ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంచారం చేయటం
2
1 “అప్పుడు మనం తిరిగి ఎర్రసముద్ర మార్గంలో అరణ్యంలోనికి ప్రయాణం చేసాము. మనంచేయవ లెనని యెహోవా నాతో చెప్పింది అదే. చాలా రోజుల వరకు మనం శేయారు కొండ దేశం గుండా వెళ్లాము.
2 అప్పుడు నాతో యెహోవా అన్నాడు:
3 ‘మీరు ఈ కొండ దేశంగుండా చాలా తిరిగారు. ఉత్తర దిశగా తిరగండి.
4 మరియు మీకు ఇలా చెప్పమని ఆయన నాతో చెప్పాడు: మీరు శేయీరు దేశం గుండా దాటిపోతారు. ఈ దేశం మీ బంధువులైన ఏశావు సంతతివారికి చెందినది. వారు మీకు భయపడతారు. చాలా జాగ్రతగా ఉండండి.
5 వారితో యుద్ధం చేయ కండి. వారి దేశంలో ఏమాత్రం ఒక్క అడుగు కూడ నేను మీకు యివ్వను. ఎందుకంటే శేయీరు కొండ దేశాన్ని ఏశావుకు స్వంతంగా ఉండేందుకు నేను యిచ్చాను.
6 అక్కడ మీరు తినే భోజనానికిగాని తాగే నీటికిగాని మీరు ఏశావు ప్రజలకు వెల చెల్లించాలి.
7 మీరు చేసిన ప్రతిదానిలోనూ మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించాడని జ్ఞాపకం ఉంచుకోండి. ఈ మహా ఎ డారిలో మీరు నడవటం ఆయనకు తెలుసు. ఈ 40 సంవత్సరాలు మీ దేవుడైన యెహోవా మీతో ఉన్నాడు గనుక మీకు అవసరమైనవి అన్నీ ఎల్లప్పుడూ మీకు దొరికాయి’
8 “కనుక శేయీరులో నివసించే మన బంధువులైన ఏశావు ప్రజలను మనం దాటిపోయాము. ఎలాతు, ఎసియోను గెబరు పట్టణాల నుండి యోర్దాను వెళ్ళే మార్గాన్ని మనం విడిచిపెట్టాం. మనం మళ్లుకొని మోయాబు అరణ్యానికి పోయే మార్గం మీద వెళ్లాము.
ఆర్ వద్ద ఇశ్రాయేలీయులు
9 “యెహోవా నాతో చెప్పాడు: ‘మోయాబు ప్రజలను తొందర పెట్టవద్దు. వారితో యుద్ధం ప్రారంభించవద్దు, వారి దేశంలో ఏ మాత్రం భూమి నేను మీకు యివ్వను. వారు లోతు సంతతివారు, ఆరు పట్టణాన్ని నేను వారికి యిచ్చాను.’”
10 ఇంతకు ముందు ఎమీము ప్రజలు ఆర్‌లో నివసించారు. వారు బలాఢ్యులు, వారు చాలమంది ఉన్నారు. అనాకీము ప్రజల్లాగే వారు చాలా ఎత్తయినవాళ్లు.
11 అనాకీయుల్లాగే ఎమీము కూడ రెఫాయిము ప్రజల్లో ఒక భాగం అనిచెప్పబడింది. కానీ మోయాబీ ప్రజలు వారిని ఎమీయులు అని పిల్చారు.
12 హోరీ ప్రజలు కూడ ఇంతకు ముందు శేయీరులో నివసించారు, కానీ ఏశావు ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకొన్నారు. హోరీయులను ఏశావు ప్రజలు నాశనం చేసారు. అప్పుడు హోరీయులు అంతకు ముందు నివసిచిన చోట ఏశావు ప్రజలు నివసించారు. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా స్వంతంగా యిచ్చిన దేశంలోని ప్రజలకు ఇశ్రాయేలీయులు చేసినట్టు వారు అక్కడ ఉన్నవారికి చేసారు.
