యాజకుల ప్రత్యేక వస్త్రాలు
39
పవిత్ర స్థలంలో యాజకులు పరిచర్య చేసేటప్పుడు ధరించే ప్రత్యేక వస్త్రాలు తయారు చేసేందుకు నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్టను పనివారు ఉపయోగించారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం వారు అహరోనుకు గూడ ప్రత్యేక వస్త్రాలు తయారు చేసారు.
ఏఫోదు
బంగారు తీగ, శ్రేష్ఠమైన బట్ట, నీలం, ఎరుపు, ధూమ్రవర్ణం గల బట్టతో అతడు ఏఫోదును చేసాడు. బంగారాన్ని సన్నని రేకులుగా వారు కొట్టారు. తర్వాత బంగారాన్ని పొడవైన తీగలుగా కోసారు. నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్ట, నాణ్యమైన బట్టతో బంగారాన్ని కలిపి కొట్టారు. ఇది చాల నైపుణ్యంగల వాని పని. ఏఫోదుకు భుజభాగాలను వారు చేసారు. ఈ భాగాలు బట్ట అంచులకు బిగించబడ్డాయి. అప్పుడు అన్ని భాగాలు కలిసి కట్టబడ్డాయి. దట్టి కూడ ఆలాగే చేయబడింది అది ఏఫోదులో ఒక భాగంగా ఉండేటట్టు కలుపబడింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే బంగారు తీగ, నాణ్యమైన బట్ట, నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణం బట్టలతో అది చేయబడింది.
రత్నాలను బంగారపు జవలలో పనివాళ్లు పొదిగించారు. ఇశ్రాయేలు కుమారుల పేర్లను వారు రత్నాలపై చెక్కారు. తర్వాత ఏఫోదు భుజ భాగాల మీద రత్నాలను వారు అమర్చారు. ఇశ్రాయేలు కుమారులలో ఒక్కొక్కరికి ఒక్కో రత్నం సూచనగా ఉంది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారమే ఇది చేయబడంది.
న్యాయతీర్పు పైవస్త్రం
తర్వాత న్యాయతీర్పు పైవస్త్రం బెసలేలు చేసాడు. నిపుణుని పనిగా అది చేయబడింది. బంగారు దారాలు, నీలం, ఎరుపు, ధూమ్రవర్ణం బట్టలతో అది చేయబడింది. న్యాయతీర్పు పైవస్త్రం చతురస్రంగా ఉంది, రెండుగా మడత చేయబడింది. దాని పొడవు 9 అంగుళాలు, వెడల్పు 9 అంగుళాలు. 10 తర్వాత పనివాళ్లు అందమైన రత్నాలను నాలుగు వరుసలుగా దాని మీద పెట్టారు. మొదటి వరుసలో మాణిక్యం, గోమేధికం, మరకతం ఉన్నాయి. 11 రెండవ వరుసలో పద్మరాగం, నీలం, సూర్యకాంతమణి వున్నాయి. 12 మూడవ వరుసలో గారుత్మతకం, యష్మురాయి. ఇంద్రనీలం వున్నాయి. 13 నాలుగవ వరుసలో రక్తవర్ణపు రాయి, సులిమానిరాయి, సూర్యకాంతం ఉన్నాయి. ఈ రత్నాలన్నీ బంగారంలో పొదిగించబడ్డాయి. 14 ఒక పనివాడు ఒక ముద్రను చేసినట్టు, ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఈ పన్నెండు రాళ్లమీద చెక్కబడ్డాయి. ఇశ్రాయేలు కుమారులు ఒక్కొక్కరి పేరు ఒక్కో రాయి మీద ఉంది.
