20
షెబ ఇశ్రాయేలయులను దావీదుకు వ్యతిరేకంగా చేయటం
బిక్రి కుమారుడైన షెబ అనే పనికిమాలిన వాడొకడు అక్కడ వుండటం జరిగింది. షెబ అనేవాడు బెన్యామీను వంశానికి చెందినవాడు. అతడు బూర వూది,
 
“దావీదులో మనకు భాగం లేదు.
యెష్షయి కుమారునితో మనకేమీ సంబంధం లేదు!
కావున ఇశ్రాయేలీయులారా, మనమంతా మన గుడారాలకు పోదాం పదండి”
అని చెప్పాడు.
 
దానితో ఇశ్రాయేలీయులు దావీదును వదిలి, బిక్రి కుమారుడైన షెబను అనుసరించారు. కాని యూదా ప్రజలు మాత్రం యొర్దాను నది వద్ద నుండి యెరూషలేముకు వచ్చేవరకు దారి పొడవునా వారి రాజైన దావీదుతోనే వున్నారు.
దావీదు యెరూషలేములోని తన ఇంటికి వచ్చాడు. గతంలో దావీదు తన ఉపపత్నులను* ఉపపత్నులు దావీదు కుమారుడు అబ్షాలోము దావీదు ఉంపుడుగత్తెలతో సంపర్కం చేశాడు. చూడండి సమూయేలు రెండవ గ్రంథం 16:21-22. పది మందిని ఇల్లు చక్కదిద్దేందుకై వదిలి వెళ్లాడు. ఇప్పుడు దావీదు ఈ స్త్రీలను ఒక ప్రత్యేకమైన ఇంటిలో వుంచాడు. ఆ ఇంటికి సైనిక కాపలా ఏర్పాటు చేశాడు. ఆ స్త్రీలు తమ జీవితాంతం ఆ ఇంటిలోనే వుండిపోయారు. దావీదు వారికి ఆహారాదులిచ్చాడు గాని, వారితో సాంగత్యం చేయలేదు. వారి మరణ పర్యంతం ఆ స్త్రీలు విధవరాండ్రవలె జీవించారు.
రాజు అమాశాను పిలిచి, “యూదా ప్రజలను మూడు రోజులలో నన్ను కలవమని చెప్పు. నీవు కూడా ఇక్కడ వుండాలి” అని అన్నాడు.
యూదా ప్రజలందరినీ పిలిచి కూడగట్టుకు రావటానికి అమాశా వెళ్లాడు. కాని రాజు పెట్టిన గడువుకంటె అమాశా ఎక్కువ కాలాన్ని తీసుకున్నాడు.
అబీషైతో షెబను చంపమని దావీదు చెప్పటం
దావీదు అబీషైని పిలిచి, “బిక్రి కుమారుడైన షెబ మనకు అబ్షాలోముకంటె ఎక్కువ ప్రమాద కరమైన మనిషి. కావున నా సైనికులను తీసుకొని షెబను వెంటాడు. షెబ ప్రాకారాలున్న నగరాలలోనికి తప్పించుకునే ముందుగానే నీవు త్వరపడాలి. షెబ గనుక ప్రాకారాలున్న నగరాలలోకి వెళ్లినాడంటే ఇక వాడు మననుండి తప్పించుకున్నట్లే,” అని అన్నాడు.
కనుక యోవాబు మనుష్యులు, కెరేతీయులు, పెలేతీయులు, తదితర సైనికులు యెరూషలేము నుండి బయలుదేరి వెళ్లారు. బిక్రి కుమారుడైన షెబను వారు వెంటాడారు.