13 “యెహోవా నాతో చెప్పాడు: ‘ఇప్పుడు లేచి, జెరెదు వాగు దాటి వెళ్లండి.’ కనుక మనం జెరెదువాగు దాటివెళ్లాం.
14 మనం కాదెషు బర్నెయ విడిచి జెరెదు వాగు దాటునప్పటికి 38 సంవత్సరాలు పట్టింది. ఆ తరం యుద్ధ వీరులంతా చనిపోయారు. ఇలా జరుగుతుందని యెహోవా చెప్పాడు.
15 ఆ మనుష్యులు అందరూ గతించి పోయేవరకు యెహోవా వారికి విరోధంగానే ఉన్నాడు.
16 “యుద్ధ వీరులంతా చనిపోయి ప్రజల మధ్య లేకుండా గతించిపోయిన తర్వాత
17 యెహోవా నాతో ఇలా చెప్పాడు:
18 ‘ఈ వేళ మీరు సరిహద్దు ఆర్‌వద్ద దాటి మోయాబులోనికి వెళ్లాలి.
19 మీరు అమ్మోనీయులను సమీపించి నప్పుడు వారిని తొందర పెట్టవద్దు, వారితో యుద్ధం చేయవద్దు, ఎందుకంటే వారి దేశం నేను మీకు యివ్వను. ఎందుకంటే వారు లోతు సంతానం. వారు స్వంతంగా ఉంచుకొనేందుకు ఆ దేశాన్ని నేను వారికి యిచ్చాను.’”
20 (ఆ దేశం రెఫాయిము ప్రజల దేశం అనికూడ చెప్పబడింది అంతకు ముందు అక్కడ నివసించిన ప్రజలు వారు, అమ్మోనీయులు వారిని “జంజుమ్మీలు” అని పిలిచేవాళ్లు.
21 జంజుమ్మీ ప్రజలు చాలా బలం గలవారు, వాళ్లు చాలామంది ఉన్నారు. అనాకీము ప్రజల్లా వారు చాలా ఎత్తయిన మనుషులు. కానీ జంజు మ్మీలను నాశనం చేసేందుకు యెహోవా అమోరీయులకు సహాయంచేశాడు. అమ్మోనీయులు జంజుమ్మీల దేశాన్ని స్వాధీనం చేసుకొని యిప్పుడు అక్కడ నివసిస్తున్నారు.
22 శేయీరులో నివసించే ఏశావు ప్రజలకు (ఎదోమీలు) దేవుడు అలాగే చేశాడు. వారు అక్కడ నివసించే హోరీయులను నాశనం చేశారు. ఇంతకు ముందు హొరీయులు నివసించిన చోట యిప్పటికీ ఏశావు ప్రజలు నివసిస్తున్నారు.
23 క్రేతు ప్రజలలో కొందరికి దేవుడు అలాగే చేశాడు. గాజా చుట్టు పక్కల పట్టణాల్లో ఆవీయ ప్రజలు నివసించారు. అయితే క్రేతునుండి కొందరు ప్రజలు వచ్చి ఆవీయ ప్రజలను నాశనం చేశారు. క్రేతునుండి వచ్చిన ఆ ప్రజలు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని, ఇప్పుడు అక్కడ నివసిస్తున్నారు.)
అమ్మోరీయులతో యుద్ధం
24 “యెహోవా నాతో యిలా చెప్పాడు: ‘ప్రయాణానికి సిద్ధపడండి. అర్నోను నది లోయ దాటి వెళ్లండి. హెష్బోను రాజు. అమ్మోరీవాడగు సీహోను మీద నేను మీకు శక్తినిస్తాను. అతని దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు నేను మీకు శక్తిని యిస్తున్నాను. కనక అతనితో యుద్ధంచేసి, అతని దేశాన్ని స్వాధీనం చేనుకోవటం మొదలుపెట్టండి.
25 ప్రపంచంలోని ప్రజలంతా మీ విషయం భయపడేలా చేయటం నేను ఈ వేళ ప్రారంభిస్తాను. మిమ్మల్ని గూర్చిన సమాచారం వారు విని, భయంతో వణకిపోతారు. వారు మిమ్మల్ని గూర్చి తలచినప్పుడు వాళ్లు భయంతో వణికిపోతారు.’
