౯
సౌలు మార్పు (అపొ.కా. 22:1-16. 26:9-18)
౧ ప్రభువు శిష్యుల్ని హతమారుస్తానని సౌలు యింకా బెదిరింపు మాటలు పలుకుతూ ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి ౨ యేసు మార్గాన్ని అనుసరించే పురుషులు గానీ స్త్రీలు గానీ తనకు దొరికితే, వారిని బంధించి యెరూషలేముకు తీసికొచ్చేలా దమస్కు ఊరి సమాజ మందిరాల వారికి ఉత్తరాలు రాసి ఇమ్మని అడిగాడు.
౩ అతడు ప్రయాణం చేస్తూ దమస్కు సమీపించే సరికి, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ౪ అప్పుడతడు నేల మీద పడిపోయాడు. “సౌలూ, సౌలూ, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు?” అనే ఒక శబ్దం విన్నాడు. ౫ “ప్రభూ, నీవెవరివి?” అని అతడు అడిగినప్పుడు, ప్రభువు, “నువ్వు హింసిస్తున్న యేసుని. ౬ లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నీవేం చేయాలో అది నీకు తెలుస్తుంది” అని చెప్పాడు. ౭ అతనితో కూడా ప్రయాణించే వారు ఆ శబ్దం విన్నారు గాని మాటల్లేక నిలబడిపోయారు. వారికి ఏమీ కనబడలేదు.
౮ సౌలు నేలమీద నుండి లేచి కళ్ళు తెరచినా ఏమీ చూడలేకపోయాడు కాబట్టి వారతని చేయి పట్టుకొని దమస్కులోకి నడిపించారు. ౯ అతడు మూడు రోజులు చూపు లేకుండా ఉన్నాడు. ఏమీ తినలేదు, తాగలేదు.
౧౦ దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడున్నాడు. ప్రభువు దర్శనంలో, “అననీయా!” అని అతనిని పిలిచాడు. ౧౧ అతడు, “చిత్తం” అన్నాడు. అందుకు ప్రభువు, “నువ్వు లేచి, ‘తిన్ననిది’ అనే పేరున్న వీధికి వెళ్ళు. అక్కడ యూదా అనే అతని ఇంట్లో తార్సు ఊరి వాడైన సౌలు అనే మనిషి కోసం అడుగు. అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు. ౧౨ దర్శనంలో అతడు అననీయ అనే వ్యక్తి లోపలికి వచ్చి అతడు చూపు పొందేలా తల మీద చేతులుంచడం చూశాడు” అని చెప్పాడు.
౧౩ అయితే అననీయ, “ప్రభూ, ఈ వ్యక్తి యెరూషలేములోని నీ ప్రజలకు ఎంతో కీడు చేశాడని అతని గురించి చాలామంది చెప్పారు. ౧౪ ఇక్కడ కూడా నీ నామంలో ప్రార్థన చేసే వారిందరినీ బంధించడానికి అతడు ప్రధాన యాజకుల నుండి అధికారం పొందాడు” అని జవాబిచ్చాడు. ౧౫ అందుకు ప్రభువు, “నీవు వెళ్ళు, యూదేతరుల ముందూ, రాజుల ముందూ, ఇశ్రాయేలీయుల ముందూ నా నామం భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. ౧౬ ఇతడు నా నామం కోసం ఎన్ని బాధలు అనుభవించాలో నేనతనికి చూపిస్తాను” అని అతనితో చెప్పాడు.
౧౭ అననీయ వెళ్ళి ఆ ఇంట్లో ప్రవేశించి, అతని మీద చేతులుంచి, “సౌలా, సోదరా, నీవు వచ్చిన దారిలో నీకు కనబడిన ప్రభు యేసు, నీవు చూపు పొంది, పరిశుద్ధాత్మతో నిండేలా నన్ను నీ దగ్గరకి పంపాడు” అని చెప్పాడు. ౧౮ వెంటనే అతని కళ్ళ నుండి పొరల్లాంటివి రాలిపోగా అతడు చూపు పొంది, లేచి బాప్తిసం పొందాడు. తరువాత భోజనం చేసి బలం పుంజుకున్నాడు.
పౌలు సువార్త ప్రకటన
౧౯ అతడు దమస్కులో ఉన్న శిష్యులతో చాలా రోజులు గడిపాడు. ౨౦ వెంటనే సమాజ మందిరాల్లో యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తూ వచ్చాడు. ౨౧ విన్నవారంతా ఆశ్చర్యపడి, ‘యెరూషలేములో ఈ పేరుతో ప్రార్థన చేసే వారిని నాశనం చేసింది ఇతడే కదా? వారిని బందీలుగా ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుపోడానికి ఇక్కడికి కూడా వచ్చాడు కదా’ అని చెప్పుకున్నారు. ౨౨ అయితే సౌలు మరింతగా బలపడి ‘యేసే క్రీస్తు’ అని రుజువు పరుస్తూ దమస్కులో నివసిస్తున్న యూదుల్ని కలవరపరచాడు.