15 న్యాయతీర్పు పైవస్త్రం కోసం స్వచ్ఛమైన బంగారంతో ఒక గొలుసు చేయబడింది. అది తాడుతో అల్లిక చేయబడింది. 16 పనివాళ్లు రెండు బంగారు దిమ్మలు, రెండు బంగారు ఉంగరాలు చేసారు. న్యాయ తీర్పు వస్త్రం పైభాగంలోని రెండు మూలల్లో బంగారు ఉంగరాలు రెండు పెట్టారు. 17 తర్వాత బంగారు గొలుసులు రెంటిని న్యాయతీర్పు వస్త్రానికి మూలల్లో రెండు ఉంగరాలకు కట్టారు. 18 బంగారు తాళ్ల అవతలి కొనలను రెండు జవలకు కట్టారు. తర్వాత ఏఫోదు ఎదుట భాగంలోని రెండు భుజాలకు వారు వాటిని బిగించారు. 19 తర్వాత వారు మరి రెండు బంగారు ఉంగరాలు చేసి, ఏఫోదు అడుగు భాగపు రెండు మూలల్లో పెట్టారు. ఏఫోదు దగ్గర లోపలి భాగంలో వారు ఆ ఉంగరాలను పెట్టారు. 20 భుజభాగాల ముందర అడుగు భాగంలో కూడా రెండు బంగారు ఉంగరాలను వారు పెట్టారు. ఏఫోదు దట్టీకి పైగా బిగింపు కూర్పునకు దగ్గరగా ఈ ఉంగరాలు ఉన్నాయి. 21 తర్వాత నీలి (దారంతో అల్లిన బట్ట) దట్టీతో తీర్పు పతకపు ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు కట్టారు. ఈ విధంగా తీర్పు పతకం నడికట్టును హత్తుకొని ఉంది. అది పడిపోదు. యెహోవా ఆజ్ఞాపించినట్లే వాళ్లు ఇవన్నీ చేసారు.
యాజకులకు ఇతర వస్త్రాలు
22 తర్వాత ఏఫోదు అంగీని వారు తయారు చేసారు. నీలం గుడ్డతో దాన్ని తయారు చేసారు. అది ఒక నిపుణుని పనితనం. 23 అంగీ మధ్యలో ఒక రంధ్రం ఉంది, ఆ రంధ్రం చుట్టూ ఒక గుడ్డ ముక్క కట్టబడింది. ఆ గుడ్డ ముక్క గోటు. ఆ రంధ్రం చినిగి పోకుండా ఉంచుతుంది.
24 తర్వాత నాణ్యమైన బట్ట నీలం, ఎరుపు ధూమ్ర వర్ణపు నారబట్ట ఉపయోగించారు. అంగీ అడుగు భాగానికి చుట్టూరా దానిమ్మలను కట్టారు. 25 తర్వాత స్వచ్ఛమైన బంగారంతో గంటలను వారు చేసారు. అంగీ అడుగు భాగాన దానిమ్మలకు మధ్య ఈ గంటలను వారు కట్టారు. 26 అంగీ అడుగు భాగం చుట్టూరా గంటలు, దానిమ్మలు ఉన్నాయి. ప్రతి దానిమ్మకూ మధ్య ఒక గంట వుంది సరిగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే యాజకుడు యెహోవాకు సేవ చేసేటప్పుడు ఈ అంగీని ధరించేవాడు.
27 అహరోనుకు, అతని కుమారులకు చొక్కాలను పనివారు తయారు చేసారు. నాణ్యమైన బట్టతో ఈ చొక్కాలు చేయబడ్డాయి. 28 ఇంకా పనివాళ్లు నాణ్యమైన బట్టతో తలపాగాలను చేసారు. తలకు లోపలను, ఏఫోదు తీర్పు పతకాల కింద ధరించే బట్టలను వాళ్లు తయారు చేసారు. నాణ్యమైన బట్టతో వాళ్లు వీటిని తయారు చేసారు. 29 నాణ్యమైన బట్ట నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్టతో నడికట్టును వారు తయారు చేసారు. బట్టతో చిత్రపటాలు కుట్టబడ్డాయి. యెహోవా ఆజ్ఞాపించినట్టే ఇవన్నీ చేయబడ్డాయి.
30 తర్వాత పవిత్ర కిరీటం కోసం ఒక బంగారు బద్ద తయారు చేసారు. దాన్ని స్వచ్ఛమైన బంగారంతో వాళ్లు చేసారు. బంగారం మీద వాళ్లు “యెహోవాకు పవిత్రం.” అనే మాటలు వ్రాసారు. 31 తర్వాత వాళ్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఆ బంగారు బద్దకు ఒక నీలసూత్రం కట్టి దాని తలపాగాకు కట్టారు.
