ప్రముఖ సముద్ర వ్యాపార కేంద్రంగా-తూరు
27
మరొకసారి యెహోవా వాక్కు నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, తూరును గురించి ఈ విషాద గీతం పాడుము. తూరును గురించిన ఈ విషయాలు తెలియజేయుము:
“‘తూరూ, నీవు సముద్రాలకు ద్వారం వంటిదానవు.
అనేక దేశాలకు నీవు వ్యాపారివి.
తీరం వెంబడి నీవనేక దేశాలకు ప్రయాణం చేస్తావు.
నిన్ను గూర్చి నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
తూరూ, నీవు చాలా అందమైన దానివని నీవనుకుంటున్నావు.
నీవు చక్కని సుందరాంగివని తలపోస్తున్నావు!
మధ్యధరా సముద్రం నీ నగరం చుట్టూ సరిహద్దు.
నిన్ను నిర్మించిన వారు నిన్ను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు!
నీ నుండి ప్రయాణమై వెళ్లే ఓడలవలె నీవు ఉన్నావు.
నీ నిర్మాణపు పనివారు శెనీరు (హెర్మోను కొండ) నుండి
తెచ్చిన తమాల వృక్షపు కర్రతో (ఓడ) బల్లలు తయారుచేశారు.
లెబానోను సరళవృక్షపు కర్రతో
నీ ఓడ స్తంభాలను చేశారు.
బాషాను నుండి తెచ్చిన సింధూర వృక్షపు కర్రతో
పడవ తెడ్లు చేశారు.
కిత్తీయుల ద్వీపం (సైప్రస్) నుండి తెచ్చిన దేవదారు వృక్షపు కర్రను వినియోగించి
అడుగు అంతస్థులో గదిని నిర్మించారు.
ఈ గదిని దంతపు పనితో అలంకరించారు.
ఈజిప్టు నుండి తెచ్చిన రంగు రంగుల నారబట్టలు నీ తెరచాపలుగా ఉపయోగించారు.
ఆ తెరచాపయే నీ పతాకం.
నీ గది తెరలు నీలం, ఊదా రంగులను కలిగి ఉన్నాయి.
అవి ఎలిషా (సైప్రస్)* ద్వీపంనుండి వచ్చినవి.
దోనూ, అర్వదూ నివాసులు నీ కొరకు నీ పడవలు నడిపారు.
తూరూ, నీ వారిలో తెలివి గలవారు నీ ఓడలకు చుక్కాని పట్టారు.
బిబ్లోసు (గెబలు) పెద్దలు, నేర్పరులైన పనివారు ఓడమీద ఉండి
చెక్కల మధ్య కీలువేసి ఓడను బాగుచేశారు.
సముద్రం మీదనున్న అన్ని ఓడలు, వాటి నావికులు
నీతో వర్తక వ్యాపారాలు చేయటానికి నీ వద్దకు వచ్చారు.’
10 “పారసీకులు (పర్షియావారు), లూదు వారు, పూతువారు నీ సైన్యంలో ఉన్నారు. వారు నీ యుద్ధ వీరులు. వారు తమ డాళ్లను, శిరస్త్రాణాలను నీ గోడలకు వేలాడదీశారు. వారు నీ నగరానికి ప్రతిష్ఠను తెచ్చి పెట్టారు. 11 నీ నగరం చుట్టూ అర్వదు మనుష్యులు కాపలాదారులుగా నిలబడియున్నారు. బురుజులలో గామదు మనుష్యులు ఉన్నారు. నీ నగరం చుట్టూ వాళ్లు తమ డాళ్లను వ్రేలాడదీసియున్నారు. వాళ్లు నీ సౌందర్యాన్ని సంపూర్ణముగా చేశారు.
