ఎండిన ఎముకల దర్శనం
37
1 యెహోవా శక్తి నా మీదికి వచ్చింది. దేవుని ఆత్మ (సుడిగాలి రూపంలో) నన్ను నగరంనుండి ఎత్తుకుపోయి ఒక లోయ మధ్యలో దించింది. ఆ లోయ అంతా మానవ అస్థిపంజరాలతో నిండిఉంది.
2 లోయలో భూమిమీద ఎముకలు లెక్కకు మించి పడివున్నాయి. ఆ ఎముకల మధ్యగా యెహోవా నన్ను నడిపించాడు. ఎముకలు బాగా ఎండిపోయి ఉన్నట్లు నేను చూశాను.
3 నా ప్రభువైన యెహోవా నన్ను, “నరపుత్రుడా, ఈ ఎముకలు తిరిగి ప్రాణం పోసుకోగలవా?” అని అడిగాడు.
“నాప్రభువైన యెహోవా, ఈ ప్రశ్నకు సమాధానం నీకే తెలుసు” అని నేనన్నాను.
4 అందుకు నా ప్రభువైన యెహోవా ఇలా అన్నాడు: “ఆ ఎముకలతో నా తరపున మాట్లాడు. వాటికి ఈ విధంగా చెప్పు, ‘ఎండిన ఎముకల్లారా, యెహోవా మాట వినండి!
5 నా ప్రభువైన యెహోవా మీకు ఈ విషయాలు చెపుతున్నాడు: మీలోకి ఊపిరి వచ్చేలా చెస్తాను. మీరు ప్రాణం పోసుకుంటారు!
6 మీమీద మళ్లీ స్నాయువులు, కండరాలు కలుగజేస్తాను. మిమ్మల్ని చర్మంతో కప్పుతాను. పిమ్మట మీలో ఊపిరి పోస్తాను. మీరు బతుకుతారు! అప్పుడు ప్రభువును, యెహావాను నేనే అని మీరు తెలుసుకుంటారు.’”
7 ఆయన చెప్పిన రీతిలో నేను యెహోవా తరపున ఎముకలతో మాట్లాడాను. నేను ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఒక పెద్ద శబ్దం విన్నాను. ఎముకలలో గలగల శబ్దం వినవచ్చింది. ఒక ఎముకతో మరొక ఎముక కలవటం మొదలు పెట్టింది!
8 తరువాత నా కళ్ల ముందే వాటిమీద స్నాయువులు, కండరాలు ఏర్పడటం జరిగింది. వాటిమీద చర్మం కప్పివేయటం మొదలయింది. కాని శరీరాలు మాత్రం కదలలేదు. వాటిలో ఊపిరి లేదు.
9 పిమ్మట నా ప్రభువైన యెహోవా నాతో ఇలా అన్నాడు: “వాయువుతో మాట్లాడు. ఓ నరపుత్రుడా, ఊపిరితో మాట్లాడు. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని ఊపిరితో చెప్పు: ‘ఊపిరి, అన్ని దిశలనుండి నీవు వీచి ఈ శవాలలో జీవంపోయుము! వాటికి ఊపిరి పోయుము; అవి తిరిగిబతుకుతాయి!’”
10 ఆయన చెప్పిన విధంగా నేను యెహోవా తరపున ఆత్మతో మాట్లాడాను. వెంటనే శవాలలోకి ఊపిరి వచ్చింది. వాటికి ప్రాణం వచ్చి లేచి నుంచున్నాయి. అక్కడ ఎంతో మంది మనుష్యులున్నారు. వారంతా ఒక పెద్ద సైన్యం!
11 తరువాత నా ప్రభువైన యెహోవా నాతో ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఈ ఎముకలు మొత్తం ఇశ్రాయేలు వంశంలా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు, ‘మా ఎముకలు ఎండిపోయాయి. మా ఆశలు అడుగంటాయి. మేము సర్వనాశనమయ్యాము!’ అని అంటున్నారు.
12 కావున నీవు నా తరపున వారితో మాట్లాడి ప్రభువైన యెహోవా ఈ రకంగా చెపుతున్నాడని తెలుపు, ‘నా ప్రజలారా నేను మీ సమాధులను తెరచి, మిమ్మల్ని బయటికి తెస్తాను! పిమ్మట మిమ్మల్ని ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వస్తాను.
