ఈజిప్టుకు దేవుని సందేశం ఈజిప్టును గూర్చిన విచారకరమైన సందేశం
19
చూడండి! వేగంగా పోయే మేఘం మీద యెహోవా వస్తున్నాడు. యెహోవా ఈజిప్టులో ప్రవేశిస్తాడు, అప్పుడు ఈజిప్టు అబద్ధ దేవుళ్లంతా భయంతో వణికిపోతారు. ఈజిప్టు ధైర్యంగలది కానీ ఆ ధైర్యం వేడి మైనంలా కరగిపోతుంది.
దేవుడు చెబుతున్నాడు: “ఈజిప్టు ప్రజలు వారికి వారే విరోధంగా పోరాడుకొనేట్టు నేను చేస్తాను. మనుష్యులు వారి సోదరులతో పోరాడుతారు. పొరుగువారు పొరుగువారికి విరోధం అవుతారు. పట్టణాలు పట్టణాలకు విరోధం అవుతాయి. రాష్ట్రాలు రాష్ట్రాలకు విరోధం అవుతాయి. ఈజిప్టు ప్రజలు గందరగోళ పడిపోతారు. వారు చేయాల్సింది ఏమిటి అని ప్రజలు వారి అబద్ధ దేవుళ్లను, జ్ఞానులను అడుగుతారు. ప్రజలు వారి మాంత్రికులను, భూత వైద్యులను అడుగుతారు. కానీ వారి సలహా నిష్ప్రయోజనం.” సర్వశక్తిమంతుడైన యెహోవా, ప్రభువు చెబుతున్నాడు, “నేను (దేవుణ్ణి) ఈజిప్టును కఠినమైన యజమానికి అప్పగిస్తాను. శక్తిగల ఒక రాజు ప్రజలను పాలిస్తాడు.”
నైలునది ఎండిపోతుంది. నదులన్నీ చెడ్డకంపు కొడ్తాయి. ఈజిప్టులో కాలువలు ఎండిపోయి, నీరు ఉండకుండా పోతుంది. నీటి మొక్కలు అన్నీ కుళ్లిపోతాయి. నదీ తీరాల్లోని మొక్కలన్నీ ఎండిపోయి, కొట్టుకొని పోతాయి. నది మహా విశాలంగా ఉన్న చోటగూడా మొక్కలు చస్తాయి.
“నైలునదిలో చేపలుపట్టే జాలరులు అందరూ దుఃఖపడి ఏడుస్తారు. వారు తమ ఆహారంకోసం నైలు నదిమీద ఆధారపడతారు. కానీ అది ఎండిపోతుంది. బట్టలు తయారు చేసే వాళ్లంతా చాలా దుఃఖపడతారు. పీచువస్త్రాలు తయారు చేయటానికి ప్రజలకు పీచు కావాలి. కానీ నది ఎండిపోయి ఈ పీచు మొక్కలు పెరగవు. 10 నీళ్లు నిల్వ చేసేందుకు ఆనకట్టలు కట్టే వారికి పని ఉండదు గనుక దుఃఖంగా ఉంటారు.
11 “సోయను పట్టణ నాయకులు తెలివి తక్కువ వాళ్లు. ఫరోయొక్క ‘తెలివిగల నాయకులు’ తప్పుసలహాలు ఇస్తారు. వారు తెలివిగల వాళ్లని ఆ నాయకులు అంటారు. వారు పూర్వపు రాజుల కుటుంబాలకు చెందినవాళ్లం అంటారు. కానీ వారు, వాళ్లు అనుకొన్నంత తెలివిగలవాళ్లు కారు.” 12 ఈజిప్టూ, నీ జ్ఞానులు ఎక్కడ? సర్వశక్తిమంతుడైన యెహోవా ఈజిప్టు కోసం వేసిన పథకం ఏమిటో ఆ జ్ఞానులు తెలుసుకోవాలి. ఏం జరుగ బోతుందో అది నీకు చెప్పాల్సినవాళ్లు వారే.
