36
“కనుక బెసలేలు, అహోలియాబు, ఇంకా నైపుణ్యంగల పురుషులందరూ యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నీ చేస్తారు. ఈ పరిశుద్ధ స్థలం నిర్మించేందుకు అవసరమైన వాటిన్నింటినీ చేయటానికి అవసరమైన జ్ఞానం, అవగాహన దేవుడు ఈ మనుష్యులకు ఇచ్చాడు.”
తర్వాత బెసలేలును, అహోలియాబను, యెహోవా నైపుణ్యాన్ని ఇచ్చిన ఇతర నిపుణులను మోషే పిలిచాడు. పనిలో సహాయం చేయాలని వీళ్లంతా వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు కానుకగా తెచ్చిన వస్తువులన్నింటినీ మోషే ఈ మనుష్యులకు ఇచ్చాడు. పవిత్ర గుడారం నిర్మించడానికి వీటన్నింటినీ వారు ఉపయోగించారు. ప్రతి ఉదయం ప్రజలు కానుకలు తెస్తున్నారు. చివరకు నిపుణలైన పని వాళ్లు ఒక్కొక్కరు, ఆ పవిత్ర స్థలంలో వారు చేస్తున్న పని విడిచి పెట్టి, మోషేతో మాట్లాడటానికి వెళ్లారు. “ప్రజలు కానుకలను విపరీతంగా తెచ్చేసారు. గుడారం పని ముగించడానికి కావలసిన దానికంటే మా దగ్గర ఎక్కువే ఉంది” అన్నారు వారు.
అప్పుడు, “ఇంక ఏ స్త్రీగాని, పురుషుడుగాని గుడారం కోసం ఏ విధమైన కానుకా తీసుకురాకూడదు” అని బస అంతటికీ మోషే కబురు చేసాడు. పవిత్ర స్థలానికి అవసరమైన దానికంటే ఎక్కువ వస్తువులను ప్రజలు సిద్ధం చేసారు.
పవిత్ర గుడారం
అప్పుడు నిపుణులు పవిత్ర గుడారం తయారు చేయటం మొదలు పెట్టారు. నీలం, ఎరుపు సన్నని నారబట్టతో పది తెరలు వారు చేసారు. రెక్కలు గల కెరూబుల చిత్రాలను ఆ బట్ట మీద వారు కుట్టి పెట్టారు. ప్రతి తెరా ఒకే కొలత. అది 14 గజాలు పొడువు, 2 గజాల వెడల్పు. 10 అయిదు తెరలు కలిపి ఒక భాగంగాను మిగిలిన అయిదు ముక్కలు కలిపి మరో భాగంగాను కలపబడ్డాయి. 11 తర్వాత మొదటి అయిదు తెరల భాగానికి బట్ట అంచు వెంబడి నీలం గుడ్డతో ఉంగరాలు చేస్తారు. మరో అయిదు ముక్కల భాగానికి కూడ అలానే చేస్తారు. 12 ఒక భాగంలో చివరి తెర మీద 50 ఉంగరాలు మరో భాగంలో చివర తెర మీద 50 ఉంగరాలు ఉన్నాయి. ఈ ఉంగరాలు ఒక దానికి ఒకటి ఎదురెదురుగా ఉన్నాయి. 13 అప్పుడు వారు 50 బంగారు ఉంగరాలు చేసారు. రెండు తెరలను ఒకటిగా కలిపేందుకు ఈ బంగారు ఉంగరాలను వారు ఉపయోగించారు. అందుచేత గుడారం మొత్తం పవిత్ర స్థలంగా కలపబడింది.
14 అప్పుడు పవిత్ర గుడారం పైకప్పు కోసం మేక వెంట్రుకలతో 11 తెరలను పనివారు తయారు చేసారు. 15 మొత్తం 11 తెరలు ఒకే కొలత గలవి. వాటి పొడువు 15 గజాలు వెడల్పు 2 గజాలు. 16 అయిదు తెరలను ఒక భాగంగా కలిపి కుట్టారు. పనివాళ్లు తర్వాత ఆరు తెరలను మరో భాగంగా కలిపి కుట్టారు. 17 మొదటి భాగంలోని చివరి తెర అంచుకు 50 ఉంగరాలు అమర్చారు. మరో భాగంలోని చివరి తెర అంచుకు 50 ఉంగరాలు అమర్చారు. 18 ఈ రెండు భాగాలను ఒక్కటిగా కలిపేందుకు 50 ఇత్తడి కొలుకులను పనివారు తయారు చేసారు. 19 తర్వాత గుడారానికి ఇంకా రెండు పై కప్పులను వారు తయారు చేసారు. ఒక పై కప్పు ఎరుపు రంగు వేసిన గొర్రె చర్మంతోను, మరొకటి నాణ్యమైన తోలుతోను చేయబడ్డాయి.
