దేవుని అగ్ని నాదాబు, అబీహులను నాశనం చేయటం
10
1 అప్పుడు అహరోను కుమారులైన నాదాబు, అబీహులు పాపం చేసారు. ధూపం వేసేందుకు ఒక్కో కుమారుడు ఒక్కో ధూపార్తిని తీసుకొన్నాడు. వారు వేరే నిప్పు తీసుకొని ధూపం అంటించారు. వారు ఉపయోగించాలని దేవుడు ఆజ్ఞాపించిన నిప్పును వారు ఉపయోగించలేదు.
2 కనుక యెహోవా నుండి అగ్ని వచ్చి నాదాబు, అబీహులను నాశనం చేసింది. యెహోవా ఎదుట వారు మరణించారు.
3 అప్పుడు అహరోనుతో మోషే ఇలా చెప్పాడు: “యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, ‘నా దగ్గరకు వచ్చే యాజకులు నన్ను గౌరవించాలి. వారికీ, ప్రజలందరికీ నేను పరిశుద్ధుడుగా ఉండాలి.’” కనుక అహరోను తన కుమారుల చావునుగూర్చి ఏమీ అనలేదు.
4 అహరోను పినతండ్రియైన ఉజ్జీయేలుకు ఇద్దరు కుమారులుండిరి. వారు మిషాయేలు, ఎల్సాఫాను. “పరిశుద్ధ స్థలం ముందునకు వెళ్లండి. మీ సోదరుల శవాలను బస వెలుపలకు తీసుకొని పొండి” అని మోషే వారిద్దరితో చెప్పాడు.
5 కనుక మిషాయేలు, ఎల్సాఫాను మోషేకు విధేయులయ్యారు. నాదాబు, అబీహు శవాలను బస వెలుపలకు వారు మోసుకొని పోయారు. నాదాబు, అబీహు అప్పటికి ఇంకా వారి ప్రత్యేక చొక్కాలు ధరించే ఉన్నారు.
6 అప్పుడు అహరోనుతోను, అతని ఇతర కుమారులు ఎలీయాజరు, ఈ తామారులతో మోషే ఇలా మాట్లాడాడు. “ఏమి విచారపడకండి. మీబట్టలు చింపుకోవద్దు, జుట్టు చిందరవందర చేసుకోవద్దు. మీరు అలాంటివి చేయకుండా ఉంటే మీరు చావకుండా ఉంటారు. అలానే యెహోవా తన ప్రజలందరి మీద కోపగించకుండా ఉంటాడు. ఇశ్రాయేలు జాతి మొత్తం మీ బంధువులే. నాదాబు, అబీహులను యెహోవా కాల్చివేసినందుకు వారంతా ఏడుస్తారు.
7 కాని మీరు మాత్రం సన్నిధి గుడారం వదిలి వెళ్లకూడదు. ఆ ద్వారం నుండి కనుక మీరు బయటకు వెళ్తే మీరు చనిపోతారు. ఎందుచేతనంటే యెహోవా ప్రత్యేక తైలం మీమీద ఉంది.” గనుక అహరోను, ఎలీయాజరు, ఈతామారు మోషేకు విధేయులయ్యారు.
8 అప్పుడు అహరోనుతో యెహోవా అన్నాడు:
9 “మీరు సన్నిధి గుడారంలోనికి వచ్చేటప్పుడు నీవుగాని నీ కుమారులుగాని ద్రాక్షారసం, మద్యం తాగకూడదు. మీరు అలాంటివి చేస్తే చనిపోతారు. మీతరాలన్నింటికీ ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది.
10 పవిత్రం, అపవిత్రం అనే నిర్దిష్టమైన వ్యత్యాసాన్ని మీరు పాటించాలి.
11 యెహోవా తన ఆజ్ఞలను మోషేకు ఇచ్చాడు, వాటిని మోషే ప్రజలకు ఇచ్చాడు. అహరోనూ, నీవు ఆ ఆజ్ఞలు అన్నింటి విషయమై ప్రజలకు ప్రబోధించాలి.”
