41
యెహోవా శాశ్వతమైన సృష్టికర్త
1 యెహోవా చెబతున్నాడు:
“దూర దేశాల్లారా, మౌనంగా ఉండి నా దగ్గరకు రండి.
దేశాల్లారా ధైర్యంగా ఉండండి.
నా దగ్గరకు వచ్చి మాట్లాడండి.
మనం కలిసికొందాం.
ఎవరిదిసరియైనదో నిర్ణయించేద్దాం.
2 ఈ ప్రశ్నలకు నాకు జవాబు చెప్పండి: తూర్పునుండి వస్తోన్న ఆ మనిషిని మేల్లొలిపింది ఎవరు?
మంచితనం నాతో కూడ నడుస్తుంది.
అతడు తన ఖడ్గం ఉపయోగించి రాజ్యాలను ఓడిస్తాడు.
వారు ధూళి అవుతారు. అతడు తన విల్లును ఉపయోగించి రాజులను జయిస్తాడు.
వారు గాలికి కొట్టుకొని పోయే పొట్టులా పారిపోతారు.
3 అతడు సైన్యాలను తరుముతాడు, ఎన్నడూ బాధనొందడు.
అతడు అంతకు ముందు ఎన్నడూ వెళ్లని స్థలాలకు వెళ్తాడు.
4 ఈ సంగతులు జరిగేట్టు చేసింది ఎవరు? ఇది ఎవరు చేశారు?
ఆదినుండి మనుష్యులందరినీ పిలిచింది ఎవరు?
యెహోవాను నేనే ఈ సంగతులను చేశాను.
యెహోవా నేనే మొట్ట మొదటి వాడ్ని ఆరంభానికి ముందే నేను ఇక్కడ ఉన్నాను.
అన్నీ ముగింపు అయన తర్వాత కూడ నేను ఇక్కడ ఉంటాను.
5 దూర దూర స్థలాలూ మీరంతా
చూచి భయపడండి.
భూమ్మీద దూరంగా ఉన్న స్థలాలూ
మీరంతా భయంతో వణకండి.
మీరంతా దగ్గరగా రండి,
నా మాటలు వినండి.
6 “పనివాళ్లూ, ఒకరికి ఒకరు సహాయం చేసుకొంటారు. ఒకరిని ఒకరు బలపర్చుకొంటారు. 7 ఒక పనివాడు ఒక విగ్రహం చేసేందుకు కర్ర కోస్తాడు. ఆ వ్యక్తి కంసాలికి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. మరో మనిషి సుత్తెతో లోహాన్ని మెత్తగా చేస్తాడు. అప్పుడు ఆ పనివాడు దాగలితో పని చేసేవాడ్ని ప్రోత్సహిస్తాడు. ‘ఈ పని బాగుంది, లోహం ఊడిపోదు’ అంటాడు ఈ చివరి పనివాడు. అందుచేత అతడు ఆ విగ్రహాన్ని ఒక పీటకు మేకులతో బిగిస్తాడు. విగ్రహం పడిపోదు. అది ఎప్పటికీ కదలదు.”
యెహోవా మాత్రమే మనలను రక్షించగలడు
8 యెహోవా చెబతున్నాడు: “ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడివి
యాకోబూ, నిన్ను నేను ఏర్పరచుకొన్నాను.
నీవు అబ్రాహాము వంశంవాడివి. అబ్రాహామును నేను ప్రేమించాను.
9 భూమిమీద నీవు చాలా దూరంగా ఉన్నావు.
నీవు చాలా దూర దేశంలో ఉన్నావు.
అయితే నేను నిన్ను పిలిచి,
నీవు నా సేవకుడివి.
నేను నిన్ను ఏర్పరచుకొన్నాను.
నేను నీకు విరోధంగా తిరుగలేదు అని చెప్పాను.
10 దిగులుపడకు, నేను నీతో ఉన్నాను.
భయపడకు, నేను నీ దేవుణ్ణి.
నేను నిన్ను బలంగా చేశాను.
నేను నీకు సహాయం చేస్తాను.
నేను మంచితనపు కుడిహస్తంతో నిన్ను బలపరుస్తాను.
11 చూడు, కొంతమంది మనుష్యులు నీ మీద కోపంగా ఉన్నారు.
కానీ వాళ్లు సిగ్గుపడతారు.
నీ శత్రువులు అదృశ్యమై నశిస్తారు.
12 నీ విరోధుల కోసం నీవు వెదకుతావు.
కానీ నీవు వారిని కనుగొనలేవు.
నీకు విరోధంగా యుద్ధం చేసినవాళ్లు
పూర్తిగా కనబడకుండా పోతారు.
13 నేను యెహోవాను,
నీ దేవుణ్ణి నేను నీ కుడిచేయి పట్టుకొన్నాను.
నీవు భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను.
అని నేను నీతో చెబతున్నాను.
14 పశస్తమైన యూదా, భయపడకు ప్రియమైన నా ఇశ్రాయేలు ప్రజలారా భయపడవద్దు.
నిజంగా నేను మీకు సహాయం చేస్తాను.”
సాక్షాత్తూ యెహోవాయే ఆ మాటలు చెప్పాడు.
“ఇశ్రాయేలు పరిశుద్ధుడు (దేవుడు),
నిన్ను రక్షించేవాడు ఈ సంగతులు చెప్పాడు:
15 చూడు, నిన్ను నేను ఒక కొత్త నూర్పిడి చెక్కగా చేశాను. ఈ పనిముట్టుకు పదునైన పండ్లు చాలా ఉన్నాయి.
ధాన్యపు గింజల గుల్లలు పగులగొట్టుటకు రైతులు దీనిని ఉపయోగిస్తారు.
