11
మళ్లీ ప్రజల ఫిర్యాదు
ఈ సారి ప్రజలు వారి కష్టాలనుగూర్చి ఫిర్యాదు చేసారు. వారి ఫిర్యాదులను యెహోవా విన్నాడు. యెహోవా వీటిని విన్నప్పుడు ఆయనకు కోపం వచ్చింది. యెహోవా దగ్గరనుండి అగ్ని వచ్చి ప్రజల మధ్య రగులుకొంది. వారున్న స్థలంలో ఒక చివర కొన్ని ప్రాంతాలను అగ్ని కాల్చివేసింది. కనుక ప్రజలు మోషేకు మొరపెట్టుకొన్నారు. మోషే యెహోవాను ప్రార్థించగా అగ్ని కాల్చివేయటం ఆగిపోయింది. అందుచేత ఆ చోటు తబేరా* తబేరా దీని అర్థం “మంట.” అని పిలువబడింది. ఆ ప్రజల మధ్య యెహోవా అగ్నిని దహింపజేసాడు గనుక ఆ స్థలానికి వారు ఆ పేరు పెట్టారు.
70 మంది వృద్ధనాయకులు
ఇశ్రాయేలీయులతో చేరిన విదేశీయులు తినేందుకు ఇంకా ఏవేవో కావాలనికోరటం మొదలు పెట్టారు. త్వరలోనే మొత్తం ఇశ్రాయేలీయులంతా మళ్లీ ఫిర్యాదు చేయటం మొదలు పెట్టారు. ప్రజలు ఇలా అన్నారు, “తినటానికి మాకు మాంసం కావాలి! ఈజిప్టులో మేము తిన్న చేపలు మాకు జ్ఞాపకం వస్తున్నాయి. చేపలు మాకు ఉచితంగా దొరికేవి. మంచి కూరగాయలు— దోసకాయలు, పుచ్చకాయలు, ఆకు కూరలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలు మాకు దొరికేవి. కానీ ఇప్పుడు మాకు బలంలేదు. మేము, ఈ మన్నా తప్ప ఇంకేమి తినటంలేదు!” ఆ మన్నా కొత్తివీమెర గింజల్లా ఉండి, చూపునకు చెట్టుమీద జిగురు (బంక)లా ఉంది. ప్రజలు దీనిని పోగుచేసి, నూరి పిండి చేస్తారు. లేక బండలను ఉపయెగించి దాన్ని పొడుం చేస్తారు. తర్వాత ఒక కుండలో దాన్ని వంట చేసేవారు, లేదా తియ్యటి అప్పాలు చేసేవారు. అప్పాలు ఒలీవ నూనెతో చేసిన రొట్టెల్లా రుచిగా ఉన్నాయి. ప్రతి రాత్రీ నేల అంతా మంచుతో తడిసినప్పుడు మన్నా నేలమీద కురిసింది.
10 ప్రితి కుటుంబం వాళ్లు ఫిర్యాదు చేయటం మోషే విన్నాడు. ప్రజలంతా వారివారి గుడారాంల్లో గొణుగుతున్నారు. యెహోవాకు చాల కోపం వచ్చింది. దానితో మోషేకు చాలా చికాకు కలిగింది. 11 మోషే యెహోవాను అడిగాడు, “యెహోవా, నీ సేవకుడనైన నాకు ఇంత కష్టం ఎందుకు కలిగించావు? నేనేమి పొరబాటు చేసాను? నీకు సంతోషం లేకుండేటట్టు నేను చేసింది ఏమిటి? ఈ ప్రజలందరి బాధ్యత నీవు నాకెందుకు ఇచ్చావు? 12 ఈ ప్రజలందరికీ నేను తండ్రిని కానని నీకు తెలుసు. నేను వీరికి జన్మ ఇవ్వలేదనీ నీకు తెలుసు. కానీ పాలిచ్చి పెంచే దాదిలా నేనే వీరిని నా చేతుల్లో ఎత్తుకొని పోవాల్సినట్టు కనబడుతుంది. నేను ఇలా చేసేటట్టుగా నీవెందుకు నన్ను బలవంతం చేస్తున్నావు? నీవు మా పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశానికి నేను వారిని మోసుకొని వెళ్లాలని నీవెందుకు నన్ను బలవంతం చేస్తున్నావు? 13 ఈ ప్రజలందరికీ మాంసం నాదగ్గర లేదు. కానీ వారు నాకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ‘తినటానికి మాంసం ఇవ్వు’ అంటున్నారు వారు. 14 ఈ ప్రజలందరినీ గూర్చి నేను ఒక్కడినే బాధ్యత వహించలేను. ఈ భారం నాకు చాల బరువుగా ఉంది. 15 వారి కష్టాలన్నీ నీవు నా మీదే పెట్టాలనుకొంటే, ఇప్పుడే నన్ను చంపేయి. నన్ను నీ సేవకునిగా నీవు అంగీకరిస్తే, నన్ను ఇప్పుడే చావనివ్వు. అప్పుడు నా కష్టాలన్నీ తీరిపోతాయి.”
