను’ అనుకున్నావు. ౧౫ అయితే నువ్వు ఇప్పుడు పాతాళపు లోతుల్లోకి దిగిపోయావు. నరకంలో పడి ఉన్నావు.
౧౬ నిన్ను చూసిన వాళ్ళు నిన్ను నిదానించి చూస్తూ ఇలా అంటారు,
౧౭ ‘భూమిని కంపింపజేసి రాజ్యాలను వణకించినవాడు ఇతడేనా? లోకాన్ని నిర్జన ప్రదేశంగా చేసి, దాని పట్టణాలను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టిన వాళ్ళను తమ నివాసస్థలానికి వెళ్ళనివ్వనివాడు ఇతడేనా?’
౧౮ జాతులన్నిటి రాజులందరూ ఘనత వహించినవారై తమ తమ సమాధుల్లో నిద్రిస్తున్నారు.
౧౯ కానీ నువ్వు పారేసిన కొమ్మలా ఉన్నావు. కత్తివాత చచ్చిన శవాలు నిన్ను కప్పుతున్నాయి. అగాధంలో ఉన్న రాళ్ళ దగ్గరికి దిగిపోయిన వాళ్ళ శవాలు నిన్ను కప్పుతున్నాయి. నువ్వు తొక్కేసిన పీనుగులా అయ్యావు.
౨౦ నీవు నీ దేశాన్ని పాడుచేసి నీ ప్రజలను హతం చేశావు. వాళ్ళతో పాటు నువ్వు సమాధిలో ఉండవు. దుష్టుల సంతానం ఎన్నడూ జ్ఞాపకానికి రాదు.
౨౧ తమ పూర్వీకుల అపరాధం కారణంగా అతని కొడుకులను హతం చేసే స్థలం సిద్ధం చెయ్యండి. వాళ్ళు పెరిగి భూమిని స్వాధీనం చేసుకుని పట్టణాలతో లోకాన్ని నింపకూడదు.”
౨౨ సైన్యాలకు అధిపతి అయిన యెహోవా వాక్కు ఇదే “నేను వాళ్ళ మీదకు లేచి, బబులోనుకు దాని పేరునూ, శేషించిన వారినీ, సంతానాన్నీ లేకుండా కొట్టేస్తాను.” ఇది యెహోవా ప్రకటన.
౨౩ “నేను దాన్ని గుడ్లగూబల స్వాధీనం చేస్తాను. దాన్ని నీటి మడుగులుగా చేస్తాను. నాశనం అనే చీపురుకట్టతో దాన్ని తుడిచి పెట్టేస్తాను.” ఇది సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ప్రకటన.
౨౪ సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలా అంటున్నాడు. “కచ్చితంగా నేను ఉద్దేశించినట్టే అది జరుగుతుంది. నేను యోచన చేసినట్టే అది ఉంటుంది.
౨౫ నా దేశంలో అష్షూరును విరగ్గొడతాను. నా పర్వతాల మీద అతన్ని నా కాళ్ళ కింద తొక్కుతాను. అప్పుడు అతని కాడి నా ప్రజల మీద నుంచి తొలగిపోతుంది. అతని భారం వాళ్ళ భుజాల మీద నుంచి తేలిపోతుంది.
౨౬ సర్వలోకం గురించి నేను చేసిన ఆలోచన ఇదే. జాతులన్నిటి మీదా చాపిన చెయ్యి ఇదే.
౨౭ సైన్యాలకు అధిపతి అయిన యెహోవా దాన్ని ఆలోచించాడు. ఆయన్ని ఆపేవాడెవడు? ఆయన చెయ్యి ఎత్తి ఉంది. దాన్ని ఎవడు వెనక్కి తిప్పుతాడు?”
౨౮ రాజైన ఆహాజు చనిపోయిన సంవత్సరం ఈ ప్రకటన వచ్చింది,
౨౯ “ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండం విరిగిపోయిందని సంతోషించకు. ఆ సర్పవంశం నుంచి కట్లపాము వస్తుంది. దాని సంతానం, రెక్కల అగ్ని సర్పం.
౩౦ అప్పుడు పేదలకే పేదలైన వారు భోజనం చేస్తారు. నిరాశ్రయులు క్షేమంగా పండుకుంటారు. కాని, నేను నీ సంతానాన్ని కరువుతో చంపేస్తాను. అది నీలో మిగిలిన వాళ్ళను హతం చేస్తుంది.
౩౧ ద్వారమా, ప్రలాపించు. పట్టణమా, అంగలార్చు. ఫిలిష్తియా, నువ్వు పూర్తిగా కరిగిపోతావు. ఎందుకంటే ఉత్తరం నుంచి పొగ మేఘం వస్తున్నది. బారులు తీరిన సైన్యంలో వెనుతిరిగే వాడు ఒక్కడూ లేడు.
౩౨ ఆ దేశ వార్తాహరుడికి ఇవ్వాల్సిన జవాబేది? యెహోవా సీయోనును స్థాపించాడు. ఆయన ప్రజల్లో బాధకు గురైన వాళ్లకు దానిలో ఆశ్రయం దొరుకుతుంది.”