౨౪
౧ యోవాషు పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతని వయస్సు ఏడేళ్ళు. అతడు యెరూషలేములో 40 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి బెయేర్షెబాకు చెందిన జిబ్యా. ౨ యాజకుడు యెహోయాదా బతికిన రోజులన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్ధంగా ప్రవర్తించాడు.
౩ యెహోయాదా అతనికి ఇద్దరు స్త్రీలనిచ్చి పెళ్ళి చేశాడు. అతనికి కొడుకులూ, కూతుళ్ళూ కలిగారు. ౪ ఇదంతా జరిగిన తరువాత యెహోవా మందిరాన్ని బాగుచేయాలని యోవాషు నిర్ణయించుకున్నాడు. ౫ అతడు యాజకులనూ లేవీయులనూ ఒక చోట సమావేశపరచి వారితో ఇలా అన్నాడు “మీరు యూదా పట్టణాలకు పోయి మీ దేవుని మందిరం బాగుచేయడానికి ఇశ్రాయేలీయులందరి దగ్గర నుంచి ధనం ప్రతి సంవత్సరం పోగుచేయాలి. ఈ పని మీరు త్వరగా మొదలుపెట్టాలి.” మొదట్లో లేవీయులు ఆ పని త్వరగా చేయలేదు.
౬ అందుకు రాజు ప్రధాన యాజకుడు యెహోయాదాను పిలిపించాడు. “సాక్ష్యపు గుడారాన్ని బాగు చేయడానికి యూదాలో నుండీ, యెరూషలేములో నుండీ, ఇశ్రాయేలీయుల సమాజానికి యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీవెందుకు చెప్పి తెప్పించ లేదు?” అని అడిగాడు. ౭ ఎందుకంటే దుర్మార్గురాలైన అతల్యా కొడుకులు దేవుని మందిరాన్ని పాడు చేసి, యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠ ఉపకరణాలన్నిటినీ బయలు దేవుడి పూజకు ఉపయోగించారు.
౮ కాబట్టి రాజాజ్ఞ ప్రకారం వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారం బయట ఉంచారు. ౯ దేవుని సేవకుడైన మోషే, అరణ్యంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను యెహోవా దగ్గరికి ప్రజలు తీసుకు రావాలని యూదాలోనూ యెరూషలేములోనూ వారు చాటించారు. ౧౦ అధికారులందరూ ప్రజలందరూ సంతోషంగా కానుకలు తెచ్చి, పెట్టె నిండేంత వరకూ దానిలో వేశారు.
౧౧ లేవీయులు ఆ పెట్టెను రాజు అధికారుల దగ్గరికి తీసుకువచ్చిన ప్రతిసారీ, అందులో చాలా ధనం కనిపించినప్పుడల్లా రాజు కార్యదర్శి, ప్రధాన యాజకుని అధికారీ వచ్చి, పెట్టె ఖాళీ చేసి దాన్ని యథాస్థానంలో ఉంచేవారు. అనుదినం వారు ఇలా చేస్తూ చాలా ధనం సమకూర్చారు. ౧౨ అప్పుడు రాజు, యెహోయాదా, యెహోవా మందిరంలో పనిచేసే వారికి ఆ ధనాన్ని ఇచ్చారు. యెహోవా మందిరాన్ని బాగుచేయడానికి రాతి పని చేసే వారిని, వడ్రంగి వారిని, ఇనుప పనీ, ఇత్తడి పనీ చేసే వారిని కూలికి తీసుకున్నారు.
౧౩ ఈ విధంగా పనివారు కష్టించి పనిచేస్తుంటే మందిర మరమ్మత్తు చక్కగా కొనసాగింది. వారు దేవుని మందిరాన్ని దాని పూర్వస్థితికి తెచ్చి దాన్ని దృఢపరచారు. ౧౪ వారు దాన్ని పూర్తి చేసిన తరువాత మిగిలిన ధనాన్ని రాజు దగ్గరికీ, యెహోయాదా దగ్గరికీ తీసుకువచ్చారు. ఆ డబ్బుతో వారు యెహోవా మందిరానికి సంబంధించిన వస్తువులనూ, సేవకు ఉపయోగపడే వస్తువులనూ, దహనబలికి ఉపయోగపడే వస్తువులనూ, గరిటెలనూ, వెండీ బంగారు ఉపకరణాలనూ చేయించారు. యెహోయాదా జీవించి ఉన్న రోజులన్నిటిలో వారు యెహోవా మందిరంలో దహనబలులను కొనసాగించారు.