యోవాబు అమాశాను చంపటం
గిబియోను గుట్ట వద్దకు యోవాబు తన సైనికులతో వచ్చినప్పుడు అమాశా వారిని కలవటానికి ఎదురేగాడు. యోవాబు తన సైనిక దుస్తుల్లో వున్నాడు నడికట్టు కట్టుకున్నాడు. అతని ఒరలో కత్తి వున్నది. అమాశాను కలవటానికి యోవాబు ముందుకు వెళ్లాడు. ఆ సమయంలో తన ఒరలోని కత్తి జారి క్రిందపడింది. యోవాబు ఆ కత్తిని తీసి చేతితో పట్టుకున్నాడు. “సోదరా, నీవు క్షేమమేనా?” అని యోవాబు అమాశాను అడిగినాడు. యోవాబు తన కుడిచేతితో అమాశాను ముద్దు పెట్టుకునేందుకా అన్నట్టు గడ్డం పట్టుకున్నాడు. 10 యోవాబు చేతిలో వున్న కత్తిని అమాశా గమనించలేదు. యోవాబు తన కత్తితో అమాశా పొట్టలో పొడిచాడు. అమాశా పేగులన్నీ బైటకు వచ్చాయి. యోవాబు మళ్లీ పొడిచే అవసరం లేకుండా పోయింది — అమాశా అప్పుడే చనిపోయాడు.
దావీదు మనుష్యులు అదే పనిగా షెబను వెదకుట
యోవాబు, అతని సోదరుడు అబీషై కలిసి బిక్రి కుమారుడు షెబను తరమటం కొనసాగించారు. 11 యోవాబు సైనికులలో యువకుడైన వాడొకడు అమాశా శవం వద్ద నిలబడ్డాడు. ఆ యువకుడు మిగిలిన వారి నుద్దేశించి, “మీలో యోవాబును, దావీదును బలపర్చే ప్రతి ఒక్కడూ యోవాబును అనుసరించి వెళ్లాలి. షెబను వెంటాడటంలో అతనికి సహాయం చేయండి!” అని అన్నాడు.
12 మార్గ మధ్యంలో అమాశ శవం రక్తపు మడుగులో పడివుంది. జనమంతా శవాన్ని చూసే నిమిత్తం అక్కడ ఆగుతూ ఉన్నారు కావున ఆ యువకుడు అమాశా శవాన్ని ప్రక్కనే వున్న పొలంలోనికి లాగి, దాని మీద ఒక బట్ట కప్పాడు. 13 అమాశా శవం బాట మీద నుంచి తీసివేయబడిన పిమ్మట జనమంతా యోవాబును అనుసరించారు. బిక్రి కుమారుడు షెబను తరిమేందుకు వారు యోవాబుతో కలిసి వెళ్లారు.
ఆబేలు బేత్మయకాకు షెబ తప్పించుకు పోవటం
14 బిక్రి కుమారుడు షెబ ఇశ్రాయేలు వంశపు వారు నివసించే ప్రాంతాల గుండా పోయి ఆబేలు బేత్మయకా నగరాన్ని చేరాడు. బెరీయులందరూ కూడి షెబను అనుసరించారు.
15 యోవాబు, అతని మనుష్యులు ఆబేలు బేత్మయకా వద్దకు వచ్చారు. యోవాబు సైన్యం నగరాన్ని ముట్టడించింది. నగరం చుట్టూవున్న గోడకు వారు ఒక చోట కందకం పూడ్చి బాగా మట్టి పోశారు. అలా మట్టి పోయటంతో వారు గోడ దగ్గరకు వెళ్ల గలిగారు. ఆ గోడను పడగొట్టే ఉద్దేశంతో వారప్పుడు దానిని పగులగొట్టటం మొదలుపెట్టారు.
16 ఇంతలో ఒక వివేకం గల స్త్రీ నగరంలో నుండి కేకలు పెట్టింది. “నే చెప్పేది వినండి. యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పండి. అతనితో నేను మాట్లాడదలిచాను!” అని అరిచింది.
17 ఆ స్త్రీ తో మాట్లాడటానికి యోవాబు దగ్గరగా వచ్చాడు. “యోవాబువు నీవేనా?” అని ఆమె అడిగింది.