13 సోయను నాయకులు వెర్రివాళ్లుగా చేయబడ్డారు. నోపు నాయకులు దొంగ సంగతులు నమ్మేసారు. అందుచేత నాయకులు ఈజిప్టును తప్పుత్రోవను నడిపించారు. 14 ఆ నాయకులను యెహోవా గందరగోళపర్చాడు. వాళ్లు తిరుగులాడుచూ, ఈజిప్టును తప్పుదారిలో నడిపిస్తారు. ఆ నాయకులు చేసేది అంతా తప్పే. వాళ్లు త్రాగి రోగంతో వీధిలో దొర్లాడే వాళ్లలా ఉన్నారు. 15 ఆ నాయకులు చేయగలిగింది ఏమీ లేదు. (ఈ నాయకులే “తలలు, తోకలు.” వారే, “మొక్కల కొమ్ములు, కాండాలు.”)*
16 ఆ కాలంలో ఈజిప్టు వాళ్లు బెదరిపోయిన ఆడవాళ్లలా ఉంటారు. సర్వశక్తిమంతుడైన యెహోవాకు వారు భయపడతారు. ప్రజలను శిక్షించటానికి యెహోవా తన చేయి పైకి ఎత్తుతాడు, వారు భయపడతారు. 17 యూదా దేశం, ఈజిప్టు ప్రజలందరికి భయం పుట్టించే దేశం అవుతుంది. ఈజిప్టులో ఎవరైనా సరే యూదా పేరు వింటే భయపడతారు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈజిప్టులో భయంకర సంగతులు జరగాలని పథకం వేసాడు గనుక ఇవి జరుగుతాయి. 18 ఆ కాలంలో ప్రజలు కనాను భాష (యూదుల బాష) మాట్లాడే పట్టణాలు ఈజిప్టులో అయిదు ఉంటాయి. ఈ పట్టణాల్లో ఒక దానికి “నాశన పట్టణం” అని పేరు పెట్టబడుతుంది. సర్వశక్తిమంతుడైన యెహోవాను వెంబడిస్తాం అని ప్రజలు ప్రమాణం చేస్తారు.
19 ఆ కాలంలో ఈజిప్టు కేంద్రంలో యెహోవాకు ఒక బలిపీఠం ఉంటుంది. యెహోవాకు సన్మాన సూచకంగా ఈజిప్టు సరిహద్దులో ఒక స్తంభం ఉంటుంది. 20 సర్వశక్తిమంతుడైన యెహోవా శక్తివంతమైన పనులు చేస్తాడు అని చూపించేందుకు ఇది ఒక సంకేతం. యెహోవా దగ్గర్నుండి సహాయం కావాలని ప్రజలు మొర పెట్టినప్పుడల్లా, యెహోవా సహాయం పంపిస్తాడు. ప్రజలను రక్షించి, కాపాడుటకు ఒక వ్యక్తిని యెహోవా పంపిస్తాడు. ఆ ప్రజలకు అక్రమమైన వాటిని జరిగించే మనుష్యుల బారినుండి ఆ వ్యక్తి వారిని విమోచిస్తాడు.
21 ఆ సమయంలో ఈజిప్టులోని ప్రజలు యెహోవాను వాస్తవంగా తెలుసుకొంటారు. ఈజిప్టు ప్రజలు దేవుణ్ణి ప్రేమిస్తారు. ప్రజలు దేవుణ్ణి సేవిస్తారు, అనేక బలులు అర్పిస్తారు. వారు యెహోవాకు ప్రమాణాలు చేస్తారు. వారు ఆ ప్రమాణాలను నిలబెట్టుకొంటారు. 22 ఈజిప్టు ప్రజలను యెహోవా శిక్షిస్తాడు. మరియు అప్పుడు ఆయన వారిని స్వస్థపరుస్తాడు. (క్షమిస్తాడు) వారు యెహోవా దగ్గరకు తిరిగి వస్తారు. యెహోవా వారి ప్రార్థనలు వింటాడు, వారిని స్వస్థపరుస్తాడు. (క్షమిస్తాడు).
23 ఆ కాలంలో ఈజిప్టు నుండి అష్షూరుకు రాజమార్గం ఉంటుంది. అప్పుడు ప్రజలు అష్షూరు నుండి ఈజిప్టు వెళ్తారు, ఈజిప్టు నుండి ప్రజలు అష్షూరు వెళ్తారు. ఈజిప్టు అష్షూరుతో కలిసి పనిచేస్తుంది. 24 ఆ కాలంలో ఇశ్రాయేలు, అష్షూరు, ఈజిప్టు కలిసి దేశాన్ని తమ ఆధీనంలో ఉంచుకొంటారు. ఇది దేశానికి ఆశీర్వాదం. 25 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ దేశాలను ఆశీర్వదిస్తాడు. “ఈజిప్టూ, మీరే నా ప్రజలు అష్షూరూ, నిన్ను నేను సృష్టించాను. ఇశ్రాయేలూ, నీవు నా స్వంతం. మీరంతా ఆశీర్వదించబడిన వాళ్లు” అని ఆయన అంటాడు.

* 19:15: ఈ … కాండాలు యెషయా 9:14-15 చూడండి.
† 19:18: నాశన పట్టణం ఈ పేరు “సూర్య పట్టణము” అనే అర్థంగల పేరులాంటిది. ఇది బహుశాః ఓను పట్టణం కావచ్చు.