20 తర్వాత తుమ్మ కర్రతో పనివారు పలకలు చేసారు. 21 ఒక్కో పలక పొడవు 15 అడుగులు వెడల్పు 27 అంగుళాలు. 22 ఒక్కో పలక అడుగున పక్క పక్కగా రెండు కొక్కీలు ఉన్నాయి. పవిత్ర గుడారపు పలకల్లో ప్రతి ఒక్కటీ ఇలాగే చేయబడింది. 23 గుడారం దక్షిణ భాగానికి 20 చట్రాలను వారు తయారు చేసారు. 24 ఆ తర్వాత ఈ 20 చట్రాల కింద పెట్టడానికి 40 వెండి దిమ్మలను వారు చేసారు. ప్రతి పలకకీ రెండేసి దిమ్మలు ఉన్నాయి. ఒక్కో బల్ల కింద ప్రతి పక్కా కర్రలు, ఒక దిమ్మ. 25 గుడారం అవతలి వైపుకు (ఉత్తరం వైపు) కూడా వారు 20 పలకలు చేసారు. 26 ఒక్కో చట్రం కిందా రెండేసి చొప్పున 40 వెండి దిమ్మలు అతడు చేసాడు. 27 పవిత్ర గుడారం వెనుక భాగానికి (పడమటి వైపున) ఆరు పలకలు అతడు చేసాడు. 28 పవిత్ర గుడారం వెనుక వైపు మూలలకు రెండు చట్రాలు అతడు చేసాడు. 29 ఈ చట్రాలు అడుగు భాగాన కలిపి బిగించబడ్డాయి. పై భాగాన అది జతచేయబడ్డ ఉంగరంలో అమర్చబడ్డాయి. ప్రతి మూలకూ అతడు ఇలాగే చేసాడు. 30 కనుక పవిత్ర గుడారం పశ్చిమాన 8 చట్రాలు, 16 వెండి దిమ్మలు అంటే ఒక్కో చట్రం కింద రెండేసి దిమ్మలు ఉన్నాయి.
31 తర్వాత అతడు తుమ్మ కర్రతో అడ్డ కర్రలు చేసాడు — పవిత్ర గుడారం మొదటి పక్కకు 5 అడ్డ కర్రలు, 32 పవిత్ర గుడారం రెండో పక్కకు 5 అడ్డ కర్రలు, గుడారం వెనుక పక్కకు 5 అడ్డ కర్రలు. 33 ఒక్కో చట్రంలోనుంచి దూరి అన్ని చట్రాల గుండా అమర్చబడేటట్టు మధ్య అడ్డ కర్రను అతడు చేసాడు. 34 ఈ చట్రాలను బంగారంతో అతడు తాపడం చేసాడు. అడ్డ కర్రలను పట్టి ఉంచేందుకు బంగారు ఉంగరాలను అతడు చేసాడు.
35 తర్వాత అతి పవిత్ర స్థలం యొక్క ప్రవేశ ద్వారానికి తెరను వారు చేయటానికి నాణ్యమైన సన్నని నారబట్ట, నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణపు బట్ట వారు ఉపయోగించారు. నాణ్యమైన బట్టమీద కెరూబుల చిత్రాలను అతడు కుట్టాడు. 36 తుమ్మ కర్రతో నాలుగు స్తంభాలు చేసి వాటికి బంగారం తాపడం చేసారు. ఆ స్తంభాలకు బంగారు కొక్కీలు వారు చేసారు. ఆ స్తంభాలకు నాలుగు వెండి దిమ్మలను వారు చేసారు. 37 తర్వాత గుడారం ప్రవేశ ద్వారానికి ఒక తెరను వారు తయారు చేసారు. నాణ్యమైన బట్ట, నీలం, ధూమ్ర వర్ణం, ఎరుపు బట్టను వారు ఉపయోగించారు. ఆ బట్ట మీద చిత్ర పటాల బుటాపని వారు చేసారు. 38 తర్వాత ఈ తెరకోసం అయిదు స్తంభాలు, కొక్కీలు వారు చేసారు. స్తంభాల శిఖరాలకు, తెరల కడ్డీలకు అతడు బంగారు తాపడం చేసాడు. స్తంభాలకు అయిదు ఇత్తడి దిమ్మలను వారు చేసారు.