23
దావీదు కెయీలాకు వెళ్లటం
అక్కడి ప్రజలు దావీదుతో, “ఫిలిష్తీయులు కెయీలా రాజ్యంపై యుద్ధం చేస్తున్నారనీ, నూర్చెడి కళ్లాలనుండి ధాన్యాన్ని కొల్ల గొడుతున్నార” నీ చెప్పారు.
“నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులతో యుద్ధం చేయనా?” అని దావీదు యెహోవాని అడిగాడు.
“వెళ్లుము ఫిలిష్తీయులను ఎదుర్కొని కెయీలాను కాపాడు.” అని యెహోవా దావీదుకు సమాధాన మిచ్చాడు.
కాని దావీదు మనుష్యులు, “మనము యూదాలోనే ఉండి భయపడి పోతున్నాము. ఇక ఫిలిష్తీయుల సైన్యంవున్న చోటికి వెళితే మా భయానికి అంతువుండదు” అన్నారు.
దావీదు మళ్లీ యెహోవాను అడిగాడు. యెహోవా, “కెయీలాకు వెళ్లుము ఫిలిష్తీయులను జయించటానికి నేను నీకు సహాయం చేస్తాను” అని దావీదుకు జవాబిచ్చాడు. అప్పుడు దావీదు తన మనుష్యులతో కెయీలాకు వెళ్లాడు. దావీదు మనుష్యులు ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి వారి పశువులను పట్టుకున్నారు. దావీదు ఫిలిష్తీయులను చిత్తుగా ఓడించి వారి బారినుండి కెయీలా ప్రజలను రక్షించాడు. (అహీమెలెకు కుమారుడు అబ్యాతారు దావీదు వద్దకు పారిపోయినప్పుడు తనతో ఏఫోదు అనబడే యాజకుల అంగీనొక దానిని తీసుకుని వెళ్లాడు).
దావీదు కెయీలాలో ఉన్నట్లు ప్రజలు సౌలుకు చెప్పారు. అది విని, “దేవుడు దావీదును నాకిచ్చినట్టే! దావీదు తనకు తాను బోనులో పడ్డాడు. ఎందువల్ల నంటే అతను చుట్టూ ద్వారాలు కటకటాలు ఉన్న పట్టణంలో ప్రవేశించాడు” అన్నాడు సౌలు. సౌలు తన సైన్యాన్ని సమీకరించుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు. దావీదును, అతని అనుచరులను ఎదిరించటానికి సౌలు సైన్యం కెయీలాకు వెళ్లేందుకు తయారయింది.
తన మీద సౌలు పన్నాగం పన్నుతున్నాడని దావీదు తెలుసుకున్నాడు. “ఏఫోదు తీసుకురా” అని దావీదు అబ్యాతారుకు చెప్పాడు.
10 దావీదు ఇలా ప్రార్థన చేశాడు: “ఇశ్రాయేలీయుల యెహోవా దేవా! నా మూలంగా సౌలు కెయీలా పట్టణానికి వచ్చి దానిని నాశనం చేయ సంకల్పించాడని విన్నాను. 11 సౌలు కెయీలాకు వస్తాడా? కెయీలా ప్రజలు నన్ను సౌలుకు అప్పగిస్తారా? ఇశ్రాయేలీయుల యెహోవా దేవా, నేను నీ సేవకుడను! దయచేసి నాకు చెప్పు.”
“అవును!” అని యెహోవా జవాబిచ్చాడు.
12 దావీదు, “కెయీలా ప్రజలు నన్ను, నా మనుష్యులను సౌలుకు అప్పగిస్తారా?” అని మళ్లీ అడిగాడు.
“అవును!” అని యెహోవా జవాబిచ్చాడు.
13 అది విన్న దావీదు తన మనుష్యులతో కెయీలా వదిలి వెళ్లిపోయాడు. దావీదుతో ఆరువందల మంది వెళ్లారు. ఒక చోటనుండి మరొక చోటికి వారు తరలిపోయారు. దావీదు కెయీలానుండి తప్పించుకున్నాడని విన్న సౌలు కెయీలా నగరానికి వెళ్లలేదు.
సౌలు దావీదును వెంటాడుట
14 దావీదు అరణ్యములో ఉన్న దుర్గాలలోను, జీఫు అరణ్యంలోని కొండలలోను తలదాచుకున్నాడు. ప్రతి రోజూ సౌలు దావీదు కోసం వెదుకుతూ ఉండేవాడు. కానీ యెహోవా దావీదును సౌలు పట్టుకొనేలా చేయలేదు.
