8
నిబంధన మందసం దేవాలయానికి తేబడుట
రాజైన సొలొమోను తరువాత ఇశ్రాయేలు పెద్దలం దరి నీ, ఆయా వంశాల ప్రధాన పురుషులను, ఇశ్రాయేలులో కుటుంబ పెద్దలను ఒక చోటికి పిలిపించాడు. వారందరినీ యెరూషలేములో తన వద్దకు రమ్మని చెప్పాడు. సీయోను అనబడే దావీదుపురంనుండి దేవుని ఒడంబడిక పెట్టెను దేవాలయానికి తరలించే కార్యక్రమంలో పాల్గొనమని సొలొమోను వారిని కోరాడు. కావున ఇశ్రాయేలీయులందరూ రాజైన సొలొమోను వద్దకు వచ్చారు. ఏతనీము అనబడే మాసంలో పండుగ సందర్భంగా ప్రత్యేక సెలవు రోజున (పర్ణశాలల పండుగ) సమావేశం జరిగింది. అది సంవత్సరంలో ఏడవనెల.
ఇశ్రాయేలు పెద్దలందరూ ఆ స్థలానికి వచ్చారు. అప్పుడు యాజకులు పవిత్ర ఒడంబడిక పెట్టె తీసుకున్నారు. యెహోవా ఒడంబడిక పెట్టె సన్నిధి గుడారము, దానిలోని పవిత్ర వస్తువులతో పాటు వారు మోసుకొని వెళ్లారు. లేవీయులు కొందరు ఈ వస్తువులను మోయుటలో సహాయం చేశారు. రాజైన సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలందరూ ఒడంబడిక పెట్టె ముందు సమావేశమయ్యారు. వారప్పుడు ఎవ్వరూ లెక్కపెట్టలేనన్ని గొర్రెలను, పశువులను బలియిచ్చారు. అప్పుడు యాజకులు యెహోవా ఒడంబడిక పెట్టె దాని అసలైన స్థానంలో ఉంచారు. అది అతి పరిశుద్ధ స్థలము. ఒడంబడిక పెట్టె కెరూబుల రెక్కల కిందుగా ఉంచబడింది. ఒడంబడిక పెట్టె ఉంచబడిన స్థానం మీదుగా కెరూబుల రెక్కలు వ్యాపించి వున్నాయి. ఆ రెక్కలు ఒడంబడిక పెట్టె, దానిని మోయుటకు ఉపయోగించే కోలలను కప్పివేశాయి. ఒడంబడిక పెట్టె మోసే కోలలు (కర్రలు) చాలా పొడవైనవి. అతి పరిశుద్ధ స్థలం ముందు పవిత్ర స్థలంలో ఎవరు నిలబడి చూసినా ఆ కోలలను చివరి వరకు చూడగలరు. కాని వాటినెవరూ బయటి నుండి చూడలేరు. ఈ నాటికీ ఆ కోలలు అదే స్థానంలో వున్నాయి. ఆ ఒడంబడిక పెట్టెలో వున్నవి కేవలం రెండు రాతి ఫలకాలు. ఈ రెండు ఫలకాలను హోరేబు అనే చోట మోషే ఈ ఒడంబడిక పెట్టెలో భద్రపరచాడు. ఇశ్రాయేలీయులు ఈజిప్టునుండి బయటికి వచ్చిన తరువాత హోరేబు అనే చోటనే యెహోవా వారితో తన ఒడంబడిక చేశాడు.
10 యాజకులు అతి పరిశుద్ధ స్థలాన్ని వదిలి బయటికి వచ్చిన పిమ్మట, ఒక మేఘం యెహోవా దేవాలయాన్ని కమ్మివేసింది. 11 యెహోవా మహిమతో దేవాలయం నిండిపోగా యాజకులు తమ విధులను నిర్వర్తించలేక పోయారు. 12 అప్పుడు సొలొమోను ఇలా అన్నాడు:
 
“ఆకాశంలో ప్రకాశించటానికి యెహోవా సూర్యుడ్ని కలుగజేశాడు,
కాని ఆయన మాత్రం ఒక నల్లని మేఘంలో నివసిస్తానన్నాడు.