పవిత్ర గుడారాన్ని మోషే తనిఖీ చేయటం
32 కనుక సన్నిధి గుడారపు పని అంతా అయిపోయింది. సరిగ్గా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు ప్రజలు సమస్తం చేసారు. 33 తర్వాత పవిత్ర సమావేశ గుడారాన్ని వారు మోషేకు చూపించారు. గుడారాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని వాళ్లు అతనికి చూపించారు. ఉంగరాలు, చట్రాలు, కమ్ములు, స్తంభాలు, దిమ్మలు, అన్నీ వాళ్లు అతనికి చూపించారు. 34 ఎరుపు రంగు వేయబడ్డ గొర్రె చర్మాలతో తయారు చేయబడిన గుడారపు పైకప్పును వారు అతనికి చూపించారు. పొట్టేళ్ల తోలుతో చేయబడ్డ పైకప్పును వారు అతనికి చూపించారు. మరియు శ్రేష్ఠమైన తోలుతో చేయబడ్డ పవిత్ర స్థల ప్రవేశానికి వేసే తెరను కూడా అతనికి చూపించారు.
35 ఒడంబడిక పెట్టెను వారు మోషేకు చూపించారు. ఆ పెట్టెను మోసేందుకు ఉపయోగించే కర్రలను, పెట్టెను మూసివుంచే మూతను వారు అతనికి చూపించారు. 36 బల్లను, గోనెమీద ఉంచే వాటన్నింటిని, దేవుని ప్రత్యేక రొట్టెను వారు మోషేకు చూపెట్టారు. 37 స్వచ్ఛమైన బంగారంతో చేయబడ్డ దీపస్తంభాన్ని, దాని మీద దీపాలను వారు మోషేకు చూపించారు. దీపాలకు ఉపయోగించే నూనె, ఇతర వస్తువులన్నింటిని వారు మోషేకు చూపించారు. 38 బంగారు బలిపీఠం, అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపం, గుడారపు ప్రవేశాన్ని మూసి వుంచే తెరను వారు అతనికి చూపించారు. 39 ఇత్తడి బలిపీఠమును, ఇత్తడి తెరను వారు అతనికి చూపించారు. బలిపీఠాన్ని మోసేందుకు ఉపయోగించే కర్రలను వారు మోషేకు చూపించారు. బలిపీఠం మీద ఉపయోగించే వస్తువులన్నింటినీ వారు మోషేకు చూపించారు. గంగాళాన్ని గంగాళం కింద ఉండే దిమ్మను వారు అతనికి చూపించారు. 40 ఆవరణలో స్తంభాలు, దిమ్మలతో ఉన్న తెరల గోడను మోషేకు వారు చూపించారు. ఆవరణ ద్వారాన్ని కప్పి ఉంచే తెరను వారు అతనికి చూపించారు. తాళ్లను, పవిత్ర గుడారపు మేకలను వారు. అతనికి చూపించారు. పవిత్ర గుడారంలో, సన్నిధి గుడారంలో ఉన్నవాటన్నింటినీ వారు అతనికి చూపించారు.
41 తర్వాత పవిత్ర గుడారంలో సేవలు చేసే యాజకుల కోసం తయారు చేయబడ్డ వస్త్రాలను వారు మోషేకు చూపించారు. యాజకుడైన అహరోను, అతని కుమారుల కోసం తయారు చేయబడ్డ ప్రత్యేక వస్త్రాలను వారు అతనికి చూపించారు. వారు యాజకులుగా సేవ చేసినప్పుడు ఆ వస్త్రాలు ధరించారు.
42 సరిగ్గా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు ప్రజలు ఈ పని అంతా చేసారు. 43 పని అంతటినీ మోషే చాలా సునిశితంగా పరిశీలించాడు. సరిగ్గా యెహోవా ఆజ్ఞాపించినట్టే పని జరిగినట్టు మోషే చూసాడు. కనుక వాళ్లను మోషే ఆశీర్వదించాడు.