26 “కెదెమోతు అరణ్యంనుండి హెష్బోను రాజైన సీహోను దగ్గరకు నేను వార్తాహరులను పంపించాను. వారు సీహోనుకు శాంతి ఒడంబడిక సమాచారం తెలిపారు. వారు చెప్పారు:
27 ‘నీ దెశంగుండా మమ్మల్ని వెళ్లనివ్వు. మేము మార్గంలోనే నిలిచి ఉంటాము. మార్గంనుండి కుడికిగాని, ఎడమకుగాని మేము తొలగము.
28 మేము తినే భోజనానికి, తాగే నీళ్లకు వెండి నీకు చెల్లిస్తాము. మేము నీ దేశంలోనుండి నడచి వెళ్తాము, అంతే.
29 మా దేవుడైన యెహోవా మాకు యిస్తున్న దెశంలో ప్రవేశించేందుకే మేము యోర్దాను నది దాటేంతవరకు మమ్మల్ని నీ దేశంలోనుంచి వెళ్ల నివ్వు. ఇతరులు, అంటే శేయీరులో నివసించే ఏశావు ప్రజలు, ఆర్‌లో నివసించే మోయాబు ప్రజలు వారి దేశంగుడా మమ్మల్ని వెళ్లనిచ్చారు.’
30 “కానీ హెష్బోను రాజైన సీహోను తన దేశంలోంచి మమ్మల్ని పోనివ్వలేదు. మీ దేవుడైన యెహోవా అతణ్ణి చాలా మొండికెత్తేటట్టు చేసాడు. సీహోను రాజును మీ అధికారంక్రింద ఉంటానికే యెహోవా ఇలా చేసాడు. ఇప్పుడు ఆయన దీనిని జరిగించాడు.
31 “సీహోను రాజును, ‘అతని దేశాన్ని నేను మీకు యిస్తున్నాను. ఇప్పుడు దేశాన్ని స్వాధీనం చేసుకోండి’ అని యెహోవా నాకు చెప్పాడు.
32 “అప్పుడు యాహసు దగ్గర మాతో యుద్ధం చేయటానికి సీహోను రాజు, ఆతని ప్రజలందరు బయల్దేరి వచ్చారు.
33 అయితే మన యెహోవా దేవుడు అతణ్ణి మనకు అప్పగించాడు. అతణ్ణి, అతని కుమారులను, ఆతని ప్రజలందరిని మనం ఓడించాము.
34 అప్పట్లో సీహోను రాజుకు చెందిన పట్టణాలన్నింటినీ మనం పట్టుకొన్నాము. ప్రతి పట్టణంలో పురుషులను, స్త్రీలను, పిల్లలను ప్రజలందరినీ మనం పూర్తిగా నాశనం చేసాము. ఎవ్వరినీ మనం బతకనియ్యలేదు.
35 మనం పట్టుకొన్న పట్టణాల్లో పశువులను, విలువైన వస్తువులను మాత్రమే మనం తీసుకొన్నాము.
36 అర్నోను లోయ అంచులోని అరోయేరు పట్టణాన్ని, ఆ లోయ మధ్యలో ఉన్న మరో పట్టణాన్ని మనం ఓడించాము. అర్నోను లోయ, గిలాదుమధ్య ఉన్న పట్టాణాలన్ని మనం ఓడించేటట్టు చేసాడు యెహోవా. ఏ పట్టణం కూడా మన యెదుట నిలువలేకపోయింది.
37 కానీఅమ్మోనీయుల దగ్గరకు కూడ మీరు వెళ్లలేదు. యబ్బోకు నదీ తీరాలకుగాని, కొండ దేశంలోని పట్టణాలకుగాని మీరు వెళ్లలేదు. మన దేవుడైన యెహోవా మనకు ఇవ్వని ఏ స్థలం దగ్గరకూ మీరు వెళ్లలేదు.”