12 “తర్షీషు నీకున్న మంచి ఖాతాదారులలో ఒకటి. నీవు అమ్మే అద్భుతమైన వస్తువులకు వారు వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చేవారు. 13 గ్రీకేయులు, టర్కీ (తుబాలువారు) మరియు నల్ల సముద్రపు (మెషెకు) ప్రాంత ప్రజలు నీతో వ్యాపారం చేశారు. నీవు అమ్మే సరుకులకు వారు బానిసలను, కంచును ఇచ్చేవారు. 14 తోగర్మా ప్రజలు నీవు అమ్మిన వస్తువులకు గుర్రాలను, యుద్ధాశ్వాలను, కంచర గాడిదలను ఇచ్చేవారు. 15 దదాను ప్రజలు నీతో వ్యాపారం చేశారు. నీవు నీ సరుకులను అనేకచోట్ల అమ్మావు. నీ సరుకులకు మూల్యంగా వారు ఏనుగు దంతాలు, విలువగల కోవిదారు కలపను ఇచ్చేవారు. 16 నీవద్ద అనేక మంచి వస్తువులు ఉన్న కారణంగా ఆరాము నీతో వ్యాపారం చేసింది. నీవు అమ్మే సరుకులకు ఎదోము ప్రజలు పచ్చమణులు, ఊదారంగు బట్టలు, సున్నితమైన అల్లిక పనిచేసిన వస్త్రాలు, నాజూకైన నారబట్టలు, పగడాలు, కెంపులు ఇచ్చేవారు.
17 “యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు నీతో వర్తకం చేశారు. వారు నీవద్ద కొనే సరుకులకు గోధుమ, ఆలివులు ముందు వచ్చే అత్తిపళ్లు, తేనె, నూనె, గుగ్గిలం యిచ్చేవారు. 18 దమస్కు నీకు మరో మంచి ఖాతా దారు. నీవద్ద ఉన్న అనేక అద్భుత వస్తువులను వారు కొనుగోలు చేశారు. ప్రతిగా వారు హెల్బోను నుండి తెచ్చిన ద్రాక్షారసాన్ని, తెల్ల ఉన్నిని నీకిచ్చేవారు. 19 నీవమ్మే సరుకులకు దమస్కువారు ఉజాల్ నుండి తెచ్చిన ద్రాక్షారసాన్ని నీకిచ్చేవారు. వాటిని ఇనుము, కసింద మూలిక, చెరకును వారు కొన్న వస్తువులకు మారుగా ఇచ్చేవారు. 20 వ్యాపారం ముమ్మరంగా సాగటానికి దదాను దోహద పడింది. వారు గుర్రపు గంతపై వేసే బట్టను, స్వారీ గుర్రాలను నీకిచ్చి సరుకులు కొనేవారు. 21 అరబీయులు (అరేబియావారు) కేదారు నాయకులు నీకు గొర్రె పిల్లలను, పొట్లేళ్లను, మేకలను ఇచ్చి నీవద్ద ఉన్న సరుకులు కొనేవారు. 22 షేబ దేశపు వర్తకులు, రామా ప్రాంత వర్తకులు నీతో వ్యాపారం చేశారు. నీ వస్తువులకు వారు మిక్కిలి శ్రేష్ఠమైన సుగంధ ద్రవ్యాలు, నానారకాల విలువైన రాళ్లు, బంగారం ఇచ్చేవారు. 23 హారాను, కన్నే, ఏదెను, షేబ, అష్షూరు మరియు కిల్మదు దేశాల ప్రజలు, వర్తకులు నీతో వ్యాపారం చేశారు. 24 నీవద్ద కొన్న సరుకులకు వారు నాణ్యమైన వస్త్రాలు, నీలవర్ణపు, అల్లిక పనిచేసిన దుస్తులు, రంగు రంగుల తివాచీలు, బాగా పురిపెట్టి వేనిన తాళ్ళు, దేవదారు కలపతో చేయబడిన అనేక వస్తువులు ఇచ్చేవారు. ఈ వస్తు సామగ్రులతో వారు నీతో వ్యాపారం చేశారు. 25  నీవు అమ్మిన సరుకులు తర్షీషు ఓడలు మోసుకుపోయేవి.
“తూరూ! నీవు సరుకులతో నిండిన ఓడలాంటి దానివి.