“అవును. నేనే” అని యోవాబు సమాధానం చెప్పాడు.
“అయితే నేను చెప్పేది విను!” అని ఆస్త్రీ యోవాబుతో అన్నది.
“వింటున్నాను” అని యోవాబు అన్నాడు.
18 ఆ స్త్రీ ఇలా అన్నది, “పూర్వం ప్రజలు ‘సలహా కొరకు ఆబేలులో అడగమని అనే వారు. అప్పుడు వారి సమస్య తీరిపోయేది.’ 19 శాంతిని కోరే వారిలో, ఇశ్రాయేలు పట్ల విశ్వాసముగల వారిలో నేనొక దానిని. ఇశ్రాయేలులో ఒక ముఖ్యనగరాన్ని నీవు నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నావు. యెహోవాకి చెందిన దానిని నీవెందుకు నాశనం చేయ సంకల్పించావు?”
20 “లేదు! లేదు! నేను దేనినీ నాశనం చేయదల్చలేదు లేదు … చేయదల్చలేదు “అదికాదు, అదికాదు! నేను కబళించాలనిగాని, నాశనం చేయాలనిగాని అనుకోవటం లేదు” అని పాఠాంతరం. మీ పట్టణాన్ని నిర్మూలించను. 21 కాని ఎఫ్రాయిము కొండ ప్రాంతము వాడొకడున్నాడు. వాని పేరు షెబ. అతడు బిక్రి యొక్క కుమారుడు. వాడు దావీదు రాజుపై తిరుగుబాటు చేశాడు. నీవు గనుక వానిని నా కప్పగించితే, నేను నగరాన్ని వదిలి పెడతాను,” అని యోవాబు అన్నాడు.
“అయితే సరే! అతని తల గోడ మీది నుంచి మీకు విసరివేయబడుతుంది” అని ఆస్త్రీ యోవాబుతో అన్నది.
22 తరువాత ఆ స్త్రీ నగర ప్రజలందరితో చాలా యుక్తిగా మాట్లాడింది. అది విని ఆ నగరవాసులు బిక్రి కుమారుడు షెబ తల నరికి దానిని గోడ మీదుగా యోవాబుకు విసరివేశారు.
అప్పుడు యోవాబు బూర వూదగా సైన్యం నగరం వదిలి వెళ్లిపోయింది. ప్రతివాడూ తన గుడారానికి వెళ్లిపోయాడు. యెరూషలేములో వున్న రాజు వద్దకు యోవాబు వెళ్లాడు.
దావీదు కొలువులో ముఖ్యమైన ఉద్యోగులు
23 ఇశ్రాయేలు రాజ్యంలో యోవాబు సర్వ సైన్యాధ్యక్షుడయ్యాడు. కాని కెరేతీయులకును, పెలేతీయులకును యెహోయాదా కుమారుడైన బెనాయా అధిపతి. 24 వెట్టి చాకిరీ వంటి శరీర కష్టం చేసేదండుకు అదోరాము నాయకత్వం వహించాడు. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు చరిత్రకారుడుగా నియమితుడయ్యాడు. 25 షెవా ప్రధాన కార్యదర్శిగాను; సాదోకు, అబ్యాతారు యాజకులుగాను; 26 మరియు యాయీరీయుడగు ఈరా రాజుకు ప్రధానా చార్యుడుగను వున్నారు.

*20:3: ఉపపత్నులు దావీదు కుమారుడు అబ్షాలోము దావీదు ఉంపుడుగత్తెలతో సంపర్కం చేశాడు. చూడండి సమూయేలు రెండవ గ్రంథం 16:21-22.

20:20: లేదు … చేయదల్చలేదు “అదికాదు, అదికాదు! నేను కబళించాలనిగాని, నాశనం చేయాలనిగాని అనుకోవటం లేదు” అని పాఠాంతరం.