చర్మరోగాలను గూర్చిన నియమాలు
13
1 మోషే, అహరోనులకు యెహోవా ఇలా చెప్పాడు:
2 “ఒక వ్యక్తి చర్మం మీద వాపు ఉండవచ్చును, లేక అది పొక్కుగాని, నిగనిగలాడు మచ్చగాని కావచ్చును. ఆ మచ్చ కుష్ఠురోగంలా కనబడితే, యాజకుడగు అహరోను దగ్గరకు గాని, యాజకులైన అతని కుమారుల దగ్గరకుగాని ఆ వ్యక్తిని తీసుకొనిరావాలి.
3 ఆ వ్యక్తి చర్మంమీది మచ్చను యాజకుడు పరిశీలించాలి. ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబడినా, ఆ మచ్చ అతని చర్మంకంటె లోతుకు ఉన్నా అది కుష్ఠురోగమే. యాజకుడు ఆ వ్యక్తిని పరిశీలించటం ముగించగానే ఆ వ్యక్తి కుష్ఠురోగి అని యాజకుడు ప్రకటించాలి.
4 “కొన్నిసార్లు ఒక వ్యక్తి చర్మంమీద ఒక తెల్లమచ్చ ఉంటుంది. కానీ ఆ మచ్చ చర్మంలోపలికి ఉండదు. అదే నిజమైతే ఆ వ్యక్తిని ఏడు రోజులపాటు ఇతరులనుండి యాజకుడు వేరు చేయాలి.
5 ఏడో రోజున యాజకుడు ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ మచ్చలో మార్పు లేకుండా, అది చర్మంమీద విస్తరించకుండా ఉన్నట్టు యాజకునికి కనబడితే, అప్పుడు ఆ వ్యక్తిని మరో ఏడు రోజులపాటు యాజకుడు ప్రత్యేకించాలి.
6 ఏడు రోజుల తర్వాత మరల ఆ వ్యక్తిని యాజకుడు పరిశీలించాలి. ఆ మచ్చ మానిపోయి, చర్మంమీద విస్తరించకుండా ఉంటే, ఆ వ్యక్తి పరిశుద్ధుడు అని యాజకుడు ప్రకటించాలి. ఆ మచ్చ కేవలం పొక్కే. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, మళ్లీ పవిత్రుడు కావాలి.
7 “అయితే ఆ వ్యక్తి మరల శుద్ధి చేయబడేందుకు తనను తాను యాజకునికి కనబరచుకొన్న తర్వాత, ఆ పొక్కు చర్మంమీద మరలా విస్తరిస్తే, అప్పుడు ఆ వ్యక్తి మరల యాజకుని దగ్గరకు రావాలి.
8 యాజకుడు తప్పక పరిశీలించాలి. ఒకవేళ ఆ పొక్కు చర్మం మీద విస్తరిస్తే, ఆవ్యక్తి అపవిత్రుడని యాజకుడు తప్పక ప్రకటించాలి. అది కుష్ఠురోగం.
9 “ఒక వ్యక్తికి కుష్ఠురోగం ఉంటే అతణ్ణి యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి.
10 యాజకుడు తప్పక ఆ వ్యక్తిని పరిశీలించాలి. చర్మంలో తెల్లని వాపుఉండి, వెంట్రుకలు తెల్లబడి ఉండి, వాపులో చర్మంతెల్లగా కనబడితే
11 అప్పుడు అది ఆ వ్యక్తి చర్మంమీద చాలకాలంగా ఉన్న కుష్ఠురోగం. ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు తప్పక ప్రకటించాలి. కొద్దికాలం ఆ వ్యక్తిని మిగిలిన ప్రజలనుండి యాజకుడు ప్రత్యేకించాలి. ఎందుచేతనంటే ఆ వ్యక్తి అపవిత్రుడు అని అతనికి తెలుసు.
12 “కొన్నిసార్లు చర్మరోగం ఒక వ్యక్తి శరీరమంతటా వ్యాపిస్తుంది. ఆ వ్యక్తి తలనుండి పాదంవరకు చర్మంమీద అంతటా చర్మరోగం ఆవరిస్తుంది. యాజకుడు ఆ వ్యక్తి శరీరమంతా తప్పక చూడాలి.