నీవు సముద్రం మీద అనేకమైన విలువగల సరుకులతో ఉన్నదానివి.
26 నీ పడవలను నడిపిన నావికులు నిన్ను మహా సముద్రాల మధ్యగా తీసుకొని వెళ్తారు.
కాని బలమైన తూర్పు గలులు నీ ఓడను నడిసముద్రంలో నాశనం చేస్తాయి.
27 నీ ధనమంతా సముద్రం పాలవుతుంది.
నీ ఐశ్వర్యం, నీ వర్తకం, నీ సరుకు, నీ నావికులు, చుక్కాని పట్టేవారు,
కీలుపెట్టి పడవలు బాగుచేసే పనివారు, నీ అమ్మకపు దారులు, నీ నగరంలో గల సైనికులు, నీ ఓడ సిబ్బంది అంతా
సముద్రంలో మునిగిపోతారు!
నీవు నాశనమయ్యే రోజున
ఇదంతా జరుగుతుంది.
28 “నీ వ్యాపారులను నీవు బహుదూర ప్రాంతాలకు పంపిస్తావు.
అయితే నీ ఓడ చుక్కాని పట్టేవాని రోదన విన్నప్పుడు ఆ ప్రాంతాలు భయంతో పణకిపోతాయి!
29 నీ ఓడ సిబ్బంది అంతా ఓడ నుండి దుముకుతారు.
నీ నావికులు, చుక్కాని పట్టేవారు. వారు ఓడ నుండి దుమికి ఒడ్డుకు ఈదుతారు.
30 వారు నిన్ను గురించి చాలా బాధపడతారు.
వారు రోదిస్తారు. వారు తమ తలలపై దుమ్ము పోసు కుంటారు. వారు బూడిదలో పొర్లాడుతారు.
31 నీ కొరకు వారు తమ తలలు గొరిగించు కుంటారు.
వారు విషాద సూచక దుస్తులు ధరిస్తారు.
వారు నీకొరకు దుఃఖిస్తారు.
మృతుడైన వ్యక్తి కొరకు ఏడ్చేవానిలా వారు శోకిస్తారు.
32 “వారి భయంకర రోదనలో, ఈ విషాద గీతం వారు ఆలపిస్తూ నీకొరకు విలపిస్తారు,
“‘తూరు వంటిది మరొక్కటి లేదు!
నడి సముద్రంలో తూరు నాశనమయ్యింది!
33 నీ వ్యాపారులు సముద్రాల మీద పయనించారు.
నీ మహా సంపదతోను, నీవు అమ్మిన సరుకులంతోను నీవనేక మందిని తృప్తిపర్చావు.
ఈ భూమిపై గల రాజులను నీవు ఐశ్వర్యవంతులుగా చేశావు!
34 కాని నీవు నడిసముద్రంలో,
అగాధంలో ముక్కలై పోయావు.
నీవు అమ్మే వస్తువులతో పాటు
నీ మనుష్యులందరూ కూలిపోయారు!
35 రవాసులంతా నీ విషయంలో అదిరి పోయ్యారు.
వారి రాజులు తీవ్రంగా భయపడ్డారు.
వారి రాజులు తీవ్రంగా భయపడ్డారు.
వారి ముఖాలు చిన్న బోయాయి.
36 ఇతర రాజ్యాల వర్తకులు నిన్ను చూసి చులకనగా మాట్లాడారు.
నీకు జరిగిన సంఘటనలు ప్రజలను భయభ్రాంతులను చేశాయి.
ఎందువల్ల నంటే నీవు సర్వనాశనమయ్యావు.
నీవికలేవు.’”

* 27:7: సైప్రస్ ఎలీషా ద్వీపం ఎంకోమావద్ద గల ప్రాంతం గాని, సైప్రస్ గాని, లేక ఒక గ్రీకు ద్వీపం గాని కావచ్చు.
† 27:12: తర్షీషు ఇది స్పెయిన్‌లో ఒక నగరం కావచ్చు.