౨౧
తూరు పట్టణానికి ప్రయాణం
౧ మేము వారిని విడిచి ఓడ ఎక్కి నేరుగా వెళ్ళి కోసుకు, మరునాడు రొదుకు, అక్కడ నుంచి పతర రేవుకు వచ్చాం. ౨ అక్కడ ఫేనీకే బయలుదేరుతున్న ఒక ఓడను చూసి దానిలో ఎక్కాం. ౩ దానిపై వెళ్తూ కుప్ర కనిపిస్తూ ఉండగా దానికి కుడి పక్కగా ప్రయాణించి, సిరియా వైపుగా వెళ్ళి, తూరులో దిగాం. అక్కడ ఓడలోని సరుకు దిగుమతి చెయ్యాల్సి ఉంది.
యెరూషలేముకు వెళ్ళవద్దని పౌలుకు హెచ్చరిక
౪ మేమక్కడి శిష్యులను కలుసుకొని అక్కడ ఏడు రోజులు ఉన్నాం. వారు ఆత్మ ద్వారా “నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దు” అని పౌలుతో చెప్పారు. ౫ ఆ రోజులు గడిచిన తరువాత మేము ప్రయాణమైనప్పుడు వారంతా భార్యా పిల్లలతో వచ్చి మమ్మల్ని పట్టణం బయటి వరకూ సాగనంపారు. వారూ, మేమూ సముద్రతీరంలో మోకాళ్ళపై ప్రార్థించి ఒకరి దగ్గర మరొకరు సెలవు తీసుకున్నాం. ౬ మేము ఓడ ఎక్కిన తరువాత వారు తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళారు.
౭ మేము తూరు నుండి ప్రయాణించి, తొలెమాయి వచ్చి, అక్కడి సోదరులను పలకరించి వారి దగ్గర ఒక రోజు గడిపాం. ౮ మరునాడు బయలుదేరి కైసరయ వచ్చి, అపొస్తలులు నియమించిన ఏడుగురిలో ఒకడైన సువార్తికుడు ఫిలిప్పు ఇంటికి వచ్చి అతనితో ఉన్నాం. ౯ ప్రవచన వరం ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉన్నారు. వారంతా కన్యలు.
యెరూషలేముకు వెళ్ళవద్దని మళ్లీ హెచ్చరిక
౧౦ మేమక్కడ చాలా రోజులు ఉన్నాం. అగబు అనే ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చాడు. ౧౧ అతడు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని, దానితో తన చేతులను కాళ్ళను కట్టుకొని, “యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల వ్యక్తిని ఈ విధంగా బంధించి, యూదేతరుల చేతికి అప్పగిస్తారని పరిశుద్ధాత్మ చెబుతున్నాడు” అన్నాడు. ౧౨ ఈ మాట విన్నప్పుడు మేమూ, అక్కడివారూ యెరూషలేముకు వెళ్ళవద్దని పౌలును బతిమాలుకొన్నాం. ౧౩ కానీ పౌలు, “ఇదేమిటి? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తున్నారు? నేను ప్రభు యేసు నామం నిమిత్తం యెరూషలేములో బంధకాలకే కాదు, చనిపోవడానికి సైతం సిద్ధంగా ఉన్నాను” అని చెప్పాడు. ౧౪ అతడు మనసు మార్చుకోడని గ్రహించాక మేము, “ప్రభువు చిత్తం జరుగుతుంది గాక” అని ఊరుకున్నాం.
యెరూషలేములో పౌలు
౧౫ ఆ రోజులు గడచిన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసుకుని యెరూషలేముకు ప్రయాణించాం. ౧౬ మాతో కలిసి కైసరయ నుంచి కొందరు శిష్యులు, మొదటి నుండి శిష్యుడుగా ఉన్న సైప్రసు వాసి మ్నాసోను దగ్గరికి మమ్మల్ని తీసుకుపోయారు. అతని ఇంట్లో మాకు బస ఏర్పాటు చేశారు. ౧౭ మేము యెరూషలేము చేరినప్పుడు సోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకొన్నారు.
౧౮ మరునాడు పెద్దలంతా అక్కడికి వచ్చినపుడు పౌలు మాతో కలిసి యాకోబు దగ్గరికి వచ్చాడు. ౧౯ అతడు వారిని కుశల ప్రశ్నలు అడిగి, తన పరిచర్య వలన దేవుడు యూదేతరుల్లో చేసిన కార్యాలను వివరంగా తెలియజెప్పాడు.
౨౦ అది విని వారు దేవుణ్ణి మహిమపరచి అతనితో, “సోదరా, యూదుల్లో విశ్వాసులు ఎన్ని వేలమంది ఉన్నారో చూశావు గదా? వారంతా ధర్మశాస్త్రంలో ఆసక్తి గలవారు. ౨౧ యూదేతరుల మధ్య నివసించే యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనీ, మన ఆచారాలను పాటించకూడదనీ నీవు చెప్పడం వలన వారంతా మోషేను విడిచిపెట్టాలని నీవు బోధిస్తున్నట్టుగా ఇక్కడి వారికి సమాచారం ఉంది.
