౩౪
౧ యాకోబుకు లేయా ద్వారా పుట్టిన కూతురు దీనా. ఆమె ఆ దేశపు యువతులను చూడడానికి బయటికి వెళ్ళింది. ౨ ఆ దేశపు రాజు, హివ్వీయుడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకుని, బలాత్కారం చేసి చెరిచాడు. ౩ అయితే అతడు ఆమెపై మనసు పడ్డాడు. ఆమెని ప్రేమించి ఆమెతో ఇష్టంగా మాట్లాడాడు.
౪ షెకెము తన తండ్రి హమోరును “ఈ అమ్మాయిని నాకిచ్చి పెళ్ళి చెయ్యి” అని అడిగాడు. ౫ అతడు తన కూతురిని చెరిచిన సంగతి యాకోబు విన్నాడు. తన కుమారులు పశువులతో పొలంలో ఉండడం వలన వారు వచ్చే వరకూ నెమ్మదిగా ఉన్నాడు. ౬ షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడడానికి అతని దగ్గరికి వచ్చాడు. ౭ యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలం నుండి తిరిగి వచ్చారు. అతడు యాకోబు కూతురును మానభంగం చేసి ఇశ్రాయేలు ప్రజలను కించపరిచాడు. అది చేయకూడని పని కాబట్టి అది వారికి చాలా అవమానకరంగా ఉంది. వారికి చాలా కోపం వచ్చింది.
౮ అప్పుడు హమోరు వారితో “షెకెము అనే నా కొడుకు మీ కూతురిపై మనసు పడ్డాడు. దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్ళి చేయండి. ౯ మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకుని మాతో వియ్యం కలుపుకుని మా మధ్య నివసించండి. ౧౦ ఈ దేశం మీ ఎదుట ఉంది. మీరు ఇందులో నివసించి వ్యాపారాలు చేసి ఆస్తి సంపాదించుకోండి” అని చెప్పాడు. ౧౧ అతడింకా “నామీద దయ చూపండి. మీరేమి అడుగుతారో దాన్ని నేనిస్తాను. ౧౨ ఓలి గానీ, కట్నం గానీ ఎంతైనా అడగండి. మీరు అడిగినంతా ఇస్తాను. ఆ యువతిని మాత్రం నాకు ఇవ్వండి” అని ఆమె తండ్రితో, సోదరులతో చెప్పాడు. ౧౩ అయితే తమ సోదరి అయిన దీనాను అతడు చెరిచినందుకు యాకోబు కుమారులు షెకెముతో, అతని తండ్రి హమోరుతో కపటంగా జవాబిచ్చారు.
౧౪ వారు “మేము ఈ పనికి అంగీకరించలేం. సున్నతి చేయించుకోని వాడికి మా సోదరిని ఇయ్యలేము. ఎందుకంటే అది మాకు అవమానకరం. ౧౫ అయితే మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మాలాగా ఉండే పక్షంలో మాత్రమే మేము దీనికి అంగీకరించగలం. ౧౬ ఆ ఒక్క షరతుతో మీ మాటకు ఒప్పుకుని, మా పిల్లలను మీ కిచ్చి మీ పిల్లలను మేము చేసుకుని, మీ మధ్య నివసిస్తాం. అప్పుడు మనమంతా ఒకే జనంగా ఉంటాం. ౧౭ మీరు మా మాట విని సున్నతి పొందకపోతే మా అమ్మాయిని తీసుకు వెళ్ళిపోతాం” అన్నారు.
౧౮ వారి మాటలు హమోరుకూ అతని కుమారుడు షెకెముకూ ఇష్టంగా ఉన్నాయి. ౧౯ ఆ యువకుడికి యాకోబు కూతురు అంటే ప్రేమ కాబట్టి అతడు ఆ పని చేయడానికి ఆలస్యం చేయలేదు. అతడు తన వంశం వారందరిలో పేరు పొందినవాడు.
౨౦ హమోరూ అతని కుమారుడు షెకెమూ ఆ ఊరి ద్వారం దగ్గరికి వచ్చి తమ ఊరి ప్రజలతో మాట్లాడుతూ, ౨౧  “ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు కాబట్టి వారిని మన దేశంలో ఉండనిచ్చి దీనిలో వ్యాపారం చేసుకోనిద్దాం. ఈ భూమి వారికి కూడా చాలినంత విశాలంగా ఉంది కదా, మనం వారి పిల్లలను చేసుకుని మన పిల్లలను వారికి ఇద్దాం.
౨౨ అయితే ఒక విషయం, ఆ మనుషులు సున్నతి పొందినట్టుగానే మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందితేనే వారు మన మాటకు ఒప్పుకుని మనలో నివసించి ఒకే జనంగా కలిసి ఉంటారు. ౨౩ వారి మందలూ వారి ఆస్తీ వారి పశువులూ అన్నీ మనవవుతాయి కదా. ఎలాగైనా మనం వారి షరతుకు ఒప్పుకుందాం. అప్పుడు వారు మనలో నివసిస్తారు.”
౨౪ హమోరు, అతని కుమారుడు షెకెము చెప్పిన మాటలు ఆ ఊరి ద్వారం గుండా వెళ్ళేవారంతా విన్నారు. అప్పుడు ఆ ద్వారం గుండా వెళ్ళే వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందాడు. ౨౫ మూడో రోజు వారంతా బాధపడుతూ ఉన్నప్పుడు యాకోబు కుమారుల్లో ఇద్దరు, అంటే దీనా సోదరులైన షిమ్యోను, లేవి, వారి కత్తులు తీసుకు అకస్మాత్తుగా ఆ ఊరిమీద పడి ప్రతి మగ వాణ్నీ చంపేశారు. ౨౬ వారు హమోరునీ అతని కొడుకు షెకెమునీ కత్తితో చంపి షెకెము ఇంట్లో నుండి దీనాను తీసుకెళ్ళిపోయారు. ౨౭ తక్కిన యాకోబు కొడుకులు తమ సోదరిని చెరిపినందుకు చనిపోయిన వారు పడి ఉన్నచోటికి వచ్చి ఆ ఊరిపై పడి దోచుకున్నారు. ౨౮ వారి గొర్రెలనూ పశువులనూ గాడిదలనూ ఊరిలో గానీ పొలంలో గానీ ౨౯ వారి ఆస్తి అంతా తీసుకు, వారి పిల్లలనూ స్త్రీలనూ చెరపట్టి, వారి ఇళ్ళలో ఉన్న వస్తువులు సైతం దోచుకున్నారు.
౩౦ అప్పుడు యాకోబు షిమ్యోనునూ లేవినీ పిలిచి “మీరు ఈ దేశంలో నివసించే కనానీయులూ పెరిజ్జీయులూ నన్ను అసహ్యించుకొనేలా చేశారు. నా ప్రజల సంఖ్య తక్కువే. వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపుతారు. నేను, నా ఇంటివారు నాశనమవుతాం” అన్నాడు. ౩౧ అందుకు వారు “మరి వేశ్య పట్ల చేసినట్టు మా చెల్లి పట్ల చేయవచ్చా?” అన్నారు.