13 నిజానికి నేకొక అద్భుతమైన దేవాలయాన్ని నీ కొరకు నిర్మించాను,
అది నీవు శాశ్వతంగా నివసించే స్థలం.”
 
14 ఇశ్రాయేలీయులందరూ అక్కడ నిలబడియున్నారు. రాజైన సొలొమోను వారి వైపు తిరిగి వారిని దీవించుమని దేవునిని అడిగాడు. 15 తరువాత రాజైన సొలొమోను దేవునికి సుధ్ఘీరమైన ప్రార్థన చేశాడు. ఆయనిలా అన్నాడు:
 
“ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఉన్నతుడు. నా తండ్రి దావీదుకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన అన్నీ నెరవేర్చాడు. 16 యెహోవా నా తండ్రితో, ‘నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టునుండి విముక్తులను చేసి తీసుకొని వచ్చాను. కాని నా గౌరవార్థం నాకో దేవాలయం కట్టించటానికి ఇశ్రాయేలు వంశాలు నివసించే ఏ పట్టణాన్నీ నేనింకా ఎన్నుకో లేదు. నా ప్రజలైన ఇశ్రాయేలును ఏలటానికి నేనొక యువరాజును ఎంపిక చేయలేదు. కాని నేను గౌరవింపబడే చోటుగా ఇప్పుడు యెరూషలేమును ఎన్నుకున్నాను. మరియు నా ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించటానికి దావీదును ఎంపిక చేశాను’ అని చెప్పాడు.
17 “ఇశ్రాయేలు దేవుడై యెహోవాకు ఘనంగా ఒక దేవాలయం కట్టించాలని నా తండ్రి దావీదు మిక్కిలిగా కోరుకున్నాడు. 18 కాని యెహోవా నా తండ్రి దావీదుతో ‘నాకు తెలుసు, నీవు నాకు దేవాలయం కట్టించి గౌరవించాలని మిక్కిలి ఆసక్తితో ఉన్నావు. నాకు దేవాలయ నిర్మాణం చేయాలను కోవటం సంతోషించ తగ్గ విషయం. 19 కాని నాకు దేవాలయం కట్టించేది నీవు కాదు. నేను ఆ పనికి నిన్ను ఎంపిక చేయలేదు. నీ రక్తం పంచుకు పుట్టిన నీ కుమారుడు నాకు దేవాలయ నిర్మాణం చేయిస్తాడు,’ అని అన్నాడు.
20 “కావున యెహోవా ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. నా తండ్రి దావీదు స్థానంలో ఇప్పుడు నేను రాజును. యెహోవా కనికరించిన విధంగా ఇప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలను పాలిస్తున్నాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నేను దేవాలయం కట్టించాను. 21 దేవాలయంలో దేవుని ఒడంబడిక పెట్టెకు ప్రత్యేక స్థానం ఏర్పాటు చేశాను. మన పూర్వీకులతో యెహోవా చేసిన ఒక ఒడంబడిక ఆ మందసంలో వుంది. యెహోవా మన పూర్వీకులను ఈజిప్టునుండి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఆ ఒడంబడిక చేశాడు.”