12 అహరోనుకు ఎలీయాజరు, ఈ తామారు అనే ఇద్దరు కుమారులు ఇంకా బతికి ఉన్నారు. అహరోనుతో, అతని ఇద్దరు కుమారులతో మోషే ఇలా అన్నాడు: “అగ్నిచే దహించబడిన బలులలో ధాన్యార్పణ కొంత మిగిలిపోయింది. ధాన్యార్పణంలోని ఆ భాగాన్ని మీరు తినాలి. అయితే అందులో పొంగే పదార్థం కలుపకుండా మీరు తినాలి. బలిపీఠం దగ్గరే దాన్ని తినాలి. ఎందుచేతనంటే ఆ అర్పణ అతి పరిశుద్ధం.
13 అది యెహోవా కోసం అగ్నిమీద దహించబడిన అర్పణలలో భాగమైయున్నది. ఆ భాగం నీకు నీ కుమారులకు చెందుతుంది అని నీకు నేను ఇచ్చిన ఆజ్ఞ ప్రబోధిస్తుంది. అయితే ఒక పరిశుద్ద స్థలంలోనే మీరు దాన్ని తినాలి.
14 “మరియు నీవు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నైవేద్యంల్లోనుంచి బోరను తినవచ్చును. మీరు వాటిని పవిత్ర స్థలంలో తినాల్సిన అవసరం లేదు గాని పరిశుభ్రమైన స్థలంలో తినాలి. ఎందుచేతనంటే అవి సమాధాన బలిలోనివి. ఆ కానుకలను ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇస్తారు. ఆ జంతువుల్లో కొంత భాగాన్ని ప్రజలు తింటారు కాని బోర మాత్రం మీ వంతు అవుతుంది.
15 నిప్పుమీద దహించబడిన బలిలో భాగంగా ప్రజలు వారు అర్పించే జంతువుల కొవ్వును తీసుకొని రావాలి. సమాధాన బలిలోని తొడను, నైవేద్యంలోని బోరనుకూడా వారు తీసుకుని రావాలి. అది యెహోవా ఎదుట అల్లాడించబడుతుంది. ఆ తర్వాత అది ఆ అర్పణలో మీ భాగం అవుతుంది. బలి అర్పణల్లోని ఆ భాగం యెహోవా ఆజ్ఞాపించినట్టు శాశ్వతంగా మీ వంతు అవుతుంది.”
16 పాప పరిహారార్థబలి మేక కోసం మోషే చూశాడు. అయితే అప్పటికే అది దహించివేయబడింది. అహరోను కుమారుల్లో మిగిలిన వారి మీద (ఎలీయాజరు, ఈతామారు) మోషేకు చాలా కోపం వచ్చింది.
17 మోషే, “ఆ మేకను మీరు పరిశుద్ధ స్థలంలోనే తినాల్సిఉంది. అది చాలా పరిశుద్ధం. దాన్ని యెహోవా ఎదుట మీరెందుకు తినలేదు? ప్రజల దోషాన్ని తీసివేసేందుకు దాన్ని యెహోవా మీకు ఇచ్చాడు. ఆ మేక బలి ప్రజల పాపాలను తుడిచి వేసేందుకు ఉద్దేశించబడింది.
18 చూడండి, ఆ మేక రక్తాన్ని పవిత్ర స్థలం లోపలకు మీరు తీసుకొని రాలేదు. నేను ఆజ్ఞాపించిన ప్రకారం మీరు దాన్ని పరిశుద్ధ స్థలంలోనే తినాల్సి ఉంది”! అని అన్నాడు.
19 కాని, మోషేతో అహరోను చెప్పాడు: “చూడు, ఈవేళ వారు తమ పాపపరిహారార్థ బలిని, దహన బలి అర్పణను యెహోవా ఎదుటికి తెచ్చారు. అయితే ఈవేళ నాకు ఏమి జరిగిందో నీకు తెలుసు. పాపపరిహారార్థ బలిని ఈ వేళ నేను తింటే యెహోవా ఆనందిస్తాడని నీవు అనుకొంటావా? లేదు!”
20 మోషే ఇది విన్నప్పుడు ఒప్పుకొన్నాడు.