25
1 “ఇద్దరు మనుష్యులకు వివాదం ఉంటే వారు న్యాయస్థానానికి వెళ్లాలి. న్యాయమూర్తులు వారి వివాదాన్ని విచారించి, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయం ప్రకటిస్తారు. 2 నిందితుడు కొరడా దెబ్బలు తినాల్సివస్తే, న్యాయమూర్తి అతణ్ణి బోర్లా పండుకోబెట్టాలి. న్యాయమూర్తి చూస్తూ ఉండగా ఎవరో ఒకరు ఆ దోషిని కొట్టాలి. అతని నేరానికి తగినన్ని దెబ్బలు ఆ దోషిని కొట్టాలి. 3 ఒక మనిషిని ఒకే సారి 40 కంటె ఎక్కువ దెబ్బలు కొట్టకూడదు. అంతకంటె ఎక్కువగా అతడ్ని కొడితే, నీ సోదరుని జీవితం అంటే నీకు లెక్కలేదని తెలుస్తుంది.
4 “నూర్చే ఎద్దు తినకుండా దాని మూతికి చిక్కం వేయకూడదు.
5 “ఇద్దరు సోదరులు కలిసి జీవిస్తుండగా, వారిలో ఒకరు చనిపోవటం, అతనికి కుమారుడు లేకపోవటం జరిగితే, చనిపోయిన సోదరుని భార్య, ఆ కుటుంబానికి దూరస్తుల్ని ఎవరినీ పెళ్లి చేసుకోకూడదు. ఆమె భర్త సోదరుడు ఆమెను భార్యగా స్వీకరించి, ఆమెకు భార్యాధర్మం జరిగించాలి. ఒక భర్త సోదరుని విధులను ఆమె భర్త సోదరుడు ఆమెకు జరిగించాలి. 6 అప్పుడు ఆమెకు పుట్టిన బిడ్డ, ఆ పురుషుని మృత సోదరునికి వారసుడుగా ఉంటాడు. అప్పుడు చనిపోయిన సోదరుని పేరు ఇశ్రాయేలు నుండి రూపు మాసిపోదు. 7 ఒకవేళ ఆ మనుష్యుడు తన సోదరుని భార్యను స్వీకరించడానికి ఇష్టపడకపోతే, ఆమె పట్టణ సమావేశ స్థలం దగ్గర నాయకుల వద్దకు వెళ్లాలి. అతని సోదరుని భార్య, ‘నా భర్త సోదరుడు తన సోదరుని పేరు ఇశ్రాయేలులో సజీవంగా ఉంచేందుకు నిరాకరిస్తున్నాడు. భర్త సోదరుని విధులను అతడు నాకు జరిగించటం లేదు’ అని నాయకులతో చెప్పాలి. 8 అప్పుడు ఆ పట్టణపు నాయకులు అతణ్ణి పిలిపించి, అతనితో మాట్లాడాలి. అతడు మొండివాడై, ‘ఆమెను నేను స్వీకరించను’ అని చెబితే 9 అతని సోదరుని భార్య ఆ నాయకుల ముందుకు రావాలి. ఆమె అతని కాలి నుండి అతని చెప్పు ఊడదీయాలి. అప్పుడు ఆమె అతని ముఖం ముందు ఉమ్మివేయాలి. ‘తన సోదరుని కుటుంబాన్ని ఉద్ధరించని సోదరునికి యిలా చేస్తన్నాను’ అని ఆమె చెప్పాలి. 10 అప్పుడు ఆ సోదరుని కుటుంబం ‘చెప్పు తీయబడ్డ మనిషి కుటుంబంగా’ ఇశ్రాయేలులో చెప్పుకోబడుతుంది.
11 “ఇద్దరు మనుష్యులు ఒకరితో ఒకరు పోట్లాడుతూ వుండవచ్చును. వారిలో ఒకని భార్య తన భర్తకు సహాయం చేయటానికి రావచ్చును. కాని ఆమె అవతల వాని పురుషాంగములను లాగకూడదు. 12 ఆమె అలా చేస్తే ఆమె చేతిని నరికి వేయాలి. ఆమెను గూర్చి విచారించవద్దు.
13 “మనుష్యుల్ని మోసం చేయటానికి తూనికెలో దొంగ రాళ్లు ఉంచవద్దు. మరీ బరువుగా గాని, మరీ తేలికగా గాని ఉండే రాళ్లు ఉపయోగించవద్దు. 14 మరీ పెద్దని లేక చిన్నవిగా ఉండే కొలతలు నీ ఇంటిలో ఉంచవద్దు. 15 సరిగ్గాను, నిజాయితీగాను ఉండే రాళ్లు, కొలతలు నీవు ఉపయోగించాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో నీవు చాలా కాలం జీవిస్తావు. 16 తప్పుడు తూకాలు, కొలతలు ఉపయోగించే వాళ్లను మీ దేవుడైన యెహోవా అసహ్యించుకొంటాడు. అవును, తప్పు చేసే వాళ్లందర్నీ ఆయన అసహ్యించుకొంటాడు.
అమాలేకీయులు నాశనం చేయబడాలి
17 “మీరు ఈజిప్టు నుండి వస్తున్నప్పుడు అమాలేకీయులు మీకు ఏమి చేసారో జ్ఞాపకం చేసుకోండి. 18 అమాలేకీయులు దేవుణ్ణి గౌరవించలేదు. మీరు అలసి బలహీనంగా ఉన్నప్పుడు వాళ్లు మీమీద దాడి చేసారు. వెనుక నడుస్తోన్న మీ ప్రజలందర్నీ వాళ్లు చంపేసారు. 19 అందుకే అమాలేకీయుల జ్ఞాపకం కూడ ప్రపంచంలో లేకుండా మీరు నాశనం చేయాలి. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశించినప్పుడు దీనిని చేయాలి. అక్కడ మీ చుట్టూరా ఉన్న శత్రువులందరి నుండి ఆయన మీకు విశ్రాంతిని ఇస్తాడు. అయితే అమాలేకీయులను నాశనం చేయటం మాత్రం మరచిపోవద్దు.