15
సమ్సోను ఫిలిష్తీయులకు కష్టాలు కలిగించుట
1 గోధుమ పంట కోతల సమయంలో, సమ్సోను తన భార్యను చూడటానికి వెళ్లాడు. ఆమెకు కానుకగా ఒక పడుచు మేకను తీసుకు వెళ్లాడు. అతను ఇలా అన్నాడు: “నేను నా భార్య గదికి వెళ్ళుతున్నాను.”
2 కాని ఆమె తండ్రి సమ్సోనుని లోపలికి వెళ్లనీయలేదు. ఆమె తండ్రి సమ్సోనుతో ఇలా అన్నాడు; “ఆమెను నీవు ద్వేషించినట్లు భావించాను. అందువల్లనే వివాహమునకు వచ్చిన తోడి పెండ్లి కుమారుడ్ని వివాహము చేసుకోమన్నాను. ఆమె చిన్న చెల్లెలు చాలా సౌందర్యవతి. ఆ చిన్న చెల్లెలిని తీసుకువెళ్లు”
3 కాని సమ్సోను అతనితో ఇలా అన్నాడు; “మీ ఫిలిష్తీయులను బాధించేందుకు తగిన కారణం ఇప్పుడు నాకు కనిపించింది. ఇప్పుడు నన్నెవ్వరూ నిందించరు.”
4 అందువల్ల సమ్సోను బయటికి వెళ్లి మూడు వందల నక్కల్ని పట్టుకున్నాడు. ఒకేసారి రెండేసి నక్కల్ని తీసుకుని వాటి తోకల్ని జతలు జతలుగా కట్టివేశాడు. ప్రతి రెండు నక్కల తోకలకు మధ్య ఒక దివిటీ కట్టి వేశాడు. 5 తరువాత నక్కల తోకల మధ్య ఉన్న దివిటీలు వెలిగించాడు. ఆ తర్వాత ఫిలిష్తీయుల ధాన్యపు రాసుల గుండా నక్కల్ని పరుగెత్తనిచ్చాడు. ఆ విధంగా, అతను వారి పొలాలలో పెరిగిన మొక్కల్నీ, కోసిపెట్టిన ధాన్యపు రాసుల్నీ కాల్చివేశాడు. అతను వాళ్ల ద్రాక్ష తోటల్ని, వాళ్ల ఒలీవ చెట్లని కూడా కాల్చివేశాడు.
6 “ఈ పని ఎవరు చేశారు?” అని ఫిలిష్తీయులు అడిగారు.
ఎవరో ఇలా చెప్పారు: “తిమ్నాతుకు చెందిన ఆ మనిషియొక్క అల్లుడైన సమ్సోను ఈ పనిచేశాడు. అతను ఈ విధంగా ఎందుకు చేశాడంటే, అతని మామగారు సమ్సోను భార్యని పెళ్లిలోని అతని స్నేహితునికి ఇచ్చివేశాడు.” అందువల్ల సమ్సోను భార్యనీ, ఆమె తండ్రినీ ఫిలిష్తీయులు కాల్చి వేశారు.
7 అప్పుడు ఫిలిష్తీయులను ఉద్దేశించి సమ్సోను ఇలా అన్నాడు; “మీరు నాకు ఈ విధంగా కీడు చేశారు. అందువల్ల మీకు ఇప్పుడు నేను కీడు చేస్తాను. అప్పుడు నేను మీమీద పగతీర్చుకోవడం మానేస్తాను.”
8 తర్వాత సమ్సోను ఫిలిష్తీయుల మీద దాడిచేశాడు. చాలా మందిని చంపివేశాడు. తర్వాత అతను వెళ్లి ఒక గుహలో నివసించెను. ఏతాము బండ అనే ప్రదేశంలో ఆ గుహ ఉన్నది.
9 అప్పుడు ఫిలిష్తీయులు యూదా ప్రాంతానికి తరలిపోయారు. లేహీ అనే చోట వారు నిలిచారు. వారి సైనికులు అక్కడ విడిదిచేసి యుద్ధానికి సిద్ధపడ్డారు. 10 యూదా వంశానికి చెందిన మనుష్యులు వారిని ఇలా ప్రశ్నించారు: “ఫిలిష్తీయులైన మీరు మాతో యుద్ధం చేసేందుకు ఎందుకు ఇక్కడికి వచ్చారు?”
అందుకు వారు ఇలా అన్నారు: “మేము సమ్సోనును పట్టుకోడానికి వచ్చాము. అతనిని మేము మా బందీగా చేసుకోవడానికి వచ్చాము. అతను మా ప్రజలకి చేసిన పనులకు బదులుగా అతనిని శిక్షిస్తాము.”
