32
ఫరో ఒక సింహమా? మహా సర్పమా?
చెరకి కొనిపోబడిన పన్నెండవ సంవత్సరం, పన్నెండవ నెల (మార్చి) మొదటి రోజున యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరోను గురించి ఈ విషాద గీతిక ఆలపించు. అతనితో ఇలా చెప్పు:
 
“ ‘దేశాల మధ్య గర్వంగా తిరుగాడే బలమైన యువకిశోరం అని నీకు నీవే తలుస్తున్నావు.
కాని, నిజానికి నీవు సముద్రాల్లో తిరుగాడే మహాసర్పానివా.
నీటి కాలువల గుండా నీ దారిని తీసుకొంటున్నావు.
నీ కాళ్లతో కెలికి నీళ్లను మురికి చేస్తున్నావు.
నీవు ఈజిప్టు నదులను కెలుకుతున్నావు.’ ”
 
నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
 
“అనేక మంది ప్రజలను నేను ఒక దగ్గరికి చేర్చాను.
నేనిప్పుడు నా వలను నీ మీదికి విసురుతాను.
ఆ ప్రజలంతా అప్పుడు నిన్ను లోపలకి లాగుతారు.
పిమ్మట నిన్ను ఎండిన నేలపై నేను పడేస్తాను.
నిన్ను పొలాల్లో విసరివేస్తాను.
నిన్ను తినటానికి పక్షులన్నిటినీ రప్పిస్తాను.
కడుపునిండా నిన్ను తినటానికి అన్నిచోట్ల నుండి అడవి జంతువులను రప్పిస్తాను.
నీ కళేబరాన్ని పర్వతాల మీద చిందర వందరగా వేస్తాను.
నీ కళేబరంతో లోయలు నింపుతాను.
నీ రక్తాన్ని పర్వతాలపై నేను ఒలక బోస్తాను.
అది భూమిలో ఇంకిపోతుంది.
నదులన్నీ నీతో నిండి ఉంటాయి.
నిన్ను మాయం చేస్తాను.
నేను ఆకాశాన్ని కప్పివేసి నక్షత్రాలు కన్పించకుండా చేస్తాను.
ఒక మేఘంతో నేను సూర్యుణ్ణి కప్పివేయగా చంద్రుడు ప్రకాశించడు.
ఆకాశంలో మెరిసే జ్యోతులన్నీ నీపై వెలుగును ప్రసరించకుండా చేస్తాను.
నీ దేశమంతటా నేను చీకటిమయం చేస్తాను.
 
“నిన్ను నాశనం చేయటానికి నీ మీదికి నేను శత్రువును తీసుకొని వచ్చినట్లు తెలుసుకొని అనేక మంది ప్రజలు దుఃఖిముఖులై, తలక్రిందులౌతారు. నీ వెరుగని దేశాలు కూడా కలవరపాటు చెందుతాయి. 10 నీ విషయంలో చాలా మంది ఆశ్చర్యపోయేలా చేస్తాను. నేను నా కత్తిని వారి ముందు ఝళిపించడానికి మునుపే వారి రాజులు నీ విషయంలో విపరీతంగా భయపడతారు. నీవు పతనమైన రోజున ప్రతిక్షణం రాజులు భయంతో కంపించి పోతారు. ప్రతీ రాజూ తనభద్రత కొరకు భయపడతాడు.”