13 చర్మరోగం శరీరమంతా వ్యాపించినట్టు, అది ఆ వ్యక్తి చర్మాన్ని పూర్తిగా తెలుపు చేసినట్టు యాజకుడు చూస్తే, అప్పుడు ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి.
14 అయితే ఆ వ్యక్తి చర్మం పచ్చిగా ఉంటే అతడు పవిత్రుడుకాడు.
15 యాజకుడు చర్మం పచ్చిగా ఉండటం చూసినప్పుడు, ఆ వ్యక్తి అపవిత్రుడని అతడు ప్రకటించాలి. పచ్చి చర్మం పవిత్రం కాదు. అది కుష్ఠురోగం.
16 “చర్మం మరల పచ్చిగా తయారై తెల్లగా మారితే, అప్పుడు ఆ వ్యక్తి తప్పక యాజకుని దగ్గరకు రావాలి.
17 యాజకుడు తప్పక ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ పొడ తెల్లబారితే ఆ పొడగల ఆ వ్యక్తి పవిత్రుడని యాజకుడు ప్రకటించాలి. ఆ వ్యక్తి పవిత్రుడు.
18 “ఒకవేళ దేహపు చర్మంమీద మానిపోయినపుండు ఉండవచ్చును.
19 కాని ఆ పుండు స్థానంలో తెల్లటి వాపుగాని, తెలుపు ఎరుపు కలిసి నిగనిగలాడే మచ్చగానీ ఉండవచ్చును. అప్పుడు దేహం మీది ఈ చోటును యాజకునికి చూపెట్టాలి.
20 యాజకుడు పరిశీలించాలి. వాపు చర్మంకంటె లోతుగా ఉండి, దాని మీది వెంట్రుకలు తెల్లబడి ఉంటే, అప్పుడు ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. ఆ మచ్చ కుష్ఠురోగం పుండులోపలనుండి కుష్ఠురోగం బయటపడింది.
21 కానీ యాజకుడు ఆ మచ్చను చూడగా దానిమీద వెంట్రుకలు తెల్లబడక, ఆ మచ్చ చర్మంకంటె లోతుగా ఉండక మానుతున్నట్టు కనబడితే అప్పుడు యాజకుడు, ఆ వ్యక్తిని ఏడు రోజులపాటు ప్రత్యేకంగా ఉంచాలి.
22 ఒకవేళ ఆ మచ్చయింకా ఎక్కువగా చర్మంమీద విస్తరిస్తే, ఆ వ్యక్తి అపవిత్రుడని యాజకుడు ప్రకటించాలి. అది కుష్ఠుపొడ.
23 అయితే నిగనిగలాడే ఆ మచ్చ విస్తరించక, ఉన్నచోటనే ఉంటే, అది పాతపుండుకు సంబంధించిన దద్దురు మాత్రమే. ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు తప్పక ప్రకటించాలి.
24-25 “ఒక వ్యక్తి చర్మంమీద కాలి వాత కావచ్చును. ఒకవేళ ఆ పచ్చి చర్మం తెల్లగా గాని, తెలుపు ఎరుపురంగు మచ్చలా కానీ మారితే యాజకుడు తప్పక దాన్ని పరిశీలించాలి. ఆ తెల్ల మచ్చ చర్మంకంటె లోతుగా ఉన్నట్టుగానీ, ఆ మచ్చ మీది వెంట్రుకలు తెల్లబడినా అది కుష్ఠురోగం. ఆ వాతలోనుంచి కుష్ఠురోగం బయటపడింది. అప్పుడు ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. అది కుష్ఠురోగం.
26 కానీ యాజకుడు ఆ మచ్చను చూడగా నిగనిగలాడే మచ్చమీద వెంట్రుకలు లేకుండా ఆ మచ్చ చర్మంకంటె లోతుగా లేకుండ అది మానుతున్నట్టు ఉంటే ఆ వ్యక్తిని ఏడు రోజులపాటు యాజకుడు వేరుచేయాలి.
27 ఏడవ రోజున యాజకుడు ఆ వ్యక్తిని మరల పరిశీలించాలి. ఆ మచ్చ చర్మంమీద విస్తరిస్తే, అప్పుడు ఆ వ్యక్తి అపవిత్రుడని యాజకుడు ప్రకటించాలి. అది కుష్ఠురోగం.
