గోమెరును బానిసత్వంనుండి హోషేయ తిరిగి కొనటం
3
అప్పుడు యెహోవా నాతో, “గోమెరుకు చాలా మంది విటులు ఉన్నారు. కాని నీవు ఆమెను ప్రేమిస్తూనే ఉండాలి. ఎందుచేతనంటే అది యెహోవా చేసినట్టుగా ఉంటుంది. యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ప్రేమిస్తూనే ఉన్నాడు. కాని వారు ఇతర దేవతలను పూజిస్తూనే ఉన్నారు. మరియు ఎండుద్రాక్షల అడలు తినటం వారికి ఇష్టం” అని మరల నాతో చెప్పాడు.
కనుక, గోమెరును పదునయిదు తులాల వెండి, తొమ్మిది తూముల యవలు ఇచ్చి నేను కొన్నాను. కాబట్టి నేను ఆమెతో, “చాలా రోజులు నీవు నాతో కలసి ఇంటి వద్దనే ఉండాలి. నీవు వేశ్యలా ఉండకూడదు. నీవు మరో పురుషునితో పడుకో కూడదు. నేను నీకు భర్తగా ఉంటాను” అని చెప్పాను.
అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజుగాని, ఒక నాయకుడు గాని లేకుండా అనేక రోజులు కొనసాగుతారు. ఒక బలి అర్పణగాని లేక ఒక స్మారకశిలగాని లేకుండా ఉంటారు. వారికి ఏఫోదుగాని లేక గృహ దవతలు గాని ఉండవు. దీని తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వెనుకకు వస్తారు. వారు వారి దేవుడైన యెహోవా కోసం, వారి రాజైన దావీదు కోసం వెతుకుతారు. చివరి దినాల్లో వారు యెహోవానూ, ఆయన మంచితనాన్నీ గౌరవిస్తారు.