నాజీరులు
6
మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఇశ్రేయేలీయులతో ఈ విషయాలు చెప్పు: ఒక పురుషుడు గాని స్త్రీగాని కొన్నాళ్ల పాటు ఒకరినుండి ఒకరు ప్రత్యేకంగా ఉండాలని కోరవచ్చును. ఈ ప్రత్యేకించు కోవటంలో ఉద్దేశం, అతడు ఆ వ్యవధిలో తనను తాను సంపూర్ణంగా యెహోవాకు అర్పించుకోవటమే. అతడు నాజీరు అని పిలువబడతాడు. ఆ కాలంలో అతడు ద్రాక్షామద్యంగాని ఇంకే మత్తు పానీయంగాని తాగకూడదు. ద్రాక్షారసంనుండి తీయబడిన చిరకను గాని ఇంకే మప్త సానీయంగాని అతడు తాగకూడదు. ద్రాక్షాపండ్లుగాని, ఎండిన ద్రాక్షాలుగాని అతడు తినకూడదు, ద్రాక్షారసం తాగకూడదు. వేరుగా ఉండే ఆ ప్రత్యేక సమయంలో ద్రాక్షానుండి వచ్చేది ఏదీ అతడు తినకూడదు. ద్రాక్షాగింజలను, దాని తోలును కూడ అతడు తినకూడదు.
“అలా వేరుగా ఉండే కాలంలో అతడు తన తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. అతడు వేరుగా ఉండాల్సిన రోజులు గడచిపోయేంతవరకు అతడు పవిత్రంగా ఉండాలి. అతడు తన వెంట్రుకలను పొడవుగా పెరగనివ్వాలి. అతడు దేవునికి చేసిన వాగ్దానంలో అతని తల వెంట్రుకలు ఒక భాగం. ఆ వెంట్రుకలను ఒక కానుకగా అతడు దేవునికి ఇస్తాడు. అందుచేత వేరుగా ఉండే సమయం అయిపోయేంత వరకు అతడు తన తల వెంట్రుకలను పొడవుగా పెంచాలి.
“నాజీరు వేరుగా ఉన్న సమయంలో, అతడు శవాన్ని సమీపించకూడదు. ఎందుచేతనంటే అతడు తనను తాను పూర్తిగా యోహోవాకు అర్పించుకొన్నాడు. అతని సొంత తండ్రి లేక తల్లి, సోదరుడు లేక సోదరి చనిపోయినా సరే అతడు వారిని తాకగూడదు. అలా తాకితే అతడు అపవిత్రుడవుతాడు. అతడు ప్రత్యేకించుకొన్నట్టు, పూర్తిగా యెహోవాకు అర్పించు కొన్నట్టు అతడు చూపెట్టుకోవాలి. అతడు వేరుగా ఉన్న కాలమంతటిలో తనను తాను పూర్తిగా యెహోవాకు అర్పించుకొన్నాడు. నాజీరు మరొకనితో ఉన్నప్పుడు, ఆ మరొకడు అకస్మాత్తుగా మరణించవచ్చును. చనిపోయినవానిని నాజీరు ముట్టినట్టయితే నాజీరు అపవిత్రుడవుతాడు. ఇలా జరిగినట్లయితే నాజీరు తన తల వెంట్రుకలను తీసివేయాలి. (ఆ వెంట్రుకలు అతని ప్రమాణంలో ఒక భాగం.) ఏడో రోజున అతడు తన వెంట్రుకలను తీసివేయాలి. ఎందుచేతనంటే ఆ రోజునే అతడు శుద్ధి చయబడ్డాడు. 10 ఎనిమిదో రోజున అతడు రెండు గువ్యలను, రెండు పావురపు పిల్లలను యాజకుని దగ్గరకు తీసుకుని రావాలి. పవిత్ర గుడార ద్వారం దగ్గరే అతడు వాటిని యాజకునికి ఇవ్వాలి. 11 అప్పుడు యాజకుడు పాపపరిహారార్థబలిగా ఒకదాన్ని అర్పిస్తాడు. రెండో దానిని దహన బలిగా అతడు అర్పిస్తాడు. ఈ దహనబలి ఆ మనిషి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం. (అతడు శవం దగ్గర ఉండటమే అతని పాపం.) అతడు తన తలవెంట్రుకలను దేవునికి ఇస్తానని ఆ సమయంలో మరల ప్రమాణం చేయాలి. 12 అనగా అతడు మరల ప్రత్యేకంగా ఉండేందుకు తనను యెహోవాకు అర్పించుకోవాలని దీని అర్థం. ఒక సంవత్సరం వయసు గల ఒక మగ గొర్రెపిల్లను అతడు తీసుకురావాలి. అపరాధ పరిహారార్థ బలిగా అతడు దీనిని ఇవ్వాలి. అతడు ప్రత్యేకంగా ఉన్న రోజులన్నీ మరచిపోవటం జరిగింది. అతడు మరల ప్రత్యేకంగా ఉండటం ప్రారంభించాలి. అతడు మొదటిసారి ప్రత్యేకంగా ఉన్నప్పుడు శవాన్ని ముట్టినందువల్ల ఇలా చేయాలి.