 
22 పిమ్మట సొలొమోను యెహోవా బలిపీఠం ముందు నిలబడ్డాడు. ప్రజలంతా అతనికి ఎదురుగా నిలబడ్డారు. రాజైన సొలొమోను చేతులు చాపి, ఆకాశంవైపు చూశాడు. 23 అతనిలా అన్నాడు:
 
“ఓ ప్రభూ, ఇశ్రాయేలీయుల దేవా! నీవంటి యెహోవా ఆకాశంలో గాని, భూమి మీద గాని మరొక్కడు లేడు. నీ ప్రజలను నీవు మిక్కిలిగా ప్రేమిస్తున్నావు. కావున నీవు వారితో ఒక ఒడంబడిక చేసుకున్నావు. నిన్ననుసరించే ప్రజల పట్ల నీ ఒడంబడిక తప్పక అమలు పర్చుతావు. 24 నీ సేవకుడు, నా తండ్రి అయిన దావీదుకు నీవు ఆ వాగ్దానం చేశావు. నీవు ఆ వాగ్దానం నెరవేర్చావు. నీ నోటితో నీవే ఆ వాగ్దానం చేశావు. నీ అమోఘమైన శక్తి సంపదతో ఆ వాగ్దానం ఈ రోజు నిజమయ్యేలా చేశావు. 25 ఇశ్రాయేలీయుల దేవుడవైన నా ప్రభువా, నా తండ్రియు నీ సేవకుడు అయిన దావీదుకు నీవు చేసిన ఇతర వాగ్దానాలను కూడ ఇప్పుడు నెరవేర్చు. నీవిలా అన్నావు: ‘నీవు నా ఆజ్ఞలను పాటించినట్లు నీ కుమారులు కూడా నన్ననుసరించే విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. వారు అలా చేస్తే నీవు నీ కుటుంబంలో ఎల్లప్పుడూ ఇశ్రేయేలును పాలించటానికి ఒకనిని కలిగి వుంటావు.’ 26 ఇశ్రాయేలు దైవమగు ఓ నా ప్రభువా, నీవు నా తండ్రికిచ్చిన ఆ వాగ్దానం కొనసాగించుమని కూడా నేను వేడు కుంటున్నాను.
27 “కాని దేవుడు నిజంగా ఈ భూమి మీద నివసించగలడా? ఈ ఆకాశము, ఉన్నత ఆకాశాలు నిన్ను భరించ జాలవు. నేను నిర్మించిన ఈ నివాసం కూడ ఖచ్చితంగా నిన్ను ఇముడ్చుకోలేదు. 28 దయచేసి నా ప్రార్థనను, నా మనవిని ఆలకించు. నేను నీ సేవకుడను. నీవు నా ప్రభువైన దేవుడవు. నేను చేసే ఈ ప్రార్థన ఆలకించు. 29 గతంలో నీవు, ‘నేనక్కడ గౌరవింపబడుదు’నని చెప్పావు. దయచేసి ఈ ఆలయాన్ని రాత్రింబవళ్లు కనిపెట్టుకుని ఉండు. ఈ దేవాలయంలో నేను చేసే ఈ ప్రార్థన ఆలకించు. 30 దయచేసి నీ సేవకుడనైన నేను, ఇశ్రాయేలు ప్రజలు ఈ స్థలంలో చేసే ప్రార్థనలన్నీ ఆలకించు. మాకు తెలుసు నీవు పరలోకంలో నివసిస్తావని, అక్కడ నుండి మా ప్రార్థన ఆలకించి, మమ్మల్ని మన్నించుమని మేము నిన్ను వేడుకుంటున్నాము.
31 “ఎవరైనా ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్ల అపచారం చేస్తే, వాడు ఈ బలిపీఠం వద్దకు తేబడతాడు. ఆ వ్యక్తి గనుక నేరం చేయకపోతే, తన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటూ ఒక ప్రమాణం చేస్తాడు. 32 పరలోకంలోనుండి నీవు అది విని, ఆ వ్యక్తి పట్ల న్యాయనిర్ణయం చెయ్యి. దోషిని శిక్షించి, అమాయకుడైన వానిని క్షమించు.
33 “కొన్నిసార్లు నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీ పట్ల పాపం చేయవచ్చు; మరియు వారి శత్రువులు వారిని ఓడించవచ్చు. వారు మరల నీ వద్దకు తిరిగివచ్చి నీకు స్తోత్రం చేస్తారు. ఈ దేవాలయంలో వారు నిన్ను వేడుకొంటూ ప్రార్థనలు చేస్తారు. 34 పరలోకంలో నీవు వారి ప్రార్థన దయచేసి విను. నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల పాపాలను క్షమించు. మళ్లీ వారి రాజ్యం వారికి వచ్చేలా చేయి. ఈ రాజ్యం వారి పూర్వీకులకు నీవు ఇచ్చినదే!