11 దానికి తగిన కారణం నా ప్రభువైన యెహోవా ఇలా తెలియజేస్తున్నాడు: “బబులోను రాజు యొక్క కత్తి నీపై యుద్ధానికి వస్తుంది. 12 యుద్ధంలో నీ ప్రజలను చంపటానికి నేను ఆ సైనికులను వినియోగిస్తాను. అన్ని దేశాలలో అతి భయంకరమైన దేశం నుండి ఆ సైనికులు వస్తారు. ఈజిప్టు అతిశయబడే వస్తువులన్నిటినీ వారు ధ్వంసం చేస్తారు. ఈజిప్టు ప్రజలు నాశనం చేయబడతారు. 13 ఈజిప్టు నదీ తీరాలలో అనేకమైన జంతువులున్నాయి. ఆ జంతువులన్నిటినీ కూడ నేను నాశనం చేస్తాను! ప్రజలిక ఎంతమాత్రం తమ కాళ్లతో నీటిని మురికిచేయరు. ఆవుల గిట్టలు ఇక ఎంతమాత్రం నీటిని మురికి చేయవు. 14 ఆ విధంగా ఈజిప్టు నీటిని నేను శాంతపర్చుతాను. వారి నదులు ప్రశాంతంగా ప్రవహించేలా చేస్తాను. అవి నూనెవలె మృదువుగా జాలు వారుతాయి.” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు. 15 “నేను ఈజిప్టు దేశాన్ని ఏమీ లేకుండా చేస్తాను. ఆ రాజ్యం సమస్తాన్ని కోల్పోతుంది. ఈజిప్టులో నివసిస్తున్న ప్రజలందరినీ నేను శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని, ప్రభువునని వారు గుర్తిస్తారు!
16 “ఈజిప్టు కొరకు ప్రజలు పాడే ఒక విషాద గీతిక ఇది. ఇతర దేశాల కుమారైలు (నగరాలు) ఈజిప్టును గూర్చి ఈ విలాప గీతం పాడతారు. ఈజిప్టును గురించి, దాని ప్రజల గురించి వారు దీనిని విలాప గీతంగా ఆలపిస్తారు.” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
ఈజిప్టు నాశనమవబోవటం
17 దేశం నుండి వెళ్లగొట్టబడిన పన్నెండవ సంవత్సరంలో, అదే నెలలో పదిహేనవ రోజున యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 18 “నరపుత్రుడా, ఈజిప్టు ప్రజల కొరకు విలపించు. ఈజిప్టును, ఇతర బలమైన దేశాల కుమారైలను సమాధికి నడిపించు. పాతాళానికి చేరిన ఇతర జనులతో ఉండటానికి వారిని అధోలోకానికి నడిపించు.
19 “ఈజిప్టూ నీవు ఇతరులెవరికంటెను గొప్ప దానివి కాదు! మృత్యు స్థానానికి వెళ్లు! వెళ్లి, అక్కడ అన్య జనులతో పడివుండు.
20 “యుద్ధంలో హతులైన వారందరితో కలిసి ఉండటానికి ఈజిప్టు వెళుతుంది. శత్రువు ఆమెను, ఆమె జనులను దూరంగా లాగి పడవేసినాడు.
21 “బలవంతులు, పరాక్రమశాలులు యుద్ధంలో చంపబడ్డారు. ఆ పరాయి వరాంతా మృత్యు స్థలానికి దిగి వెళ్లారు. ఆ ప్రదేశం నుండి చనిపొయిన మనుష్యులు ఈజిప్టుతోను, దాని సహాయకులతోను మాట్లాడతారు వారు కూడ యుద్ధంలో చంపబడతారు.
22-23 “అష్షూరు, దాని సర్వ సైన్యము మృత్యులోకంలో ఉన్నాయి. వారి సమాధులు అడుగున ఆ రంధ్రంలో ఉన్నాయి. అష్షూరు సానికులంతా యుద్ధంలో హతులయ్యారు. అష్షూరు సైన్యం దాని సమాధి చుట్టూ మూగింది. బతికి ఉన్నప్పుడు వారు ప్రజలను భయపెట్టారు. కాని వారంతా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. వారంతా యుద్ధంలో చంపబడ్డారు.