13 నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి, మిమ్మల్ని వాటినుండి బయటకు తెస్తాను! అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
14 నా ఆత్మను మీలో పెడతావును. దానితో మీరు మళ్లీ జీవిస్తారు. అప్పుడు మిమ్మల్ని మీ స్వదేశానికి తిరిగి నడపిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. ఈ విషయాలు నేనే చెప్పాను, వాటిని జరిగేలా చేశానని మీరు తెలుసుకుంటారు!’” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
యూదా, ఇశ్రాయేలు ఏకమవటం
15 యెహోవా వాక్కు నాకు మళ్నీ వినిపించింది. ఆయన ఇలా అన్నాడు:
16 “నరపుత్రుడా, ఒక కట్టెపుల్లను తెచ్చి ఈ వర్తమానం దానిమీద వ్రాయి, ‘ఈ పుల్ల యూదాకు, దాని స్నేహితులైన (తోటివారు) ఇశ్రాయేలీయులకు చెందింది.’ తరువాత మరో పుల్లను తీసుకొని దాని మీద; ‘ఈ ఎఫ్రాయిము పుల్ల యోసేపుకు, అతని స్నేహితులైన (తోటివారు) ఇశ్రాయేలీయులకు చెందింది,’ అని వ్రాయుము.
17 పిమ్మట ఆ రెండు పుల్లలను కలుపుము. నీ చేతిలో ఆ రెండూ ఒక్క పుల్లలా ఉంటాయి.
18 “దీని భావమేమిటని నీ ప్రజలు నిన్నడుగుతారు.
19 ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని వారికి చెప్పు. ‘ఎఫ్రాయిము చేతిలో ఉన్న యోసేపు పుల్లను మరియు అతని స్నేహితులగు ఇశ్రాయేలీయులను నేను తీసుకుంటాను. దానిని యూదా యొక్క పుల్లతో కలిపి ఒక్క పుల్లగా చేస్తాను. నా చేతిలో అవి ఒక్క కట్టె పుల్ల అవుతాయి!’
20 “నీకు ముందుగ వారి కండ్ల ఎదుట ఆ కర్రలను నీ చేతిలో ఎత్తి పట్టుకొనుము. ఆ పేర్లను ఆ కట్టెపుల్లల మీద నీవు వ్రాశావు.
21 నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెపుతున్నాడని అనుము, ‘వారు చెదరిపోయిన దేశాల నుండి ఇశ్రాయేలు ప్రజలను నేను తీసుకొంటాను. అన్ని చోట్ల నుండి వారిని సమావేశపర్చి, వారి స్వంత దేశానికి తిరిగి తిసుకొని వస్తాను.
22 ఇశ్రాయేలు పర్వతం మీద వారిని ఒక్క దేశంగా చేస్తాను. వారందరికి ఒక్కడే రాజు ఉంటాడు. వారు రెండు రాజ్యాలుగా కొనసాగరు. వారిక ఎంతమాత్రం రెండు రాజ్యాలుగా విడిపోరు.
23 వారి విగ్రహాలతోను, భయంకర శిల్పాలతోను, తదితర ఘోరమైన నేరాలతోను వారు తమను తాము మలినపర్చు కోవటం కొనసాగించరు. వారెక్కడున్నా వారి భయంకర పాపాలన్నిటి నుండి వారిని నేను కాపాడుతాను. నేను వారిని కడిగి పవిత్ర పర్చుతాను. వారు నా ప్రజలవుతారు. నేను వారికి దేవుడనై యుంటాను.
24 “‘నా సేవకుడైన దావీదు వారికి రాజుగా ఉంటాడు. వారంతా ఒకే ఒక్క కాపరిని కలిగి ఉంటారు. వారు నా నీతికి, న్యాయానికి బద్ధులై జీవిస్తారు. నేను చెప్పినవన్నీ వారు చేస్తారు.
25 నేను సేవకుడైన యాకోబుకు ఇచ్చిన భూమి మీద వారు నివసిస్తారు. నీ పూర్వీకులు ఆ ప్రదేశంలో నివసించారు. నా ప్రజలూ అక్కుడే నివసిస్తారు.వారు, వారి పిల్లలు మరియు వారి మనుమలు అక్కడే శాశ్వతంగా నివసిస్తారు. మరియు నా సేవకుడైన దావీదు సదా వారికి రాజై ఉంటాడు.
26 నేను వారితో శాంతి ఒడంబడిక ఒకటి చేసుకుంటాను. ఈ ఒడంబడిక ఎల్లకాలం కొన సాగుతుంది. వారి దేశాన్ని వారికి ఇవ్వటానికి నేను అంగీకరించాను. వారి సంతానం విస్తారమవడానికి నేను అంగీకరించాను. పైగా నా పవిత్ర స్థలాన్ని అక్కడ శాశ్వతంగా వారితో ఉంచటానికి నేను అంగీకరించాను.
27 నా పవిత్ర గుడారం వారి మధ్య అక్కడ ఉంటుంది. అవును,నేను వారి దైవంగా, వారు నా ప్రజలుగా ఉంటాము.
28 మరియు ఇతర దేశాలు కూడ నేను యెహోవానని తెలుసుకుంటాయి. నా పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉంచటం ద్వారా నేను ఇశ్రాయేలీయులను నా ప్రత్యేక జనులుగా చేశానని కూడ వారు తెలుసుకుంటారు.’”