౨౨ కాబట్టి మనమేం చేద్దాం? నీవు వచ్చిన సంగతి వారికి తప్పకుండా తెలుస్తుంది. ౨౩ మేము నీకు చెప్పినట్టు చెయ్యి. మొక్కుబడి ఉన్న నలుగురు వ్యక్తులు మా దగ్గర ఉన్నారు. ౨౪ నీవు వారిని తీసుకుపోయి వారితో కూడ శుద్ధి చేసుకుని, వారు తల క్షౌరం చేయించుకోడానికి అయ్యే ఖర్చు నువ్వే భరించు. అప్పుడు నిన్ను గూర్చి తాము విన్న సమాచారం నిజం కాదనీ, నువ్వు కూడా ధర్మశాస్త్రాన్ని యథావిధిగా పాటించే వ్యక్తివనీ వీరు గ్రహిస్తారు.
౨౫ అయితే విశ్వసించిన యూదేతరుల విషయంలో విగ్రహాలకు అర్పించిన వాటినీ, రక్తాన్నీ, గొంతు నులిమి చంపిన దానినీ, జారత్వాన్నీ మానాలని నిర్ణయించి వారికి రాశాం” అని చెప్పారు.
౨౬ కాబట్టి పౌలు ఆ మరునాడు మొక్కుబడి ఉన్న ఆ వ్యక్తుల్ని వెంటబెట్టుకొని వెళ్ళి, వారితో కలిసి శుద్ధి చేసుకుని, దేవాలయంలో ప్రవేశించి, వారందరి పక్షంగా కానుక అర్పించే వరకూ శుద్ధిదినాలు నెరవేరుస్తానని చెప్పాడు.
ఆలయంలో యూదులు పౌలును బంధించడం
౨౭ ఏడు రోజులు పూర్తి కావచ్చినప్పుడు ఆసియ నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూసి, బలవంతంగా పట్టుకొని అక్కడి ప్రజలందరినీ కలవర పరచి ౨౮  “ఇశ్రాయేలీయులారా, వచ్చి సహాయం చేయండి. ప్రజలకీ, ధర్మశాస్త్రానికీ, ఈ స్థలానికీ విరోధంగా అందరికీ, అన్నిచోట్లా బోధిస్తున్నవాడు వీడే. పైగా వీడు గ్రీకు వారిని దేవాలయంలోకి తెచ్చి ఈ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేశాడు” అని కేకలు వేశారు.
౨౯ ఎఫెసు వాడైన త్రోఫిము అంతకు ముందు పౌలుతో కలిసి ఉండడం వారు చూశారు కాబట్టి పౌలు అతణ్ణి కూడా దేవాలయంలోకి తీసుకుని వచ్చాడని వారు భావించారు. ౩౦ పట్టణమంతా గందరగోళంగా ఉంది. ప్రజలు గుంపులు గుంపులుగా పరుగెత్తుకు వచ్చి, పౌలును పట్టుకొని దేవాలయంలో నుండి బయటికి ఈడ్చి తలుపులు మూసేశారు.
౩౧ వారు అతణ్ణి చంపడానికి ప్రయత్నించారు. యెరూషలేము నగరమంతా అల్లకల్లోలంగా ఉందని ప్రధాన సైన్యాధికారికి సమాచారం వచ్చింది. ౩౨ వెంటనే అతడు సైనికులనూ, శతాధిపతులనూ వెంటబెట్టుకొని వారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చాడు. వారు ఆ అధికారినీ, సైనికులనీ చూసి పౌలును కొట్టడం ఆపారు.
౩౩ అతడు వచ్చి పౌలుని పట్టుకొని, రెండు సంకెళ్లతో అతనిని బంధించమని ఆజ్ఞాపించి, “ఇతడెవడు? ఏమి చేశాడు?” అని అడిగాడు. ౩౪ అయితే జనం వివిధ రకాలుగా కేకలు వేస్తూ అల్లరి చేయడం చేత అతడు నిజం తెలుసుకోలేక పౌలును కోటలోకి తీసుకుపొమ్మని ఆజ్ఞాపించాడు.
౩౫ పౌలు మెట్ల మీదికి వచ్చినప్పుడు ప్రజలు గుంపులుగా పోగై దాడికి దిగడం వలన సైనికులు అతణ్ణి మోసుకుపోవలసి వచ్చింది. ౩౬ ఎందుకంటే అతణ్ణి చంపమని ఆ జనసమూహం కేకలు వేస్తూ వారి వెంటబడ్డారు.
౩౭ వారు పౌలుని కోటలోకి తీసుకు పోతుండగా అతడు ఆ సేనాధిపతిని, “నేను నీతో ఒక మాట చెప్పవచ్చా?” అని అడిగాడు. అందుకు అతడు, “నీకు గ్రీకు భాష తెలుసా?’ ౩౮ ఇంతకు ముందు నాలుగు వేలమంది ఉగ్రవాదులను తీసుకుని అరణ్యంలోకి పారిపోయిన ఐగుప్తీయుడివి నువ్వే కదా?” అని అడిగాడు.
౩౯ అందుకు పౌలు, “నేను కిలికియలోని తార్సు పట్టణానికి చెందిన యూదుణ్ణి. ఒక మహా పట్టణపు పౌరుణ్ణి. నాకు ఈ ప్రజలతో మాటలాడే అవకాశం ఇవ్వమని నిన్ను వేడుకుంటున్నాను” అన్నాడు. ౪౦ అతడు దానికి అనుమతించాడు. అప్పుడు పౌలు మెట్ల మీద నిలబడి ప్రజలకి చేతితో సైగ చేశాడు. వారు సద్దుమణిగాక అతడు హెబ్రీ భాషలో ఇలా అన్నాడు.