నాతాను దావీదుతో మాట్లాడటం
12
యెహోవా నాతాను ప్రవక్తను దావీదు వద్దకు పంపాడు. నాతాను దావీదు వద్దకు వచ్చి ఇలా చెప్పాడు: “ఒక నగరంలో ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకడు ధనవంతుడు. రెండవవాడు దరిద్రుడు. ధనవంతుని వద్ద చాలా గొర్రెలు, పశువులు వున్నాయి. కాని పేదవానివద్ధ తాను కొనుక్కున్న ఒక ఆడ గొర్రెపిల్ల తప్ప మరేమీ లేదు. ఆ గొర్రెపిల్లను పేదవాడు సాకాడు. ఆ పేదవానితో పాటు, అతని పిల్లతో పాటు ఆ గొర్రెపిల్ల కూడ పెరిగింది. ఆ గొర్రెపిల్ల పేదవాని కంచంలో తిని, వాని గిన్నెలో నీళ్లు తాగింది. ఆ పేదవాని రొమ్ము మీద గొర్రెపిల్ల పడుకొని నిద్రపోయేది. పేదవానికి ఆ గొర్రెపిల్ల ఒక కూతురిలా వుండేది.
“ఇదిలా వుండగా ఒక యాత్రికుడు ధనవంతుని చూడటానికి ఆ నగరంలో ఆగాడు. ధనికుడు ఆ యాత్రికునికి ఆహారం ఇవ్వపోయాడు. కాని ఆ యాత్రికునికి ఆహారంగా తనకున్న గొర్రెలలో గాని, పశువులలో గాని దేనినీ చంపటానికి ధనికుడు ఇష్టపడలేదు. దానికి బదులు, ధనికుడు ఆ నగరంలో ఉన్న పేదవాని గొర్రెపిల్లను తీసుకొని, చంపి ఆ యాత్రికునికి ఆహారంగా వండించాడు.”
ఇది వింటున్న దావీదుకు ధనికునిపై విపరీతంగా కోపం వచ్చింది. “యెహోవా జీవము తోడుగా ఈ పని చేసిన ఆ వ్యక్తి నిశ్ఛయంగా చావవలసిందే! ఆ గొర్రె పిల్ల విలువకు నాలుగింతలు ధనికుడు చెల్లించాలి. ఎందుకంటే వాడు ఈ భయంకరమైన పని చేశాడు. పైగా వాడు దయలేనివాడు!” అని దావీదు నాతానుతో అన్నాడు.
నాతాను దావీదుతో అతని పాపాన్ని తెలియజెప్పటం
“ఆ వ్యక్తివి నీవే అన్నాడు నాతాను దావీదుతో. ఇశ్రాయేలు దేవుడైన యోహోవా నీ విషయంలో ఇలా అంటున్నాడని నాతాను దావీదుతో చెప్పాడు: నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా నేను అభిషిక్తం చేశాను. సౌలునుండి నిన్ను కాపాడాను. అతని కుటుంబాన్ని, భార్యలను నీవు తీసుకొనేలా చేశాను. పైగా ఇశ్రాయేలు పైన, యూదా పైన రాజుగా నియమించాను. ఇవన్నీ చాలవన్నట్లు, నీకు ఇంకా చాలా ఉచ్చాను కావున ఎందువల్ల యెహోవా ఆజ్ఞను తిరస్కరించావు? దేవుడు చెడ్డదని చెప్పిన దానిని ఎందుకు చేశావు? హిత్తీయుడైన ఊరియాను నీవు కత్తితో చంపించావు. అతని భార్యను నీ భార్యగా చేసుకున్నావు. అవును; నీవు ఊరియాను అమ్మోనీయుల కత్తితో చంపావు! 10 కావున, కత్తి నీ కుటుంబాన్ని వదిలిపెట్టదు. హిత్తీయుడు ఊరియా భార్యను నీవు చేపట్టావు. ఈ రకంగా నీవు నన్ను లక్ష్య పెట్టలేదని నిరూపించుకున్నావు.”
