21
యాజకుడైన అహీమెలెకును చూచుటకు దావీదు వెళ్ళుట
తరువాత దావీదు వెళ్లిపోయాడు. యోనాతాను తిరిగి పట్టణానికి వెళ్లాడు.
అహీమెలెకు అనే యాజకుని చూడటానికి దావీదు నోబు పట్టణానికి వెళ్లాడు. దావీదును చూడగానే అహీమెలెకు భయంతో వణకిపోయాడు. “నీవు ఒంటరిగా ఎందుకున్నావు? నీకు తోడుగా ఎవ్వరూ ఎందుకు లేరు?” అని అహీమెలెకు దావీదును అడిగాడు.
దావీదు అహీమెలెకుతో, “రాజు నాకు ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చాడు. తాను ఏ పనిమీద నన్ను పంపిస్తున్నాడో అది వేరెవ్వరికీ తెలియ కూడదన్నాడు. నన్ను ఏమి చేయమని ఆయన చెప్పాడో అది ఎవ్వరికీ తెలియకూడదని ఆయన ఆజ్ఞ. నన్ను ఎక్కడ కలవాలో నా మనుష్యులకు నేను చెప్పాను. ఇప్పుడు నీవద్ద ఏమైన ఆహారం ఉన్నదా? నాకు ఐదు రొట్టెలు లేదా ఏది ఉంటే అది ఇవ్వు” అని చెప్పాడు.
“తనవద్ద మాములు రొట్టెలేవీ లేవనీ, కేవలం ప్రతి ష్ఠితంగా దేవుని సన్నిధిలో ఉంచిన రొట్టెలు* ప్రతి ష్ఠితంగా … ఉంచిన రొట్టె పవిత్ర గుడారంలో దేవుని సన్నిధిలో ఆహారాన్ని ప్రతిష్ఠితంగా ఉంచుతారు. మామూలుగా దానిని శుచియైన యాజకుడు తినటం ఆనవాయితీ. కొంత వున్నాయనీ, తన పరివారమంతా స్త్రీలకు దూరంగా వున్న వారైతే వారు ఈ రొట్టె తినవచ్చనీ” యాజకుడు దావీదుతో అన్నాడు.
అది విన్న దావీదు, “మేము ఏ స్త్రీలతోను ఉండలేదు. మేము యుద్ధానికి వెళ్లినప్పుడల్లా, అలాగే మాములు పనులు చేసేటప్పుడు కూడ నా మనుష్యులు తమ శరీరాలను పవిత్రంగా ఉంచు కుంటారు. ఇప్పుడు మేము బయలుదేరిన మా పని ఎంతో పవిత్రమైనది కనుక ఈ వేళ ఇది మరింత సత్యం” అన్నాడు.
పవిత్ర రొట్టె తప్ప మరొకటి లేక పోవటంతో యాజకుడు దావీదుకు దానినే ఇచ్చాడు. యాజకులు యెహోవా ఎదుట పీఠంపై ఆరగింపుగా ఉంచే రొట్టె ఇది. ప్రతి రోజూ వారు ఈ రొట్టెను తీసివేసి మళ్లీ కొత్త రొట్టెను దాని స్థానంలో ఉంచుతారు.
సౌలు అధికారులలో ఒకడు ఆ రోజున ఇక్కడ ఉన్నాడు. వాని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. వాడు అక్కడ యెహోవా ఎదుట ఉంచబడ్డాడు. దోయేగు సౌలు యొక్క గొర్రెల కాపరులకు నాయకుడు.
యాజకుడైన అహీమెలెకును, “ఒక ఈటెగాని, కత్తిగాని అక్కడ ఉన్నదా అని దావీడు అడిగాడు. రాజుపని అతి ముఖ్యమైనదని, తను త్వరగా వెళ్లవలసి ఉందనీ, తాను కత్తిగాని మరి ఏ ఇతర ఆయుధంగాని తేలేదనీ చెప్పాడు.”
ఫిలిష్తీయుడైన గొల్యాతు ఆయుద్ధం ఒక్కటే ఇక్కడ ఉందని యాజకుడు చెప్పాడు. “ఏలా లోయలో నీవు వానిని చంపినప్పుడు వాని దగ్గర నీవు తీసుకున్న ఖడ్గం అది. ఆ ఖడ్గం ఒక బట్టలో చుట్టబడి ఏఫోదు అంగీ వెనుక ఉంచబడింది కావాలంటే అది నీవు తీసుకోవచ్చు”
అని అహీమెలెకు అన్నాడు. “గొల్యాతు కత్తికి మించిన కత్తిలేదు. దానిని నాకు ఇవ్వుము” అన్నాడు దావీదు.
దావీదు గాతుకు పారి పోవుట
10 ఆ రోజు సౌలు నుంచి దావీదు అలా పారిపోయాడు. గాతు రాజైన ఆకీషు వద్దకు దావీదు వెళ్లాడు. 11 కానీ ఆకీషు అధికారులకు అది నచ్చలేదు. వారు ఆయనతో ఇలా అన్నారు: “ఇతని పేరు దావీదు. ఇశ్రాయేలు రాజ్యానికి రాజు. ఇశ్రాయేలీయులు పాటలు పాడేది ఇతనిని గూర్చే. అతనికోసం వారు పాటలు పాడి నాట్యం చేస్తారు. ఇశ్రాయేలీయులు ఇదిగో ఈ పాట పాడతారు:
 
“సౌలు వేల కొలదిగా హతము చేసాడు!
దావీదు పది వేల కొలదిగా హతము చేసాడు!”
 
12 ఈ మాటలను దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు గాతు రాజైన ఆకీషును గూర్చి దావీదు చాలా భయపడ్డాడు. 13 అందువల్ల ఆకీషు ముందు, అతని సిబ్బంది ముందు దావీదు పిచ్చి పట్టిన వానిలా నటించుట మొదలు పెట్టాడు. అక్కడున్నంత సేపూ దావీదు పిచ్చివానిలా ప్రవర్తించాడు. మార్గపు తలుపుల మీద అతడు ఉమ్మి వేశాడు. తన ఉమ్ము తన గడ్డం మీద పడేటట్టు ఉమ్మేసాడు.
14 ఆకీషు, “వీని వైపుపు చూడండి! వీడు పిచ్చివాడు! వీడిని నా వద్దకు ఎందుకు తిసుకుని వచ్చారు? 15 ఇప్పటికే నా వద్ద పిచ్చి వాళ్లు చాలామంది ఉన్నారు. నా ముందు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించటానికి వీనిని మీరు నా ఇంటికి తీసుకుని రానక్కర్లేదు! ఈ మనిషిని మళ్లీ నా ఇంటికి రానివ్వకండి” అని తన అధికారులతో చెప్పాడు.

*21:4: ప్రతి ష్ఠితంగా … ఉంచిన రొట్టె పవిత్ర గుడారంలో దేవుని సన్నిధిలో ఆహారాన్ని ప్రతిష్ఠితంగా ఉంచుతారు. మామూలుగా దానిని శుచియైన యాజకుడు తినటం ఆనవాయితీ.