147
 1 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి. 
మన దేనునికి స్తుతులు పాడండి. 
ఆయనను స్తుతించుట మంచిది, అది ఎంతో ఆనందం. 
 2 యెహోవా యెరూషలేమును నిర్మించాడు. 
బందీలుగా తీసికొనిపోబడిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వెనుకకు తీసికొనివచ్చాడు. 
 3 పగిలిన వారి హృదయాలను దేవుడు స్వస్థపరచి, 
వారి గాయాలకు కట్లు కడతాడు. 
 4 దేవుడు నక్షత్రాలను లెక్కిస్తాడు. 
వాటి పేర్లనుబట్టి వాటన్నిటినీ ఆయన పిలుస్తాడు. 
 5 మన ప్రభువు చాలా గొప్పవాడు ఆయన చాలా శక్తిగలవాడు. 
ఆయన పరజ్ఞానానికి పరిమితం లేదు. 
 6 పేదలను యెహోవా బలపరుస్తాడు. 
కాని చెడ్డ ప్రజలను ఆయన ఇబ్బంది పెడతాడు. 
 7 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి. 
స్వరమండలాలతో మన దేవుని స్తుతించండి. 
 8 దేవుడు ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు. 
భూమి కోసం దేవుడు వర్షాన్ని సృష్టిస్తాడు. 
పర్వతాల మీద దేవుడు గడ్డని మొలిపిస్తాడు. 
 9 జంతువులకు దేవుడు ఆహారం యిస్తాడు. 
పక్షి పిల్లల్ని దేవుడు పోషిస్తాడు. 
 10 యుద్ధాశ్వాలు, బలంగల సైనికులు ఆయనకు ఇష్టం లేదు. 
 11 యెహోవాను ఆరాధించే ప్రజలు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తారు. 
ఆయన నిజమైన ప్రేమను నమ్ముకొనే ప్రజలు యెహోవాకు సంతోషం కలిగిస్తారు. 
 12 యెరూషలేమా, యెహోవాను స్తుతించుము. 
సీయోనూ, నీ దేవుని స్తుతించుము! 
 13 యెరూషలేమా, దేవుడు నీద్వారబంధాలను బల పరుస్తాడు. 
నీ పట్టణంలోని ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడు. 
 14 నీ దేశానికి దేవుడు శాంతి కలిగించాడు. కనుక యుద్ధంలో నీ శత్రువులు నీ ధాన్యం తీసుకొని పోలేదు. 
ఆహారం కోసం నీకు ధాన్యం సమృద్ధిగా ఉంది. 
 15 దేవుడు భూమికి ఒక ఆజ్ఞ ఇస్తాడు. 
దానికి వెంటనే అది లోబడుతుంది. 
 16 నేల ఉన్నిలా తెల్లగా అయ్యేంతవరకు మంచుకురిసేటట్టు దేవుడు చేస్తాడు. 
ధూళిలా గాలిలో మంచు విసిరేటట్టు చేస్తాడు. 
 17 దేవుడు ఆకాశం నుండి బండలవలె వడగండ్లను పడేలా చేస్తాడు. 
ఆయన పంపే చలికి ఎవడూ నిలువ జాలడు. 
 18 అప్పుడు, దేవుడు మరో ఆజ్ఞ ఇస్తాడు. వెచ్చటి గాలి మరల వీస్తుంది. 
మంచు కరిగిపోతుంది. నీళ్లు ప్రవహించటం మొదలవుతుంది. 
 19 దేవుడు యాకోబుకు (ఇశ్రాయేలు) తన ఆజ్ఞ ఇచ్చాడు. 
దేవుడు ఇశ్రాయేలుకు తన న్యాయచట్టాలు, ఆదేశాలు ఇచ్చాడు. 
 20 దేవుడు యిలా మరి ఏ దేశానికీ చెయ్యలేదు. 
ఇతర మనుష్యులకు దేవుడ తన న్యాయ చట్టం ఉపదేశించలేదు. 
యెహోవాను స్తుతించండి!