11 “నేను నీకు ఆపద తీసుకువస్తున్నాను. నీ కుటుంబంలో నుండే ఈ ఆపద వస్తుంది. నీ భార్యలందరినీ నీ నుండి నేను తీసివేసి, నీకు అతి సన్నిహితుడైన వానికొకనికి ఇస్తాను. ఆ వ్యక్తి నీ భార్యలందరితో కలియగా, అది అందరికీ తెలుస్తుంది.* 12 నీవు బత్షెబతో రహస్యంగా కూడినావు. కాని నేను చేసే పని ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలుస్తుంది.”
13 నాతానుతో, “యెహోవా పట్ల నేను పాపం చేశాను” అని దావీదు చెప్పాడు.
అప్పుడు నాతాను దావీదుతో ఇలా అన్నాడు, “యెహోవా నీకు పాపవిమోచనం చేశాడు. నీవు చంపబడవు. 14 కాని నీవు చేసిన ఈ పాపకార్యంవల్ల శత్రువులు నీ యెహోవాని అసహ్యించుకునేలా చేశావు. అందువల్ల నీకు పుట్టిన కుమారుడు చనిపోతాడు.”
దావీదువలన బత్షెబకు పుట్టిన శిశువు మరణించటర
15 పిమ్మట నాతాను ఇంటికి వెళ్లిపోయాడు. ఊరియాభార్య ద్వారా దావీదుకు పుట్టిన బిడ్డ తీవ్రంగా జబ్బు పడేలా యెహోవా చేశాడు. 16 దావీదు బిడ్డ కొరకు దేవుని ప్రార్థించాడు. దావీదు తినటానికి, తాగటానికి నిరాకరించాడు. అతను తన ఇంట్లోకివెళ్లి లోపలే వుండి పోయాడు. రాత్రంతా నేలమీదే పడుకొని వుండిపోయాడు.
17 దావీదు కుటుంబంలో ముఖ్యలైన వారు వచ్చి దావీదును నేలమీద నుండి లేపటానికి ప్రయత్నించారు. కాని దావీదు లేవ నిరాకరించాడు. వారితో కలిసి భోజనం చేయటానికి కూడ దావీదు నిరాకరించాడు. 18 ఏడవ రోజున శిశువు మరణించింది. శిశువు మరణించిందని దావీదుతో చెప్పటానికి సేవకులు భయపడ్డారు. ఒకరితో ఒకరు వారిలా అనుకోసాగారు, “చూడండి, బిడ్డ బతికివుండగా మనం ఆయనతో మాట్లాడాలని ప్రయత్నం చేశాము. కాని ఆయన మన మాట వినలేదు. ఇప్పుడు బిడ్డ మరణం గురించి మనం తెలియ జేస్తే, అతడు తన ప్రాణానికి ముప్పు వాటిల్లే ఏ పనికైనా పాల్పడవచ్చు!”
19 కాని దావీదు తన సేవకులు గుసగుసలాడు కోవటం గమనించి బిడ్డ మరణించి వుండవచ్చని ఊహించాడు. “బిడ్డ చనిపోయాడా?” అని దావీదు సేవకులను అడిగాడు.
“అవును, చనిపోయాడు” అని సేవకులు అన్నారు.
20 దావీదు నేలమీద నుంచి లేచాడు. కాళ్లు చేతులు కడుక్కొని, బట్టలు మార్చుకొని, యెహోవాని ప్రార్థించటానికి ఆలయానికి వెళ్లాడు. తరువాత ఇంటికి వెళ్లి, తినటానికి ఆహారాన్ని అడిగాడు. సేవకులు కొంత ఆహారాన్ని ఇవ్వగా, అతడు తిన్నాడు.
21 దావీదు సేవకులు ఆయనతో ఇలా చెప్పారు, “నీవిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? బిడ్డ బ్రతికి వుండగా నీవు తినటానికి నిరాకరించావు. నీవు ఏడ్చావు. కాని బిడ్డ చనిపోగానే, లేచి భోజనం చేశావు.”