24 “ఏలాము అక్కడ ఉన్నది. దాని సైన్యమంతా దాని సమాధి చుట్టూ ఉంది. వారంతా యుద్ధంలో చనిపోయారు. ఆ విదేశీయులు భూమిలోకి లోతుగాపోయారు. బతికి ఉన్నప్పుడు వారు ప్రజలను భయ పెట్టారు. వారి అవమానాన్ని వారు పాతాళానికి తమ తోనే తీసుకొని పోయారు. 25 ఏలాముకు, యుద్ధంలో చనిపోయిన సైనికులందరికీ వారు పడక ఏర్పాటు చేశారు. ఏలాము సైన్యమంతా దాని సమాధి చుట్టూ చేరింది. ఆ విదేశీయులందరూ యుద్ధంలో హతులయ్యారు. వారు జీవించి ఉన్నప్పుడు వారు ప్రజలను భయపెట్టారు. కాని వారి అవమానాన్ని వారు తమతో పాతాళానికి తీసుకొని పోయారు. చనిపోయిన వారందరితోపాటు వారు ఉంచబడ్డారు.
26 “మెషెకు, తుబాలు మరియు వాటి సైన్యాలు అక్కడ ఉన్నాయి. వాటి సమాధులు వాటిచుట్టూ ఉన్నాయి. విదేశీయులు యుద్ధంలో చంపబడ్డారు. వారు జీవించి ఉన్న సమయంలో వారు ప్రజలను భయపెట్టారు. 27 కాని ఏనాడో చనిపోయిన పరాక్రమశాలుల పక్కన వారిప్పుడు పడుకొని ఉన్నారు! వారు తమ యుద్ధాయుధాలతో సమాధి చేయబడ్డారు. వారి కత్తులు వారి తలల కింద ఉంచబడతాయి. కాని వారి పాపాలు మాత్రం వారి ఎముకల మీద ఉన్నాయి. ఎందువల్లనంటే వారు జీవించి వున్న కాలంలో వారు ప్రజలను భయపెట్టారు.
28 “ఈజిప్టూ, నీవు కూడా నాశనం చేయబడతావు. సున్నతి సంస్కారం లేని విదేశీయులు నిన్ను పడుకోబెడతారు. యుద్ధంలో చనిపోయిన ఇతర సైనికులతే పాటు నీవు కూడా ఉంటావు.
29 “ఎదోము కూడా అక్కడ ఉన్నాడ. అతని రాజులు, ఇతర నాయకులు అతనితో అక్కడ ఉన్నారు. వారు శూరులైన సైనికులు కూడా. అయినా వారు యుద్ధంలో చనిపోయిన విదేశీయులతో పడివున్నారు. వారంతా అక్కడ పరాయి వారితో పడివున్నారు. బాగా లోతైన రంధ్రంలో ప్రజలతో వారు అక్కడ ఉన్నారు.
30 “ఉత్తరదేశ రాజులంతా అక్కడ ఉన్నారు! సీదోనుకు చెందిన సైనికులంతా అక్కడ ఉన్నారు. వారి బలం ప్రజలను భయపెట్టింది. కాని వారు ఇబ్బంది పడ్డారు. ఆ విదేశీయులు కూడా యుద్ధంలో చనిపోయిన ఇతరులతో పండుకొని ఉన్నారు. వారితో పాటు తమ అవమానాన్ని కూడా పాతాళానికి తీసుకొని పోయారు.
31 “మృత్యు లోకంలోకి పోయిన ప్రజలను ఫరో చూస్తాడు. అతడు, అతనితో ఉన్న అతని మనుష్యులందరూ అప్పుడు ఊరట చెందుతారు. అవును, ఫరో మరియు అతని సర్వ సైన్యం యుద్ధంలో చెంపబడతారు.” ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
32 “ఫరో జీవించి ఉన్న కాలంలో అతనంటే ప్రజలు భయపడేలా నేను చేశాను. కాని ఇప్పుడతడు విదేశీయులతో పడి ఉంటాడు. ఫరో, అతని సైన్యం యుద్ధంలో చనిపోయిన ఇతర సైనికులతో పాటు పడివుంటారు.” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.