35 “మరి కొన్ని సార్లు వారు నీకు వ్యతిరేకంగా పాపం చేస్తే, వారి భూముల్లో వర్షం కురియకుండా నీవు చేస్తావు. వారు మరల ఈ ప్రదేశానికి వచ్చి నిన్ను ప్రార్థించి, స్తుతిస్తారు. నీవు వారిని బాధించినప్పుడు, వారు చేసిన పాపాలకు వారు పశ్చాత్తాపం పొందుతారు. 36 ఇది జరిగినప్పుడు, పరలోకంలో నీవు వారి ప్రార్థన ఆలకించుము. నీ సేవకుడనగు నా తప్పులు, ఇశ్రాయేలు ప్రజల తప్పులను మన్నించు. పరలోకాన్నిగురించి వారికి బోధించు. యెహోవా, అప్పుడు దయచేసి రాజ్యంలో వర్షం కురిపించు. ఈ రాజ్యం వారికి నీవిచ్చినదే!
37 “ఈ నేల బాగా ఎండిపోయి, పంటలు పండక పోవచ్చు. లేక భయంకర వ్యాధి ప్రజలలో వ్యాపించవచ్చు. బహుశా పండిన పంటనంతా క్రిమికీటకాదులు నాశనం చేయవచ్చు. లేక నీ ప్రజలు వారి నగరాలలో శత్రువాత పడవచ్చు లేక నీ ప్రజలలో చాలామంది వ్యాధిగ్రస్థులు కావచ్చు. 38 వీటిలో ఏదైనా జరిగినప్పుడు, ఏ ఒక్కడైనా జరిగిన దానికి పశ్చాత్తాపపడి, చేతులు చాచి ఈ దేవాలయంలో నిలబడి నీకు ప్రార్థన చేస్తే, 39 దయచేసి అతని ప్రార్థన ఆలకించు. పరలోకంలో నీవు నీ నివాసంలో వుండగా దానిని ఆలకించు. ఆలకించి ఈ ప్రజలను మన్నించి, వారికి సహాయం చేయి. ప్రజలు నిజంగా ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకోగల శక్తి నీకు తప్ప మరి ఎవ్వరికీ లేదు. కావున ప్రతి వ్యక్తికీ తీర్పు తీర్చి ఏది ఉచితమో వానికి అది చేయి. 40 నీవు అలాగున చేయి. దానివల్ల వారు నీ పట్ల భయభ్రాంతులతో, భక్తి భావంతో మా పూర్వీకులకు నీవిచ్చిన ఈ రాజ్యంలో సదా జీవిస్తారు.
41-42 “ఇతర ప్రాంతాల ప్రజలు కూడా నీ ప్రతిభా విశేషాలను గురించి వింటారు. వారు దూర ప్రాంతాలనుండి దేవాలయానికి ప్రార్థనలు చేయటానికి వస్తారు. 43 నీ పరలోక నివాసంనుండి దయచేసి వారి మనవి ఆలకించు. ఇతర ప్రాంతాలవారు నిన్నడిగినదంతా దయచేసి నెరవేర్చు. ఇశ్రాయేలులో నీ ప్రజలు నీపట్ల ఎలాంటి భయభక్తులతో మెలుగుతారో, వారు కూడ అలా నీపట్ల విధేయులైయుంటారు. అప్పుడు సర్వప్రాంతాల ప్రజలంతా నీ గౌరవార్థం నేను కట్టించిన ఈ దేవాలయం గురించి తెలుసుకుంటారు.
44 “కొన్ని సార్లు వారి శత్రువులతో పోరాడటానికి నీవు నీ ప్రజలకు ఆజ్ఞ ఇవ్వవచ్చు. అలాంటప్పుడు వారు నీవు ఎన్నుకున్న ఈ నగరానికి వచ్చిగాని, నీ గౌరవార్థం నేను కట్టించిన ఈ దేవాలయానికి వచ్చిగాని ప్రార్థన చేస్తారు. 45 ఆ సమయంలో పరలోకంలో వున్న నీవు విని వారికి సహాయం చేయి.