నీవు పర్వతాలను అణగ దొక్కి, చితుక గొడ్తావు. కొండలను నీవు పొట్టులా చేస్తావు.
16 వాటిని గాలిలో విసిరివేస్తావు.
గాలి దానిని విసరి, చెదరగొడ్తుంది.
అప్పుడు నీవు యెహోవాయందు సంతోషంగా ఉంటావు.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుని) గూర్చి నీవు ఎంతగానో అతిశయిస్తావు.
17 “పేదలు, అక్కరలో ఉన్నవారు నీళ్లకోసం వెదకుతారు.
కానీ వారికి ఏమీ దొరకవు.
వారు దాహంతో ఉన్నారు. వారి నాలుకలు పిడచకట్టాయి.
నేను వారి ప్రార్థనలకు జవాబిస్తాను.
నేను వాళ్లను విడువను, చావనివ్వను.
18 ఎండిపోయిన కొండల మీద నేను నదులను ప్రవహింపజేస్తాను.
లోయలో నీటి ఊటలను నేను ప్రవహింపజేస్తాను.
అరణ్యాన్ని నీటి సరసుగా నేను చేస్తాను.
ఎండిన భూములలో నీటి బుగ్గలు ఉబకుతాయి.
19 అరణ్యంలో వృక్షాలు పెరుగుతాయి.
దేవదారు వృక్షాలు, తుమ్మ చెట్లు గొంజి చెట్లు, తైలవృక్షాలు తమాల వృక్షాలు, సరళ వృక్షాలు అక్కడ ఉంటాయి.
20 ఈ సంగతులు జరగడం ప్రజలు చూస్తారు. యెహోవా శక్తిచేత ఇవి జరిగాయని వారు తెలుసుకొంటారు.
ప్రజలు ఈ సంగతులు చూస్తారు.
వారు గ్రహించటం మొదలుబెడతారు.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు (దేవుడు)
ఈ సంగతులను చేసినట్టు వారు తెలుసుకొంటారు.”
అబద్దపు దేవతలతో యెహోవా పందెం
21 యాకోబు రాజు, యెహోవా చెబతున్నాడు: “రండి మీ వివాదాలు నాతో చెప్పండి. మీ రుజువులు చూపించండి, సరియైన విధంగా మనం నిర్ణయంచేద్దాం. 22 జరుగుతోన్న వాటిని గూర్చి, మీ విగ్రహాలు (అబద్ధపు దేవతలు) వచ్చి మాతో చెప్పాలి. మొదట్లో ఏమి జరిగింది? భవిష్యత్తులో ఏమి జరుగుతుంది? మాతో చెప్పండి. మేమి జాగ్రత్తగా వింటాం. అప్పుడు తర్వాత ఏము జరుగుతుంది అనేది మాకు తెలుస్తుంది. 23 ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకు గాను మేము ఎదురు చూడాల్సిన వాటిని గూర్చి చెప్పండి. అప్పుడు మీరు నిజంగానే దేవుళ్లు అని మేము నమ్ముతాం. ఏదో ఒకటి చేయండి. ఏదైనా సరే మంచిగాని చెడుగాని చేయండి. అప్పుడు మీరు బతికే ఉన్నారని మాకు తెలుస్తుంది. మేము మిమ్మల్ని వెంబడించగలుగుతాం.
24 “చూడండి, తప్పుడు దేవుళ్లారా, మీరు శూన్యం కంటె తక్కువ. మీరు ఏమీ చేయలేరు. ఉత్త పనికి మాలిన మనిషి మాత్రమే మిమ్మల్ని పూజించాలను కొంటాడు.”
యెహోవా తానొక్కడే దేవుడని ఋజువు చేయటం
25 “ఉత్తరాన నేను ఒక మనిషిని మేల్కొపాను.
సూర్యోదయమయ్యే తూర్పు దిశనుండి అతడు వస్తున్నాడు.
అతడు నా నామాన్ని ఆరాధిస్తాడు.
కుమ్మరి మట్టి ముద్దను తొక్కుతాడు. అదే విధంగా ఈ ప్రత్యేక మనిషి రాజులను అణగదొక్కుతాడు.
26 “ఇది జరుగక ముందే దీనినిగూర్చి మాతో ఎవరు చెప్పారు?
ఆయన్ను మనం దేవుడు అని పిలవాలి.
మీ విగ్రహాల్లో ఒకటి ఈ సంగతులను మాకు చెప్పిందా? లేదు.
ఆ విగ్రహాల్లో ఏదీ మాకేమీ చెప్పలేదు. ఆ విగ్రహాలు ఒక్క మాట కూడ చెప్పలేదు.
మరియు మీరు చెప్పే ఒక్క మాట కూడ ఆ అబద్ధపు దేవుళ్ళు వినలేవు.
27 ఈ విషయాలను గూర్చి యెహోవాను, నేనే మొట్టమొదట సీయోనుకు చెప్పాను.
‘చూడండి, మీ ప్రజలు తిరిగి వస్తున్నారు’ అనే ఒక సందేశం ఇచ్చి
ఒక సందేశహరుని యెరూషలేముకు నేను పంపించాను.”
28 ఆ తప్పుడు దేవుళ్లను నేను చూశాను.
వారిలో ఎవరూ ఏమీ చెప్పగల తెలివి లేనివాళ్లు.
వాళ్లను నేను ప్రశ్నలు అడిగాను.
కానీ వారు ఒక్క మాట కూడా పలుకలేదు.
29 ఆ దేవుళ్లంతా శూన్యంకంటె తక్కువ.
వాళ్లు ఏమీ చేయలేరు.
ఆ విగ్రహాలు బొత్తిగా పనికి మాలినవి.