16 మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల పెద్దలను (నాయకులను) 70 మందిని నాదగ్గరకు తీసుకునిరా. వీరు ప్రజలలో నాయకులు. సన్నిధి గుడారం దగ్గరకు వారిని తీసుకునిరా. అక్కడ నీతోబాటు వారిని నిలబెట్టు. 17 అప్పుడు నేను దిగివచ్చి, అక్కడ నీతో మాట్లాడతాను. ఇప్పుడు నీ మీదికి వచ్చిన ఆత్మను వారికికూడ నేను కొంత ఇస్తాను. అప్పుడు నీవు ప్రజల బాధ్యత వహించటంలో వారు కూడ నీకు సహాయం చేస్తారు. ఈ విధంగా ఈ ప్రజల బాధ్యత నీవు ఒంటరిగా భరించాల్సిన అవసరం ఉండదు.
18 “ప్రజలతో ఇలా చెప్పు: రేపటికోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. రేపు మీరు మాంసం తింటారు. మీ ఏడ్పు యెహోవా విన్నాడు. ‘తినటానికి మాకు మాంసం కావాలి. ఈజిప్టులోనే బాగుంది మాకు’ అని మీరు చెప్పిన మాటలు యెహోవా విన్నాడు. కనుక యెహోవా ఇప్పుడు మీకు మాంసం ఇస్తాడు. మీరు అది తింటారు. 19 ఒకటి, రెండు, అయిదు, పది, ఇరవై రోజులకంటె ఎక్కువగానే మీరు అది తింటారు. 20 ఒక నెల అంతా మీరు ఆ మాంసం తింటారు. మొఖం మొత్తేటంతవరకు మీరు ఆ మాంసం తింటారు. యెహోవాకు వ్యతిరేకంగా మీరు ఫిర్యాదు చేసారు కనుక మీకు ఇలా జరుగుతుంది. యెహోవా మీ మధ్య సంచరిస్తూ, మీ అవసరాలను గ్రహిస్తాడు. కానీ మీరు ఆయన ఎదుట ఏడ్చి, ఫిర్యాదు చేసారు! అసలు ‘మేము ఈజిప్టు ఎందుకు విడిచిపెట్టాము’ అన్నారు మీరు.”
21 మోషే అన్నాడు: “యెహోవా, ఇక్కడ 6,00,000 మంది పురుషులు సంచరిస్తున్నారు. ‘నీవేమో వారు ఒక నెలంతా తినటానికి సరిపోయే మాంసం ఇస్తాను అంటున్నావు!’ 22 మొత్తం గొర్రెలు, పశువులు అన్నింటినీ వధించినా, ఇంత మంది ప్రజలకు ఒక నెల అంతా భోజనంగా పెట్టాలంటే అది చాలదు. అలానే సముద్రంలో ఉన్న మొత్తం చేపలన్నీ మేము పట్టినా, అవీ వారికి చాలవు.”
23 అయితే, “యెహోవా శక్తిని పరిమితం చేయకు. నేను చేస్తానని చెప్పినవాటిని చేస్తానో లేదో నీవు చూస్తావు” అని మోషేతో యెహోవా చెప్పాడు.
24 కనుక మోషే ప్రజలతో మాట్లాడటానికి బయటకు వెళ్లాడు. యెహోవా చెప్పినది మోషే వారితో చెప్పాడు. అప్పుడు మోషే 70 మంది పెద్దలను సమావేశ పరచాడు. గుడారం చుట్టూ నిలబడమని మోషే వారితో చెప్పాడు. 25 అప్పుడు యెహోవా ఒక మేఘంలో దిగివచ్చి, మోషేతో మాట్లాడాడు. మోషే మీద ఉన్న దేవుని ఆత్మను ఆ 70 మంది పెద్దల మీద ఉంచాడు యెహోవా. మోషే … యెహోవా అనగా దేవుడు మోషేలో వున్నటువంటి తన ఆత్మను ప్రజలమీద కుమ్మరించాడని దీని భావం. ఆత్మ వారిమీదికి దిగిరాగానే వారు ప్రవచించటం మొదలు పెట్టారు. అయితే ఈ ఒక్కసారి మాత్రమే ఆ మనుష్యులు ఇలా చేసారు.