11 అప్పుడు యూదా వంశస్థులైన మూడువేల మంది మనుష్యులు సమ్సోనును పట్టుకొనుటకు ఏతాము బండకి దగ్గరగా వున్న ఆ గుహ వద్దకు వెళ్లి. అతనితో ఇలా అన్నారు: “నీవు మాకేమి చేశావు? ఫిలిష్తీయులు మమ్మల్ని పరిపాలిస్తున్నారని నీకు తెలియదా?”
“వారు నాకు చేసిన కీడుకు బదులుగా వారిని నేను శిక్షించాను.” అని సమ్సోను సమాధానం చెప్పాడు.
12 అప్పుడు వారు సమ్సోనుతో ఇలా అన్నారు: “మేము నిన్ను బంధించడానికి వచ్చాము. మేము నిన్ను ఫిలిష్తీయులకు అప్పజెప్పుతాము.”
యూదా నుండి వచ్చిన మనుష్యులతో సమ్సోను ఇలా అన్నాడు: “మీరు నాకు ఏమీ అపకారం చేయమని నాకు మాట ఇవ్వాలి.”
13 యూదా నుండి వచ్చిన మనుష్యులు ఇలా అన్నారు: “అందుకు మేము సమ్మతిస్తున్నాము. మేము నిన్ను బంధించి, ఫిలిష్తీయులకు అప్పజెప్పుతాము. మేము నిన్ను చంపమని మాట ఇస్తున్నాము.” అప్పుడు వారు రెండు కొత్త తాళ్లతో సమ్సోనును బంధించారు. ఆ ప్రాంతంలోని గుహనుంచి అతనిని తీసుకువెళ్లారు.
14 లేహీ అనే చోటికి సమ్సోను రాగానే, ఫిలిష్తీయులు అతనిని కలుసుకోడానికి అక్కడికి వచ్చారు. సంతోషంతో వారు కేకలు వేశారు. అప్పుడు యెహోవా ఆత్మ గొప్ప శక్తితో సమ్సోనును నింపగా, సమ్సోను తాళ్లు తెంపుకున్నాడు. కాలిపోయిన దారంవలె ఆ తాళ్లు బలహీనముగా కనిపించాయి. కరిగిపోయినట్లుగా ఆ తాళ్లు సడలిపోయాయి. 15 సమ్సోను చచ్చిపోయిన ఒక గాడిద దవడ ఎముకను చూశాడు. అతను ఆ దవడ ఎముకను తీసుకున్నాడు. దానితో వేయి మంది ఫిలిష్తీయుల్ని చంపివేశాడు.
16 తర్వాత సమ్సోను అన్నాడు:
“గాడిద దవడ ఎముకతో
వెయ్యి మందిని చంపాను!
గాడిద దవడ ఎముకతో
వారిని ఎత్తైన కుప్పగా పేర్చాను!”
17 సమ్సోను ఈలాగు చెప్పిన తర్వాత, ఆ దవడ ఎముకను అతడు క్రిందికి విసరివేశాడు. అందువల్ల ఆ ప్రదేశానికి రామత్లేహీ* రామత్లేహీ దవడ కొండ అని దీని అర్థం. అనే పేరు వచ్చింది.
18 సమ్సోనుకు బాగా దాహం వేసింది. అందువల్ల అతను యెహోవాను ఉద్దేశించి కేకపెట్టాడు. అతను అన్నాడు: “నేను నీ భక్తుడను. నీవు నాకు మహా విజయం సమకూర్చావు. ఇప్పుడు దప్పిక బాధతో నన్ను మరణం పాలుచేయవద్దు. సున్నతి కూడా చేసుకోని మనుష్యులకు నన్ను పట్టుబడకుండా చెయ్యి”
19 లేహీలోని నేలలో ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రం బద్దలయ్యేలా దేవుడు చేసెను. నీళ్లు వెలికి వచ్చాయి. ఆ నీటిని సమ్సోను తాగి, హాయిపొందాడు. అతను మళ్లీ బలవంతుడయ్యాడు. అందువల్ల అతను ఆ నీటి బుగ్గకి ఎన్ హకోరె† ఎన్ హకోరె అనగా పిలిచిన వాని ఊట అని అర్థం. అని పేరు పెట్టాడు. నేటికీ లేహీ నగరంలో అది ఉంది.
20 ఈ రీతిగా ఇశ్రాయేలు ప్రజలకు సమ్సోను న్యాయాధిపతిగా ఇరవై సంవత్సరాలపాటు వ్యవహరించాడు. ఇది ఫిలిష్తీయులు నివసించిన కాలంలో జరిగింది.