౨౩ చాలా రోజులు గడిచిన తరువాత యూదులు అతనిని చంపాలని ఆలోచించారు. ౨౪ వారి కుతంత్రం సౌలుకు తెలిసింది. వారు అతనిని చంపాలని రాత్రింబగళ్ళు పట్టణ ద్వారాల దగ్గర కాపు కాశారు. ౨౫ అయితే అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకుపోయి గంపలో కూర్చోబెట్టి గోడమీద నుండి అతనిని కిందికి దింపి తప్పించారు.
యెరూషలేము సందర్శనం
౨౬ అతడు యెరూషలేము వచ్చినపుడు శిష్యులతో చేరడానికి ప్రయత్నం చేశాడు గాని, అతడు శిష్యుడని నమ్మలేక అందరూ అతనికి భయపడ్డారు. ౨౭ అయితే బర్నబా అతనిని చేరదీసి అపొస్తలుల దగ్గరికి తీసుకుని వచ్చి, “అతడు దారిలో ప్రభువును చూశాడనీ, ప్రభువు అతనితో మాట్లాడాడనీ, అతడు దమస్కులో యేసు నామంలో ధైర్యంగా బోధించాడు” అనీ, వారికి వివరంగా తెలియపరచాడు. ౨౮ అతడు యెరూషలేములో వారితో కలిసి వస్తూ పోతూ, ౨౯ ప్రభువు నామంలో ధైర్యంగా బోధిస్తూ, గ్రీకు యూదులతో మాట్లాడుతూ తర్కించాడు. అయితే వారు అతణ్ణి చంపాలని ప్రయత్నం చేశారు.
పౌలు తార్సుకు తిరుగు ప్రయాణం
౩౦ సోదరులు దీన్ని తెలుసుకుని అతనిని కైసరయకు తీసుకు వచ్చి తార్సుకు పంపేశారు. ౩౧ కాబట్టి యూదయ, గలిలయ, సమరయ, ప్రాంతాలంతటా సంఘం ప్రశాంతంగా ఉంటూ అభివృద్ది చెందింది. ప్రభువు పట్ల భయం, పరిశుద్ధాత్మ ప్రసాదించే ఆదరణ కలిగి సాగిపోతూ విస్తరించింది.
ఐనెయ స్వస్థత
౩౨ ఆ తరువాత పేతురు ఆ ప్రాంతమంతా తిరిగి, లుద్ద అనే ఊరులో నివసిస్తున్న దేవుని ప్రజల దగ్గరికి వచ్చాడు. ౩౩ అక్కడ పక్షవాతంతో ఎనిమిది సంవత్సరాల నుండి మంచం పట్టిన ఐనెయ అనే ఒకతన్ని చూసి, ౩౪ “ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను బాగుచేశాడు, నీవు లేచి నీ పడక సర్దుకో” అని అతనితో చెప్పగానే ౩౫ వెంటనే అతడు పైకి లేచాడు. లుద్దలో, షారోనులో నివసిస్తున్న వారంతా అతనిని చూసి ప్రభువును విశ్వసించారు.
తబితకు ప్రాణం పోయడం
౩౬ యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉంది. (ఈ పేరు గ్రీకులో దొర్కా, అంటే లేడి* దొర్కా ). ఈమె ఎప్పుడూ మంచి పనులు చేస్తూ, పేదలను ఆదుకుంటూ ఉండేది. ౩౭ ఆ రోజుల్లో ఆమె జబ్బుపడి చనిపోయింది. ఆమె శవానికి స్నానం చేయించి మేడ గదిలో ఉంచారు. ౩౮ లుద్ద అనే ఊరు యొప్పేకు దగ్గరగా ఉండడం వల్ల పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, ఆలస్యం చేయకుండా తమ దగ్గరికి రమ్మని అతనిని బతిమాలడానికి ఇద్దర్ని అతని దగ్గరకి పంపారు.
౩౯ పేతురు లేచి వారితో కూడా వెళ్ళాడు. అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోకి అతనిని తీసుకొచ్చారు. అక్కడ ఉన్న వితంతువులందరూ ఏడుస్తూ, దోర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు, బట్టలు చూపిస్తూ అతని పక్కనే నిలబడ్డారు. ౪౦ పేతురు అందరినీ బయటికి పంపి మోకరించి ప్రార్థన చేశాడు. తరువాత ఆ శవం వైపు తిరిగి, “తబితా, లే” అనగానే ఆమె కళ్ళు తెరచి పేతురును చూడగానే లేచి కూర్చుంది. ౪౧ అతడామె చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. అక్కడ చేరిన విశ్వాసులనూ, వితంతువులనూ పిలిచి ఆమెను సజీవంగా వారికి అప్పగించాడు.
౪౨ ఇది యొప్పే ప్రాంతమంతా తెలిసింది, చాలామంది ప్రభువులో విశ్వాసముంచారు. ౪౩ పేతురు యొప్పేలో సీమోను అనే చర్మాలు బాగు చేసే వాని దగ్గర చాలా రోజులున్నాడు.