13 “ఆ మనిషి ప్రత్యేకంగా ఉండాల్సిన సమయం అయిపోయిన తర్వాత అతడు ఇలా చేయాలి: సన్నిధి గుడార ద్వారం దగ్గరకు అతడు వెళ్లాలి. 14 అక్కడ తన అర్పణను అతడు యెహోవాకు ఇవ్వాలి. అతని అర్పణ ఏమిటంటే:
దహనబలి కోసం ఒక్క సంవత్సరపు మగ గొర్రెపిల్ల. (ఈ గొర్రెపిల్లకు ఎలాంటి లోపం ఉండకూడదు.)
పాప పరిహారార్థబలి కోసం ఒక్క సంవత్సరపు ఆడ గొర్రెపిల్ల. (ఈ గొర్రెపిల్లకు ఎలాంటి లోపం ఉండ కూడదు.)
సమాధాన బలికోసం ఒక్క మగ గొర్రె (ఈ గొర్రెకు ఎలాంటి లోపం ఉండ కూడదు.)
15 ఒక గంపనిండా పొంగనిపిండి రొట్టెలు, (నూనెతో చేసిన మంచి గోధుమపిండి రొట్టెలు, ఈ రొట్టెల మీద నూనెపూయాలి).
ధాన్యార్పణ, పానార్పణ ఈ కానుకలలో భాగంగా వుండాలి.
16 “అప్పుడు యాజకుడు వీటిని యెహోవాకు అర్పిస్తాడు. పాపపరిహారార్థబలిని, దహనబలిని యాజకుడు అర్పిస్తాడు. 17 రొట్టెలబుట్టను యాజకుడు యెహోవాకు అర్పిస్తాడు. తర్వాత యెహోవాకు సమాధానబలిగా మగ గొర్రెను అతడు వధిస్తాడు. ధాన్యార్పణ, పానార్పణాలతో అతడు దానిని యెహోవాకు అర్పిస్తాడు.
18 “సన్నిధి గుడారపు ప్రవేశం దగ్గరకు వాజీరు వెళ్లాలి. యెహోవాకోసం అతడు పెంచిన తలవెంట్రుకలను అక్కడ అతడు తీసివేయాలి. సమాధాన బలియాగం క్రింద మండుతున్న మంటల్లో ఆ వెంట్రుకలు వేయబడుతాయి.
19 “నాజీరు తన తల వెంట్రుకలు తీసివేసిన తర్వాత, ఉడికిన మగ గొర్రె జబ్బను, గంపలో నుండి పెద్దది ఒకటి, చిన్నది ఒకటి, రెండు రొట్టెలను యాజకుడు అతనికి ఇస్తాడు. ఈ రెండు రొట్టెలు పులియని పిండితో చేయబడినవి. 20 అప్పుడు యాజకుడు వీటిని యెహోవా ముందర అల్లాడిస్తాడు. ఇది నైవేద్యము. ఇవి పవిత్రమైనవి, యాజకునికి చెందుతాయి. మరియు మగ గొర్రె బోర, తొడ యెహోవా ముందర అల్లాడించబడుతాయి. ఇవికూడా యాజకునికి చెందుతాయి. ఆ తర్వాత నాజీరు ద్రాక్షారసం తాగవచ్చును.
21 “ఒక వ్యక్తి నాజీరుగా ప్రత్యేకించబడాలని నిర్ణయించుకొంటే, అప్పుడు అతడు ఈ కానుకలన్నీ యెహోవాకు అర్పించాలి. నాజీరు ప్రయాణానికి సంబంధించిన చట్టం అది. అయితే ఒక వ్యక్తి ఇంతకంటె చాల ఎక్కువే యెహోవాకి ఇవ్వగలిగి ఉండొచ్చు. అలాంటివాడు ఎక్కువ చేస్తానని వాగ్దనంచేస్తే, అతడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. అది కూడ నాజీరు వాగ్దానపు చట్టమే.”
యాజకుని ఆశీస్సులు
22 మోషేతో యెహోవా ఇలా అన్నాడు: 23 “అహరోను, అతని కుమారులతో ఇలా చెప్పు. ఇశ్రేయేలు ప్రజలను మీరు ఈ విధంగా ఆశీర్వదించాలి. వారు ఇలా అనాలి:
24 ‘యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక.
25 యెహోవా తన ముఖకాంతిని నీపై ప్రకాశింప చేయును గాక.
ఆయన తన ప్రేమను నీకు కనబర్చును గాక.
26 యెహోవా నిన్ను చూచి,
నీకు సమాధానం అనుగ్రహించును గాక.’
27 అప్పుడు యెహోవా, ఈ విధంగా అహరోను, అతని కుమారులు ఇశ్రేయేలీయులను నా నామమును బట్టి ఆశీర్వదించినట్లు పలికినప్పుడు నేను వారిని ఆశీర్వదిస్తాను” అని చెప్పాడు.