26 ఎల్దాదు, మేదాదు అనే అద్దరు పెద్దలు బయట గుడారం దగ్గరకు వెళ్లలేదు. వారి పేర్లు పెద్దల జాబితాలో ఉన్నాయి గాని వారు వారి గుడారంలోనే ఉండిపోయారు. కానీ దేవుని ఆత్మ వారిమీదకి కూడ వచ్చి నందుచేత, వారుకూడ వారి గుడారంలోనే ప్రవచించటం మొదలుపెట్టారు. 27 ఒక యువకుడు పరుగెత్తి వెళ్లి మోషేతో చెప్పాడు. “ఎల్దాదు, మేదాదు గుడారంలోనే ప్రవచిస్తున్నారు” అని అతడు చెప్పాడు.
28 అయితే నూను కుమారుడైన యెహోషువ “అయ్యా మోషే, నీవు వారిని ఆపివేయాలి” అని మోషేతో చెప్పాడు. (యెహోషువ చిన్నతనం నుండి మోషేకు సహాయకుడుగా ఉన్నాడు.)
29 కానీ మోషే, “ఇప్పుడు నేను నాయకుడ్ని కానని ప్రజలు తలుస్తారేమోనని నీవు భయపడుతున్నావా? యెహోవా ప్రజలు అందరూ ప్రవచిస్తే బాగుటుందని నా ఆశ. వారందరి మీద యెహోవా తన ఆత్మను ఉంచితే బాగుండునని నా ఆశ” అని బదులు చెప్పాడు. 30 అప్పుడు మోషే, ఇశ్రాయేలు నాయకులు అంతా తిరిగి గుడారాలకు వెళ్లిపోయారు.
పూరేళ్లు వచ్చాయి
31 అప్పుడు యెహోవా సముద్రం నుండి గొప్పగాలి వీచేటట్టుగా చేసాడు. ఆ గాలి పూరేళ్లను ఆ ప్రాంతంలోకి విసిరాయి. వారి నివాసాల చుట్టూరా పూరేళ్లు ఎగిరాయి. నేల అంతా పూరేళ్లతో నిండి పోయేటన్ని ఉన్నాయి అవి. నేలమీద మూడు అడుగుల ఎత్తుగా పూరేళ్లు నిండిపోయాయి. ఒక మనిషి ఒక రోజున నడువగలిగినంత దూరం అన్ని దిశల్లో పూరేళ్లు ఉన్నాయి. 32 ప్రజలు బయటకు వెళ్లి ఆ రాత్రి పగలు అంతా పూరేళ్లను ఏరుకొన్నారు. ఆ మర్నాడు అంతా వారు పూరేళ్లు పోగుచేసుకొన్నారు. తక్కువ కూర్చుకొన్నవాడు నూరు తూములుకన్నా ఎక్కువ పూరేళ్లను పోగుచేసుకున్నాడు. తర్వాత ప్రజలు ఆ పూరేళ్లను వారి గుడారాల చుట్టూ ఎండటానికి ఎండలో పరిచారు.
33 ప్రజలు మాంసం తినటం మొదలుపెట్టారు కాని యెహోవాకు చాల కోపం వచ్చింది. ఆ మాంసం ఇంకా వారి నోటిలో ఉండగానే, ప్రజలు దానిని తినటంముగించక ముందే ఆ ప్రజలకు భయంకరమైన రోగం వచ్చేటట్టు చేసాడు యెహోవా. అనేకులు అక్కడే మరణించినందువల్ల అక్కడే పాతిపెట్టబడ్డారు. 34 కనుక ప్రజలు ఆ చోటుకు కిబ్రోత్ హత్తావా కిబ్రోత్ హత్తావా దీని అర్థం “దురాశ సమాధులు.” అని పేరు పెట్టారు. గొప్ప భోజనం కోసం బలీయమైన కోరికగల వారందరినీ అక్కడ పాతిపెట్టినందువల్ల వారు ఆ చోటుకు ఆ పేరు పెట్టారు.
35 కిబ్రోత్ హత్తావా నుండి ప్రయాణం చేసి ప్రజలు హజేరోతు చేరి అక్కడ నివసించారు.

*11:3: తబేరా దీని అర్థం “మంట.”

11:25: మోషే … యెహోవా అనగా దేవుడు మోషేలో వున్నటువంటి తన ఆత్మను ప్రజలమీద కుమ్మరించాడని దీని భావం.

11:34: కిబ్రోత్ హత్తావా దీని అర్థం “దురాశ సమాధులు.”