౬
ప్రధాన సంగీతకారుని కోసం, తీగ వాయిద్యంతో, షేమినిత్ రాగంలో దావీదు కీర్తన.
౧ యెహోవా, నీ కోపంలో నన్ను కసురుకోకు. నీ ఉగ్రతలో నన్ను శిక్షించకు.
౨ యెహోవా, నేను నీరసంగా ఉన్నాను. నన్ను కరుణించు, యెహోవా, నా ఎముకలు వణుకుతున్నాయి, నన్ను స్వస్థపరచు.
౩ నా ప్రాణం కూడా చాలా గాభరాగా ఉంది. యెహోవా, ఇది ఇంకెంత కాలం కొనసాగుతుంది?
౪ యెహోవా, ఇక విడిచిపెట్టు. నా ఆత్మను విడిపించు. నీ నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నన్ను రక్షించు.
౫ మరణంలో నీ స్మృతి ఉండదు. పాతాళంలో నీకు కృతజ్ఞతలు ఎవరు చెల్లిస్తారు?
౬ నేను మూలుగుతూ అలసిపోయాను. రాత్రంతా కన్నీటితో నా పరుపు నానిపోతున్నది. నా కన్నీళ్లతో నా పడకను తడిపేస్తున్నాను.
౭ విచారంతో నా కళ్ళు మసకబారాయి. నా ప్రత్యర్థులందరి కారణంగా నా దృష్టి మందగించింది.
౮ పాపం చేసే వాళ్ళంతా నా దగ్గరనుంచి తొలిగి పొండి. ఎందుకంటే యెహోవా నా రోదన ధ్వని విన్నాడు.
౯ కరుణ కోసం నేను యెహోవాకు చేసుకున్న విన్నపం ఆయన ఆలకించాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించాడు.
౧౦ నా శత్రువులందరూ సిగ్గుపడి విపరీతంగా కంగారు పడతారు. వాళ్ళు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనక్కి తిరిగిపోతారు.