46 “నీ ప్రజలు నీ పట్ల పాపం చేస్తారు. ఇది నాకు తెలుసు. ఎందువల్లననగా పాపం చేయని వ్యక్తి లేడు. నీ ప్రజల పట్ల నీకు కోపం వస్తుంది. వారి శత్రువులు వారిని ఓడించేలా చేస్తావు. వారి శత్రువులు వారిని బందీలు చేసి దూర ప్రాంతాలకు తీసుకొని పోతారు. 47 ఆ దూర పరాయి రాజ్యంలో నీ ప్రజలు జరిగిన దానిని జ్ఞాపకం చేసుకుంటారు. వారు చేసిన పాపానికి వారు పశ్చాత్తాప పడతారు. ఆ పరాయి రాజ్యంలో బందీలుగా వుండి వారు నిన్ను ప్రార్థిస్తారు. వారు ‘మేము పాపం చేశాం; మేము తప్పుచేశాం’ అని అంటారు. 48 వారు నిజంగా ఆ పరాయి రాజ్యాలలో నిన్ను ఆశ్రయిస్తే, నీవు వారి పూర్వీకులకు ఇచ్చిన ఈ రాజ్యంవైపుగాని, నీవు ఎన్నుకున్న ఈ నగరంవైపు గాని, నేను నీ గౌరవార్థం కట్టించిన ఈ దేవాలయమువైపు గాని తిరిగి ప్రార్థిస్తే, 49 దయచేసి పరలోకంలో వున్న నీవు వారి ప్రార్థన ఆలకించు. 50 నీ ప్రజల పాపాలన్నిటినీ క్షమించు. నీకు వ్యతిరేకంగా తిరిగినందుకు కూడా వారిని క్షమించు. వారి శత్రువులు వారిపట్ల ఉదారంగా వుండేలా చేయి. 51 వారు నీ ప్రజలే అని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకో. నీవు వారిని ఈజిప్టు నుండి బయటకు తెచ్చినట్లు జ్ఞాపక ముంచుకో. మండుతున్న కొలిమిలోనుండి బయటికి తీసినట్లు వారిని రక్షించావు!
52 “ప్రభువైన దేవా, నా ప్రార్థనలను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ప్రార్థనలను దయచేసి ఆలకించు. వారు ఏ సమయములో నిన్ను నీ సహాయము కోరి ప్రార్థించినా వారి ప్రార్థన విను. 53 ఈ భూలోకంలోవున్న ప్రజానీకమంతటిలో వారిని నీవు నీ ప్రజలుగా ఎంపిక చేశావు. యెహోవా మా పూర్వీకులను ఈజిప్టునుండి తీసుకొని వచ్చినప్పుడు, నీ సేవకుడైన మోషే ద్వారా ఈ వాగ్దానం నీవు చేశావు.”