28 అయితే నిగనిగలాడే ఆ మచ్చ చర్మంమీద విస్తరించక మానుతుంటే, అది వాత మీది వాపు మాత్రమే. ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. అది కేవలం వాత మచ్చ మాత్రమే.
29 “ఒక వ్యక్తి తలమీదగాని గెడ్డంమీద గాని పొడరావచ్చును.
30 ఒక యాజకుడు ఆ పొడను పరిశీలించాలి. ఆ పొడ చర్మంకంటె లోతుగా ఉన్నట్టు కనబడినా, దానిచుట్టూ వెంట్రుకలు పలుచగాను, పసుపుగాను ఉన్నా, ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. అది చెడ్డ చర్మరోగం.
31 ఒక వేళ ఆ పొడ చర్మంకంటె లోతుగా లేకపోయినా, దానిలో నల్ల వెంట్రుకలు లేకపోతే ఆ వ్యక్తిని ఏడురోజులపాటు యాజకుడు ప్రత్యేకించాలి.
32 ఏడవ రోజున ఆ పొడను యాజకుడు పరిశీలించాలి. ఆ పొడ విస్తరించకపోయినా, దానిలో పసుపు వెంట్రుకలు పెరగకపోయినా, ఆ పొడ చర్మంకంటె లోతుగా ఉన్నట్టు కనబడకపోయినా,
33 ఆ వ్యక్తి క్షౌరం చేసుకోవాలి. కానీ అతడు ఆ పొడను కత్తిరించకూడదు. ఆ వ్యక్తిని యింకో ఏడు రోజుల వరకు యాజకుడు ప్రత్యేకించాలి.
34 ఏడవ రోజున యాజకుడు ఆ పొడను పరిశీలించాలి. ఆ పొడ చర్మంలోనికి విస్తరించక, అది చర్మంకంటె లోతుగా ఉన్నట్టు కనబడకపోయినా, ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుకుకొని శుద్ధుడు కావాలి.
35 కానీ ఆ వ్యక్తి పవిత్రుడయిన తర్వాత ఆ పొడ చర్మంమీద వ్యాపిస్తే,
36 యాజకుడు మరల ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ పొడ చర్మంమీద వ్యాపిస్తే, పసుపు వెంట్రుకల కోసం యాజకుడు చూడక్కర్లేదు. ఆ వ్యక్తి అపవిత్రుడు.
37 అయితే ఆ వ్యాధి మానిపోయినట్టు యాజకుడు తలిస్తే, దానిలో నల్ల వెంట్రుకలు పెరుగుతుంటే ఆ రోగం మాని పోయింది. ఆ వ్యక్తి పవిత్రుడు. ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి.
38 “ఒక వ్యక్తి చర్మంమీద తెల్ల మచ్చలు ఉంటే,
39 ఒక యాజకుడు ఆ మచ్చలను పరిశీలించాలి. ఒకవేళ ఆ వ్యక్తి చర్మంమీది మచ్చలు వాడిపోయి తెలుపుగా ఉంటే అది హానికరము కాని పొక్కులు మాత్రమే. ఆ వ్యక్తి పవిత్రుడు.
40 “ఒక వ్యక్తి తలమీద వెంట్రుకలు ఊడి పోవచ్చును. అతడు పవిత్రుడు. అది కేవలం బట్టతల
41 ఒకని తల ముందు భాగంలో వెంట్రుకలు రాలిపోవచ్చును. అతడు పవిత్రుడు. అది కేవలం మరో రకం బట్టతల.
42 కానీ అతని తలమీద ఎరుపు తెలుపు పొడ ఉంటే అది చర్మవ్యాధి.
43 ఒక యాజకుడు ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ పొడ వాపు ఎరుపు తెలుపుగా ఉండి, శరీరంలోని ఇతర భాగాల్లో కుష్ఠు రోగంలా కనబడితే,
44 ఆ వ్యక్తి తలమీద కుష్ఠు రోగం ఉంది. ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి.
45 “ఒక వ్యక్తికి కుష్ఠు రోగం ఉంటే అతడు ఇతరులను హెచ్చరించాలి. అపవిత్రుణ్ణి అపవిత్రుణ్ణి అని కేకలు వేయాలి. అతడు తన బట్టలను చింపివేయాలి, తన తల వెంట్రుకలు విరబోసుకోవాలి, తన నోరు కప్పుకోవాలి.