౧౫ యెహోయాదా వయసు మీరి పండు వృద్ధాప్యంలో చనిపోయాడు. అతడు చనిపోయినప్పుడు అతని వయస్సు 130 ఏళ్ళు. ౧౬ అతడు ఇశ్రాయేలీయుల్లో దేవుని కోసం, దేవుని ఇంటి కోసం మంచి మేలు చేశాడు కాబట్టి వారు అతణ్ణి దావీదు పట్టణంలో రాజుల దగ్గర పాతిపెట్టారు. ౧౭ యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధికారులు వచ్చి రాజును గౌరవించారు. రాజు వారి మాటలు విన్నాడు. ౧౮ ప్రజలు తమ పూర్వీకుల దేవుడైన యెహోవా మందిరాన్ని విడిచి, అషేరా దేవతాస్తంభాలను, విగ్రహాలను పూజించారు. వారు చేసిన ఈ దుర్మార్గానికి యూదావారి మీదికీ యెరూషలేము నివాసుల మీదికీ దేవుని కోపం వచ్చింది. ౧౯ అయినా తన వైపు వారిని మళ్లించడానికి యెహోవా వారి దగ్గరికి ప్రవక్తలను పంపాడు. ఆ ప్రవక్తలు వారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలికారు గానీ ప్రజలు వారి మాట వినలేదు.
౨౦ అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కొడుకూ అయిన జెకర్యా మీదికి వచ్చాడు. అతడు ప్రజల ముందు నిలబడి “మీరెందుకు యెహోవా ఆజ్ఞలను ధిక్కరిస్తున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను వదిలివేశారు కాబట్టి ఆయన మిమ్మల్ని వదిలివేశాడని దేవుడు చెబుతున్నాడు” అన్నాడు. ౨౧ అయితే వారతని మీద కుట్ర పన్ని రాజాజ్ఞతో యెహోవా మందిర ఆవరణం లోపల రాళ్ళు రువ్వి అతణ్ణి చంపేశారు. ౨౨ ఈ విధంగా రాజైన యోవాషు జెకర్యా తండ్రి యెహోయాదా తనకు చేసిన ఉపకారాన్ని మరిచిపోయి అతని కొడుకుని చంపించాడు. అతడు చనిపోయేటప్పుడు “యెహోవా దీన్ని చూసి విచారణ చేస్తాడు గాక” అన్నాడు.
౨౩ ఆ సంవత్సరం చివరిలో అరాము సైన్యం యోవాషు మీదికి వచ్చింది. వారు యూదా మీదికీ యెరూషలేము మీదికీ వచ్చి, ప్రజల అధికారులందరినీ హతమార్చి, దోపిడీ సొమ్మంతా దమస్కు రాజు దగ్గరికి పంపారు. ౨౪ అరామీయుల సైన్యం చిన్నదే అయినా యెహోవా ఒక గొప్ప సైన్యంపై వారికి విజయం దయచేశాడు. ఎందుకంటే, యూదావారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను వదిలి వేశారు. ఈ విధంగా అరామీయులు యోవాషుకు శిక్ష అమలు చేశారు.
౨౫ అరామీయులు వెళ్ళిపోయేటప్పటికి యోవాషు తీవ్ర గాయాలతో ఉన్నాడు. యాజకుడైన యెహోయాదా కొడుకులను చంపించినందుకు అతని సొంత సేవకులు అతని మీద కుట్ర చేశారు. అతని పడక మీదే అతణ్ణి చంపేశారు. అతడు చనిపోయిన తరువాత ప్రజలు దావీదు పట్టణంలో అతణ్ణి పాతిపెట్టారు గానీ రాజుల సమాధుల్లో అతణ్ణి పాతిపెట్టలేదు. ౨౬ అమ్మోనీయురాలైన షిమాతు కొడుకు జాబాదు, మోయాబీయురాలు అయిన షిమ్రీతు కొడుకు యెహోజాబాదు అనేవారు అతని మీద కుట్ర చేశారు.
౨౭ యోవాషు కొడుకులను గురించీ, అతని గురించి చెప్పిన ముఖ్యమైన ప్రవచనాల గురించీ, దేవుని మందిరాన్ని పునర్నిర్మించడం గురించీ, రాజుల గ్రంథ వ్యాఖ్యానంలో రాసి ఉంది. అతనికి బదులు అతని కొడుకు అమజ్యా రాజయ్యాడు.