౩౮
౧ యెహోవా నాతో ఇలా చెప్పాడు. ౨ నరపుత్రుడా, మాగోగు దేశపువాడైన గోగు, అంటే, రోషు, మెషెకు, తుబాలు రాజ్యాల పాలకుని వైపు తిరిగి అతని గూర్చి ప్రవచించు. ౩  “ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, రోషు, మెషెకు, తుబాలు రాజ్యాల పాలకుడవైన గోగూ, నేను నీకు విరోధినయ్యాను. ౪ నేను నిన్ను వెనక్కి తిప్పి నీ దవడలకు గాలాలు తగిలించి, నిన్నూ నీ సైన్యాన్నీ గుర్రాలనూ ఆయుధ సామగ్రి అంతటితో నీ రౌతులందరినీ కవచాలు, డాళ్లు ధరించి ఖడ్గాలు చేతపట్టుకున్న వారందనీ మహా సైన్యంగా పంపిస్తాను. ౫ నీతో కూడ పర్షియా, కూషు, పూతు దేశాల వారినీ డాళ్ళు, శిరస్త్రాణాలు ధరించే వారినీ బయలుదేరదీస్తాను. ౬ గోమెరు, అతని సైన్యం, ఉత్తరాన ఉండే తోగర్మా, అతని సైన్యం, ఇంకా అనేకమంది జనం నీతో వస్తారు.”
౭  “నీవు సిద్ధంగా ఉండడమే కాక, నీతో కలిసిన ఈ సమూహమంతటిని సిద్ధపరచి వారికి నాయకత్వం వహించు. ౮ చాల రోజుల తరువాత నీకు పిలుపు వస్తుంది. వివిధ జనాల్లో చెదరిపోయి, కొన్ని సంవత్సరాల తరవాత ఖడ్గం నుండి తప్పించుకుని, ఎప్పుడూ పాడై ఉండే ఇశ్రాయేలీయుల పర్వతాల మీద నివసించడానికి మళ్ళీ సమకూడిన ప్రజల దగ్గరికి, అంటే వివిధ జనాల్లోనుండి తిరిగి వచ్చి నిర్భయంగా నివసించే వారి దగ్గరికి నీవు వెళ్తావు.
౯ గాలివాన వచ్చినట్టు, మేఘం కమ్మినట్టు నీవు ఆ దేశం మీదికి వస్తావు. నీవు, నీ సైన్యం, నీతో కలిసిన విస్తారమైన జనాలు ఆ దేశం మీద కమ్ముకుంటారు.” ౧౦ ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, ఆ కాలంలో నీ మనస్సులో చెడు తలంపులు కలుగుతాయి. ౧౧ నువ్వు దురాలోచనతో ఇలా అనుకుంటావు, నేను ప్రాకారాలు, అడ్డగడియలు, ద్వారాలు లేని దేశం పైకి వెళ్తాను. విశ్రాంతిగా, నిర్భయంగా నివసించే వారి మీదికి వెళ్తాను. ౧౨ గతంలో పాడై మళ్ళీ నివాసయోగ్యమైన స్థలాల మీదికి వెళ్ళి, వారిని దోచుకుని కొల్లసొమ్ముగా పట్టుకుంటాను. వివిధ జనాల్లోనుండి తిరిగివచ్చి, పశువులు, ఆస్తులు సంపాదించి, భూమి నట్టనడుమ నివసించే ప్రజల మీదికి వెళ్తాను.
౧౩ సెబావారు, దదానువారు, తర్షీషు వర్తకులు, వారి యోధులందరు నిన్ను చూసి “సొమ్ము దోచుకోడానికి వచ్చావా? కొల్లగొట్టడానికీ వెండి బంగారాలు, పశువులు, సరుకులు పట్టుకుపోడానికీ సైన్యం సమకూర్చుకుని వచ్చావా?” అని అడుగుతారు.
౧౪  “కాబట్టి నరపుత్రుడా, గోగును గూర్చి ఇలా ప్రవచించు, ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నిర్భయంగా జీవించే సమయం కనిపెట్టావు కదా? ౧౫ దూరంగా ఉత్తర దిక్కునుండి నీవు, నీతోకూడ అనేకమంది ప్రజలు గుర్రాలెక్కి బహు విస్తారమైన సైన్యంతో వచ్చి ౧౬ మేఘం భూమిని కమ్మినట్లు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద పడతారు. చివరి రోజుల్లో అది జరుగుతుంది. గోగూ, అన్యజనాలు నన్ను తెలుసుకొనేలా నేను నా దేశం మీదికి నిన్ను రప్పించి నిన్నుబట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధ పరచుకుంటాను.” ౧౭ ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే “గతంలో ప్రతి సంవత్సరం నిన్ను వారిమీదికి రప్పిస్తానని నా సేవకులైన ప్రవక్తల ద్వారా సెలవిచ్చింది నేనే గదా? ౧౮ ఆ రోజున, అంటే గోగు ఇశ్రాయేలీయుల దేశం మీదికి రాబోయే రోజున, నా కోపం విపరీతంగా మండుతుంది.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
౧౯  “కాబట్టి నేను రోషంతో, మహా రౌద్రంతో ఈ విధంగా ప్రకటించాను, ఇశ్రాయేలీయుల దేశంలో గొప్ప భూకంపం కలుగుతుంది. ౨౦ సముద్రపు చేపలు, ఆకాశపక్షులు, భూజంతువులు, భూమిమీద పాకే పురుగులన్నీ, భూప్రజలంతా నాకు భయపడి వణుకుతారు. పర్వతాలు నాశనమౌతాయి, కొండ శిఖరాలు కూలిపోతాయి, గోడలన్నీ నేలకూలుతాయి. ౨౧ నా పర్వతాలన్నిటిలో అతని మీదికి ఖడ్గం వచ్చేలా చేస్తాను. ప్రతి ఒక్కరి ఖడ్గం అతని సోదరుని మీద పడుతుంది.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ౨౨ తెగులు, మరణం పంపి అతని మీదా అతని సైన్యం మీదా అతనితో ఉన్న జనాల మీదా భీకరమైన వర్షాన్నీ పెద్ద వడగండ్లనూ అగ్నిగంధకాలనూ కురిపించి అతనితో వాదిస్తాను. ౨౩ అన్యజనాలంతా నేను యెహోవానని తెలుసుకునేలా నేను నా గొప్పతనాన్ని, పరిశుద్ధతను వారి ఎదుట చూపించి నన్ను నేను హెచ్చించుకుంటాను.