 
54 ఈ విధంగా సొలొమోను దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని బలిపీఠం ముందు అతను మోకాళ్ల మీద ఉన్నాడు. తన చేతులను ఆకాశం వైవు చాచి అతడు ప్రార్థించాడు. సొలొమోను ప్రార్థన ముగించిన పిమ్మట లేచి నిలబడ్డాడు. 55 పిమ్మట, పెద్ద గొంతుతో ఇశ్రాయేలు ప్రజలందరినీ దీవించమని దేవుని అర్థించాడు. సొలొమోను ఇలా అన్నాడు:
 
56 “యెహోవాకు స్తోత్రము కలుగునుగాక! తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు విశ్రాంతి ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అలాగే ఆయన మనకు విశ్రాంతి ఇచ్చాడు! తన సేవకుడైన మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అనేక శుభప్రదమైన వాగ్దానాలను చేశాడు. యెహోవా ఈ వాగ్ధానాలన్నిటినీ నెరవేర్చాడు. 57 మనదేవుడైన యెహోవాను మనతో ఉండమని అడుగుతున్నాను. ఆయన మన పూర్వీకులతో ఎలావున్నాడో అలాగే మనతో కూడ ఉండమని అడుగుతున్నాను. మనలను ఎన్నడూ వదిలి వుండవద్దని వేడు కుంటున్నాను. 58 ఈ రకంగా మనం ఆయనను ఆశ్రయించి, ఆయనను అనుసరించుదాం. ఆయన మనపూర్వీకులకు ఇచ్చిన న్యాయసూత్రాలను, ఆజ్ఞలను మనము ఆచరిద్దాము. 59 నా ఈ ప్రార్థన, నేనడిగిన అన్ని విషయాలు సదా గుర్తుచుకోమని మన దేవుడైన యెహోవాను అడుగుతున్నాను. తన సేవకుడైన రాజు కొరకు, ఇశ్రాయేలు ప్రజలకొరకు ఇవన్నీ జరిపించమని వేడుకుంటున్నాను. ఇలా ప్రతి రోజూ జరిపించ మని కూడా వేడుకుంటున్నాను. 60 యెహోవా ఇవన్నీ జరిగేలా చేస్తే ప్రపంచ ప్రజలంతా మన దేవుడైన యెహోవాయే నిజమైన దేవుడని తెలుసుకుంటారు. 61 మన దేవుడైన యెహోవాకు మీరంతా చెందియున్నారు. కావున మన దేవుడైన యెహోవాకు విధేయులై యుండాలి. ఆయన న్యాయ సూత్రాలను, ఆజ్ఞలను మీరంతా తప్పక అనుసరించాలి. మీరిప్పుడు చేస్తున్నట్లు భవిష్యత్తులో కూడ ఆయన మార్గాన్ని మీర నుసరించాలి.”
 
62 తరువాత రాజైన సొలొమోను, ఇశ్రాయేలీయులందరు యెహోవాకు బలులు అర్పించారు. 63 సొలొమోను ఇరువది రెండు వేల పశువులను, ఒక లక్షాఇరువది వేల గొర్రెలను బలి ఇచ్చాడు. ఇవి సమాధాన బలులుగా అర్పించారు. ఈ విధంగా రాజు, ఇశ్రాయేలీయులు దేవాలయాన్ని దేవునికి అంకితము చేశారు.
64 రాజైన సొలొమోను ఇంకా ఆ రోజు దేవుని ఆలయము ముందున్న ఆవరణను దేవుని కార్యము కొరకు పవిత్రం చేశాడు. అతనక్కడ దహన బలులు, ధాన్యార్పణలు, జంతువుల కొవ్వును సమాధాన సూచకంగా అర్పించాడు. అతి పరిశుద్ధ స్థలము ముందున్న కంచు బలిపీఠం ఇవన్నీ అర్పించటానికి బహు చిన్నది అగుటచే, రాజైన సొలొమోను ఆవరణలో అర్పించాడు.
65 రాజైన సొలొమోను, ఇశ్రాయేలీయులు దేవాలయంలో ఆ విధంగా పండుగ జరుపుకున్నారు. ఉత్తర భాగాన బహుదూరంలో ఉన్న హమాతు కనుమ నుండి దక్షిణాన ఈజిప్టు సరిహద్దు వరకుగల ఇశ్రాయేలీయులంతా పండుగలో పాల్గొన్నారు. లెక్కకు మించిన జనాభా అక్కడ చేరింది. ఏడు రోజులపాటు వారంతా అక్కడ ఆహారపానీయాలు స్వీకరిస్తూ వేడుక చేసుకున్నారు. 66 ఎనిమిదవ రోజు సొలొమోను వారందరినీ తమ ఇండ్లకు వెళ్లమన్నాడు. ప్రజలంతా రాజుకు కృతజ్ఞతా వందనాలు చెప్పి తమ ఇండ్లకు వెళ్లారు. తన సేవకుడై న దావీదుకు, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు యెహోవా ఇచ్చిన సహాయ సంపత్తికి ప్రజలంతా చాలా సంతోషపడ్డారు.