15 జీఫు అరణ్యంలో హోరేషు వద్ద ఉన్నాడు దావీదు. సౌలు తనను చంపటానికి వస్తున్నాడని భయపడ్డాడు. 16 కానీ సౌలు కుమారుడు యోనాతాను హోరేషులో ఉన్న దావీదును చూడటానికి వెళ్లాడు. యోనాతాను దావీదుకు యెహోవా మీద దృఢవిశ్వాసం కలిగేందుకు సహాయం చేసాడు. 17 యోనాతాను, “భయపడకు, నా తండ్రి సౌలు నిన్ను తాకలేడు. నీవు ఇశ్రాయేలుకు రాజువవుతావు. నేను నీ తరువాత స్థానంలో ఉంటాను. ఇది నా తండ్రికి కూడా తెలుసు” అన్నాడు దావీదుతో.
18 యోనాతాను, దావీదు ఇద్దరూ యెహోవా ఎదుట ఒక ఒడంబడిక చేసుకున్నారు. తరువాత యోనాతాను ఇంటికి వెళ్లిపోయాడు. దావీదు హోరేషులో ఉండిపోయాడు.
జీఫు ప్రజలు దావీదు గురించి సౌలుకు చెప్పుట
19 గిబియాలో ఉన్న సౌలు వద్దకు జీఫు ప్రజలువచ్చి, “తమ రాజ్యంలో దావీదు దాగియున్నట్లు చెప్పారు. యెషిమోనుకు దక్షిణంగా ఉన్న హకీలా కొండ మీద వున్న హోరోషు కోటలో దావీదు ఉన్నట్లు చెప్పారు. 20 ఓ రాజా! ఇప్పుడు మీరు ఏ సమయంలో వచ్చినా దావీదును మీకు పట్టి ఇచ్చే బాధ్యత మాది” అని అన్నారు.
21 అందుకు సౌలు, “నాకు సహాయం చేస్తున్నందుకు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక! 22 వెళ్లండి. అతని గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకొనండి. దావీదు ఎక్కడ ఉంటున్నాడో కనుగొనండి. అతనిని అక్కడ ఎవరు చూశారో కూడా తెలుసుకోండి. సౌలు కంటె దావీదు తెలివైనవాడు, కనుక తనను మోసగిస్తాడు అని అనుకున్నాడు. 23 దావీదు దాక్కొనే స్థలాలన్నీ కూడ తెలుసుకోండి. మళ్లీ నా వద్దకు వచ్చి నాకు పూర్తి సమాచారం తెలియజేయండి. అప్పుడు నేను మీతో వస్తాను. దావీదు ఆ ప్రాంతంలోనే ఉంటే నేను వానిని కనుగొంటాను. అవసరమైతే యూదాలో ప్రతి ఇంటిని శోధించైనా సరే వానిని కనుక్కుంటాను” అన్నాడు.
24 అప్పుడు జీఫువాళ్లు జీఫుకు తిరిగి వెళ్లిపోయారు. సౌలు తరువాత అక్కడికి వెళ్లాడు.
దావీదు, అతని అనుచరులు మాయోను అరణ్యంలో ఉన్నారు. అది యెషీమోనుకు దక్షిణంగా ఉన్న ఎడారి ప్రాంతం. 25 సౌలు, అతని సైనికులు దావీదును వెతుక్కుంటూ వెళ్లారు. కాని సౌలు అతనికొరకు వస్తున్నాడని ప్రజలు దావీదును హెచ్చరించారు. దావీదు మాయోను అరణ్యంలోని “కొండ” కు వెళ్లాడు. ఇది సౌలు తెలుసుకున్నాడు. సౌలు దావీదును వెతుక్కుంటూ మాయోను అరణ్యానికి వెళ్లాడు.
26 పర్వతానికి ఒక పక్కన సౌలు ఉన్నాడు. దావీదు, అతని మనుష్యులు అదే పర్వతానికి మరో వైపున ఉన్నారు. సౌలునుండి దూరంగా పోవటానికి దావీదు తొందర పడుతూ ఉన్నాడు. కానీ దావీదును సపరి వారంగా పట్టుకోవాలని సౌలు, అతని సైనికుల ఆ పర్వతం చుట్టూ తిరుగుట ప్రారంభించారు.
27 ఒక సందేశకుడు సౌలు వద్దకు వచ్చి, “ఫిలిష్తీయులు తమ రాజ్యం మీదికి దండెత్తి వస్తున్నారనీ” త్వరగా రమ్మనీ చెప్పాడు.
28 అంతటితో సౌలు దావీదును వెంటాడటం మాని ఫిలిష్తీయులను ఎదుర్కోటానికి వెళ్లాడు. అందువల్ల ప్రజలు ఈ ప్రదేశానికి, “జారుడు బండ”* జారుడు బండ లేక “సెలహమ్మలెకోతు.” అని పేరు పెట్టారు. 29 దావీదు మోయోను ఎడారి వదలి ఏన్గెదీ దగ్గర ఉన్న కొండస్థలాలకు వెళ్లాడు.

*23:28: జారుడు బండ లేక “సెలహమ్మలెకోతు.”