46 ఆ వ్యాధి ఉన్న కాలమంతా అతను అపవిత్రుడే. ఆ వ్యక్తి అపవిత్రుడు. అతడు ఒంటరిగా బతకాలి. అతని నివాసం బసకు వెలుపల ఉండాలి.
47 “కొన్ని బట్టల మీద కుష్ఠుపొడ ఉండవచ్చును. ఆ బట్ట నాణ్యమైనది లేక ఉన్నది కావచ్చు.
48 బట్ట అల్లినది కావచ్చు, కుట్టినది కావచ్చు, లేదా ఒక తోలు మీద కాని, తోలుతో చేయబడిన మరి దేనిమీద కాని ఆ కుష్ఠు పొడ ఉండవచ్చును.
49 ఆ కుష్ఠుపొడ పచ్చగా కానీ ఎర్రగా కానీ ఉంటే దాన్ని యాజకునికి చూపించాలి.
50 ఆ కుష్ఠుపొడను యాజకుడు పరిశీలించాలి. దానిని ఏడు రోజుల వరకు ఒక ప్రత్యేక స్థలంలో అతడు ఉంచాలి.
51-52 ఏడవ రోజున ఆ కుష్ఠుపొడను యాజకుడు పరిశీలించాలి. ఆ కుష్ఠుపొడ తోలు మీద ఉన్నా బట్టమీద ఉన్నా ఒకటే. ఆ బట్ట కుట్టిందైనా అల్లినదైనా ఒకటే. ఆ తోలు ఉపయోగించబడింది దేని కొరకైనా ఒకటే. కుష్ఠుపొడ వ్యాపిస్తే అది నాశన కరమైనది. ఆ బట్ట లేక తోలు అపవిత్రం. ఆ పొడ అపవిత్రం. ఆ బట్ట లేక తోలును యాజకుడు కాల్చి వేయాలి.
53 “ఆ కుష్ఠుపొడ వ్యాపించినట్టు యాజకునికి కనబడకపోతే, ఆ తోలును లేక ఆ బట్టను ఉతకాలి. అది తోలుగాని, బట్టగాని లేక బట్ట అల్లికగాని, కుట్టింది గాని, దాన్ని ఉతకాల్సిందే.
54 ఆ బట్టను లేక తోలును ఉతకమని ఆ మనుష్యులకు యాజకుడు ఆజ్ఞాపించాలి. అప్పుడు యాజకుడు ఆ బట్టలను ఇంకా ఏడు రోజుల వరకు వేరుపరచాలి.
55 ఆ సమయం తీరగానే యాజకుడు మళ్లీ పరిశీలించాలి. ఆ కుష్ఠుపొడ ఇంకా అలానే కనబడితే అది అపవిత్రం. ఆ పొడ వ్యాపించకపోయినా సరే ఆ బట్టను లేక ఆ తోలును మీరు కాల్చివేయాలి.
56 “కానీ ఒక వేళ, ఆ తోలు ముక్కను లేక ఆ బట్టను యాజకుడు చూచినప్పుడు, కుష్ఠుపొడ వాడిపోయి ఉంటే, ఆ బట్ట మీద లేక తోలు మీద ఉన్న ఆ పొడను యాజకుడు చింపివేయాలి. ఆ బట్ట అల్లికది గాని, పడుగుది కానీ ఫర్వాలేదు.
57 లేదా ఆ బట్టమీద లేక ఆ తోలుమీద కుష్ఠుపొడ తిరిగి రావచ్చును. అలా జరిగతే ఆ కుష్ఠు పొడ వ్యాపిస్తుంది. ఆ చించిన బట్ట ముక్కను లేక తోలు ముక్కను కాల్చివేయాలి.
58 అయితే ఉతకిన తర్వాత కుష్ఠుపొడ మళ్లీ రాకపోతే అప్పుడు ఆ బట్ట ముక్క లేక తోలు ముక్క పవిత్రం. ఆ బట్ట కుట్టిందిగానీ అల్లిందిగానీ ఏదైనా ఫర్వాలేదు. ఆ బట్ట పవిత్రం.”
59 తోలు ముక్కలు లేక బట్టముక్కల మీద కుష్ఠుపొడకు సంబంధించిన నియమాలు అవి. బట్ట కుట్టింది గాని అల్లిందిగాని ఫర్వాలేదు.