22 అందుకు దావీదు ఇలా చెప్పాడు: “బిడ్డ బతికివుండగా నేను తినలేదు. ఏడ్చాను. ఎందువల్లనంటే యెహోవా నన్ను కనికరించి బిడ్డను బతికించవచ్చు! ఎవరికి తెలుసు! అనుకున్నాను. 23 కాని ఇప్పుడు బిడ్డ చనిపోయాడు. కావున ఇప్పుడు నేనెందుకు తినటానికి నిరాకరించాలి? నేను బిడ్డను తిరిగి బతికించుకొనగలనా? లేదు! ఏదో ఒక రోజున నేనే వాని దగ్గరకు వెళతాను. అంతేగాని వాడు నా వద్దకు తిరిగి రాలేడు.”
సొలొమోను జన్మించటం
24 దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చాడు. అతడామెతో కలిసి వుండి సంగమించగా, ఆమె గర్భవతి అయింది. ఆమెకు మరొక కుమారుడు జన్మించాడు. దావీదు వానికి సొలొమోను అని పేరు పెట్టాడు. యెహోవా సొలొమోనును ప్రేమించాడు. 25 ప్రవక్త నాతాను ద్వారా యెహోవా తన సందేశం పంపాడు. నాతాను వచ్చి సొలొమోనుకు యదీద్యా అని నామకరణం చేశాడు. దేవుని ఆజ్ఞానుసారం నాతాను అలా చేశాడు.
దావీదు రబ్బాను పట్టుకొనటం
26 యోవాబు అమ్మోనీయుల నగరంపై యుద్ధం చేశాడు. అతడు రాజధాని నగరాన్ని పట్టుకున్నాడు. 27 యోవాబు దావీదు వద్దకు దూతలను పంపి ఇలా చెప్పమన్నాడు: “నేను రబ్బాపై యుద్ధం నిర్వహించాను. నేను జలనగరాన్ని పట్టుకున్నాను. 28 ఇప్పుడు నీవు మిగిలిన సైన్యాన్ని కూడగట్టుకొని వచ్చి రబ్బానగరాన్ని ముట్టడించు. దానిని నాకై నేను వశపర్చుకునేలోగా నీవు వచ్చి పట్టుకో. నేను గనుక వశపర్చుకుంటే, ఆ నగరం నా పేరు మీదుగా పిలువబడుతుంది!”
29 దావీదు తన సైన్యాన్ని కూడదీసికొని రబ్బా నగరానికి వెళ్లాడు. యుద్ధం చేసి ఆ నగరాన్ని వశపర్చుకున్నాడు. 30 దావీదు ఆ రాజు తలనుండి§ కిరీటాన్ని తీసుకున్నాడు. అది బంగారు కిరీటం. దాని బరువు సుమారు డెబ్బది అయిదు కాసులు. ఈ కిరీటంలో విలువైన వజ్రాలు పొదగబడ్డాయి. ఆ కిరీటాన్ని సైనికులు దావీదు తలపై వుంచారు. ఆ నగరం నుండి దావీదు అనేక విలువైవ వస్తువులను కొల్లగొట్టుకుపోయాడు.
31 అంతేగాదు, దావీదు రబ్బా నగర వాసులను బయటకు తీసుకొని వచ్చాడు. వారందరినీ రంపములతోను, పలుగులతోను, గొడ్డళ్లతోను పని చేయించాడు. వారందరినీ ఇటుకలతో కట్టడాలను నిర్మించేలా చేశాడు. అమ్మోనీయుల నగరాలన్నిటిలో దావీదు ఇలాగే చేయించాడు. తరువాత దావీదు తన సైన్యంతో యెరూషలేముకు వెళ్లిపోయాడు.

* 12:11: అది అందరికీ తెలుస్తుంది అంటే “పట్టపగలే, బహిర్గతం గానే జరుగుతుందని” శబ్దార్థం.
† 12:12: కాని … తెలుస్తుంది ఇశ్రాయేలు ప్రజల ముందు, సూర్యుని ముందు అని శబ్దార్థం.
‡ 12:25: యదీద్యా యదీద్యా అనగా దేవునికి ప్రియమైనవాడు అని అర్థం.
§ 12:30: రాజు తలనుండి మల్కాము తలనుండి అని కూడ అంటారు. మల్కాము అమ్మోనీయులు ఆరాధించే ఒక బూటకపు దైవం.